టెన్త్‌ పరీక్షలపై వీడిన ఉత్కంఠ

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో తప్పా మిగతా జిల్లాల్లో పరీక్షలు పెట్టేందుకు తెలంగాణ ఉన్నత న్యాయస్థానం శనివారం అనుమతి ఇచ్చింది.

హైదరాబాద్‌: తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. టెన్త్‌ పరీక్షల నిర్వహణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో తప్పా మిగతా జిల్లాల్లో పరీక్షలు పెట్టేందుకు ఉన్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. విద్యార్థులకు కరోనా వైరస్‌ సోకకుండా పరీక్షా కేంద్రాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలని, ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. హైకోర్టు అనుమతి ఇవ్వడంతో పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి.

విద్యార్థుల జీవితాలే ముఖ్యం
జీహెచ్‌ఎంసీ పరిధిలోని విద్యార్థులకు తర్వాత సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించాలని, పాసైన వారిని రెగ్యులర్‌ విద్యార్థులుగానే గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. జీహెచ్ఎంసీ పరిధిలో విద్యార్థులకు కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని పరీక్షలకు అనుమతివ్వాలన్న ప్రభుత్వ విన్నపాన్ని ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రస్తుతం నెలకొన్న ప్రమాదకర పరిస్థితుల్లో కరోనాతో ఎవరైనా విద్యార్థి మరణిస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? విద్యార్థి మరణిస్తే ఆ కుటుంబానికి ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తారు? ఎగ్జామ్‌ సెంటర్లు ఉన్న ప్రాంతాలు కంటైన్‌మెంట్‌ జోన్లుగా మారితే ఏం చేస్తారు? అని హైకోర్టు ప్రశ్నలు సంధించింది. పరీక్షల కన్నా విద్యార్థుల జీవితాలే ముఖ్యమని, వారిని ప్రమాదంలోకి నెట్టే చర్యలను సమర్థించబోమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా 10 రోజులకోసారి పరిస్థితి సమీక్షించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి. విజయసేన్‌రెడ్డిలతో కూడిన బెంచ్‌ ఆదేశించింది. పరీక్షలు జరుగుతున్న ప్రాంతాల్లో కరోనా కేసులు పెరిగితే అక్కడ వాయిదా వేసేలా నిర్ణయం తీసుకోవాలని చెబుతూ తదుపరి విచారణ ఈనెల 19 వ తేదీకి వాయిదా వేసింది.

మిశ్రమ స్పందన
హైకోర్టు తీర్పుపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలను వాయిదా వేసివుంటే బాగుండేదని కొంత మంది అభిపప్రాయపడ్డారు. ఇప్పటికైనా పరీక్షల నిర్వహణకు అనుమతి ఇచ్చి ఉపశమనం కలిగించారని మరికొంత మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

Latest Updates