ఈరోజు ముఖ్య వార్తలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కరోనా మహమ్మారిపై పోరులో కీలకపాత్ర పోషిస్తున్న వైద్య సిబ్బందిపై దాడులను కేంద్ర సర్కారు తీవ్రంగా పరిగణించింది.

భారత్‌లో 20 వేలు దాటిన కరోనా కేసులు
భారత దేశంలో గడిచిన 24 గంటల్లో 1486 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,471కి పెరిగింది. కరోనా బారినపడి బుధవారం 49 మంది మరణించడంతో మృతుల సంఖ్య 652కి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా బారిన పడి కోలుకుంటున్న రికవరీ రేటు 19.36 శాతంగా నమోదైంది. 618 మంది రోగులు కరోనా వైరస్‌ నుంచి కోలుకోవడంతో రికవరీ రేటు మెరుగైంది.

డాక్టర్లపై దాడి చేస్తే ఏడేళ్ల వరకు జైలు
కరోనా మహమ్మారిపై పోరులో కీలకపాత్ర పోషిస్తున్న వైద్య సిబ్బందిపై దాడులను కేంద్ర సర్కారు తీవ్రంగా పరిగణించింది. డాక్టర్లు, వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఆర్డినెన్స్‌ తేవాలని నిర్ణయించింది. బుధవారం జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వైద్య సిబ్బందిపై దాడులకు దిగితే కఠిన నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టాలని.. చట్టప్రకారం మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా 1897 ఎపిడెమిక్‌ చట్టంలో సవరణలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దోషులకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల జరిమానా విధించడంతో పాటు ఆస్పత్రి ఆస్తులు ధ్వంసం చేస్తే మార్కెట్‌ విలువకు రెట్టింపు జరిమానా వసూలు చేయనుంది. వైద్యులు, ఆశావర్కర్లు, సిబ్బందికి రూ. 50 లక్షల బీమా సౌకర్యం కల్పించనుంది.

కరోనా పరీక్షల్లో ఏపీ టాప్‌
కరోనా వైరస్‌ నిర్ధారిత పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచింది. పది లక్షల మందికి సగటున ఆంధ్రప్రదేశ్‌లో 830 మందికి పరీక్షలు నిర్వహించి దేశంలోనే టాప్‌లో ఉంది. ఇక ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 56 కోవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 813కు చేరింది. వీరిలో చికిత్స అనంతరం 120 మంది డిశ్చార్జ్‌ కాగా, మొత్తంగా 24 మంది మరణించారు. ఇక కరోనా బారిన పడి ప్రస్తుతం 669 మంది చికిత్స పొందుతున్నారు.

వెనక్కి తగ్గిన మమతా బెనర్జీ
కోవిడ్-19 పరిస్థితులను సమీక్షించేందుకు వచ్చిన కేంద్ర బృందాలపై విమర్శలు గుప్పించిన మమతా బెనర్జీ సారథ్యంలోని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులకు కట్టుబడి ఉంటామని బుధవారం స్పష్టం చేసింది. కరోనా వైరస్ పరిస్థితులను అంచనా వేసేందుకు డిప్యూట్ చేసిన కేంద్ర బృందాలకు మమతా బెనర్జీ సర్కార్ ఆటంకాలు కలిగిస్తోందంటూ కేంద్రం మండిపడిన నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ప్రధాన కార్యదర్శి కేంద్రానికి ఈమేరకు వివరణ ఇచ్చారు.

సాధువుల హత్య కేసులో ముస్లింలు లేరు
మహారాష్ట్ర పాల్‌ఘర్‌లో సాధువుల హత్య కేసులో అరెస్టైన నిందితుల జాబితాను ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం విడుదల చేసింది. 101 మంది నిందితుల్లో ఒక్క ముస్లిం కూడా లేరని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. ఈ ఘటనపై సీఐడీ విచారణ కొనసాగుతుండగానే ప్రభుత్వం ఈ జాబితా విడుదల చేసింది. సాధువుల హత్య కేసులో ముస్లింలు ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ జాబితా విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరోసారి సీఎంలతో మోదీ చర్చలు
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈనెల 27న సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ చర్చలు జరపనున్నారు. లాక్‌డౌన్ అమలుతో సహా కోవిడ్-19 కట్టడికి తీసుకుంటున్న చర్యలు, తాజా పరిస్థితులను ముఖ్యమంత్రులతో మోదీ సమీక్షిస్తారు. కరోనాపై పోరాటంలో భాగంగా లాక్‌డౌన్ అనంతరం ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడటం ఇది మూడోసారి కావడం గమనార్హం. కాగా, ఈనెల 26న ‘మన్‌ కీ బాత్‌’లో భాగంగా రేడియోలో మోదీ ప్రసంగించనున్నారు.

ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి వార్నింగ్‌
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ఇరాన్‌కు తీవ్రస్థాయిలో హెచ్చరిక జారీ చేశారు. అరేబియా సముద్రంలో తమ ఓడలకు అడ్డుతగులుతున్న ఇరాన్‌ నౌకలను ధ్వంసం చేయాలని ఆదేశాలిచ్చారు. ‘మా ఓడలకు అడ్డంకులు సృష్టిస్తున్న ఇరాన్‌ గన్‌బోట్లను కాల్చిపారేసి ధ్వంసం చేసేయ్యాలని అమెరికా నావికా దళానికి ఆదేశాలు ఇచ్చాన’ని ట్రంప్‌ ట్వీట్‌ బుధవారం చేశారు. అయితే అమెరికా ఆరోపణలను ఇరాక్‌ తిరస్కరించింది.

జియోలో ఫేస్‌బుక్‌ భారీ పెట్టుబడి
రిలయన్స్‌ టెలికాం యూనిట్‌ జియోలో ఫేస్‌బుక్‌ భారీ పెట్టుబడి పెట్టింది. మొత్తం 5.7 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ. 43,574 కోట్లు) పెట్టుబడి పెట్టినట్టు ఫేస్‌బుక్‌ బుధవారం ప్రకటించింది. జియోలో 9.9 శాతం వాటాను ఫేస్‌బుక్‌ కొనుగోలు చేసింది. దీంతో జియోలో అతిపెద్ద మైనారిటీ వాటాను ఫేస్‌బుక్‌​ దక్కించుకున్నట్టయింది. ఫేస్‌బుక్ పెట్టుబడి తరువాత జియో ప్లాట్ ఫామ్స్ విలువ రూ. 4.62 లక్షల కోట్లకు పెరగనుంది. దేశంలోని టెక్నాలజీ రంగంలో ఇదే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని రిలయన్స్‌ వెల్లడించింది.

RELATED ARTICLES

Latest Updates