మృతులంతా మర్కజ్‌కు వెళ్లిన వాళ్లే

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • మరో ముగ్గురి మృతి
  • తాజాగా 30 మందికి పాజిటివ్‌
  • అంతా నిజాముద్దీన్‌ వెళ్లొచ్చిన వారే
  • ఇప్పటివరకు 130 కేసులు 9 మరణాలు
  • ఢిల్లీ వెళ్లిన వారందరికీ పరీక్షలు
  • వారి బంధువులూ చేయించుకోవాలి
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు

 హైదరాబాద్‌ : తెలంగాణలో బుధవారం ఒక్కరోజే 30 కరోనా కేసులు నమోదయ్యాయని, ముగ్గురు మరణించారని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు, ప్రైవేటు కార్పొరేట్‌ ఆస్పత్రిలో మరొకరు మరణించినట్లు వెల్లడించింది. దాంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మరణాల సంఖ్య తొమ్మిదికి చేరింది. కరోనా సోకిన ముప్పయి మంది, మరణించిన ముగ్గురు ఇటీవల నిజాముద్దీన్‌ మర్కజీకి వెళ్లివచ్చిన వారేనని సీఎం కార్యాలయం వెల్లడించింది. అంతకు ముందు మరణించిన ఆరుగురు కూడా నిజాముద్దీన్‌కు వెళ్లొచ్చిన వారేనని  ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో నిజాముద్దీన్‌ మర్కజీకి వెళ్లి వచ్చిన వారందరికీ కరోనా కిట్‌ ద్వారా పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో తగ్గుముఖం పట్టినట్లే కనిపించి, కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం మధ్యాహ్నం నుంచి అర్థరాత్రి వరకు సుదీర్ఘంగా ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. మధ్యలో సాయంత్రం పూట గవర్నర్‌ను కలిసి రాష్ట్రంలో పరిస్థితిని వివరించారు. ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఆరోగ్య శాఖముఖ్య కార్యదర్శి శాంతకుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, హెల్త్‌ వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా కొద్ది మందికే కరోనా వ్యాపించిందని, అది పూర్తిగా అదుపులోకి వచ్చిందని సమీక్షలో సీఎం పేర్కొన్నారు. వారిలో ఎవరూ చనిపోలేదని ప్రస్తావించారు.

గత కొద్ది రోజులుగా నమోదవుతున్న కేసులన్నీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారివేనని గుర్తు చేశారు. అందుకే, అక్కడికి వెళ్లి వచ్చిన వారందరికీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇంకా 300 మందికి పరీక్ష చేయాల్సి ఉందని తేల్చారు. కుటుంబ సభ్యులు, సన్నిహితంగా ఉన్న వారు కూడా వెంటనే ఆస్పత్రికి వచ్చి పరీక్ష చేయించుకోవాలని సీఎం కోరారు. వారి కుటుంబ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పరీక్షకు ముందుకు రావాలని కోరారు. కరోనా వ్యాప్తి చెందకుండా చూడాలంటే లాక్‌డౌన్‌ను విజయవంతం చేయాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. కొద్ది రోజుల పాటు ప్రజలు సహకరిస్తే వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. కరోనా వైరస్‌ బాధితులకు వైద్యం అందిస్తున్న వైద్య సిబ్బంది భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ప్రకటించారు. వైద్య సిబ్బందికి అవసరమైన పీపీఈ కిట్లు, ఎన్‌95 మాస్కులు, హైడ్రాక్సిక్లోరోక్విన్‌ మాత్రలు, అజిత్రోమైసిన్‌ మాత్రలు సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. వైద్య పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన మెడికల్‌ కిట్లు కూడా ఉన్నాయని చెప్పారు.. వ్యాధి వచ్చిన వారి చికిత్సకు, వైద్య సిబ్బంది భద్రతకు, వైరస్‌ వ్యాప్తి చెందకుండా చూసేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

అంతకుముందు గవర్నర్‌ను కలిసిన సీఎం కరోనా వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రధానితో గురువారం జరిగే వీడియో కాన్ఫరెన్స్‌ గురించి చర్చించారు. మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులున్నారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates