తెలంగాణలో టెస్టులు పెంచాలి

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • పరీక్షలు తక్కువ చేస్తూ, పాజిటివ్‌లు ఎక్కువున్న రాష్ట్రాల నుంచే ఎక్కువ కేసులు
  • బిహార్‌, గుజరాత్‌, యూపీ, బెంగాల్‌ కూడా
  • 10 రాష్ట్రాల్లోనే 80% కరోనా కేసులు
  • అక్కడ వైర్‌సను ఓడిస్తే దేశం గెలుస్తుంది
  • కట్టడిలో ఆ పది రాష్ట్రాల బాధ్యత ఎక్కువ
  • వాటి సీఎంలు అందరూ సమావేశం కావాలి
  • ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌
  • నిఘా, కట్టడి, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌.. ఆయుధాలు
  • ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోందన్న మోదీ
  • మరణాల సంఖ్యను తెలపాలి: కేంద్ర ఆరోగ్య శాఖ

న్యూఢిల్లీ : ‘‘దేశవ్యాప్తంగా 80 శాతం కరోనా కేసులు కేవలం 10 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఆ పది రాష్ట్రాల్లోనూ వైర్‌సను ఓడిస్తే, మహమ్మారిపై దేశం గెలుస్తుంది. మహమ్మారిపై పోరాటంలో నిఘా, కట్టడి, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ అద్భుతమైన ఆయుధాలని ఇప్పటి వరకూ మన అనుభవం చెబుతోంది. వైరస్‌ సోకిన 72 గంటల్లో కనక గుర్తించగలిగితే.. కరోనాను చాలా వరకూ కట్టడి చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. పాజిటివ్‌ వ్యక్తులను కలిసిన వారిని గుర్తించడం.. 72 గంటల్లోపు వారికి పరీక్షలు చేయడం.. ఇకపై ఇదే మన మంత్రం కావాలి’’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

తక్కువ పరీక్షలు చేస్తూ, పాజిటివ్‌ శాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు మరీ ముఖ్యంగా, బిహార్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, తెలంగాణల్లో పరీక్షల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని నిర్దేశించారు. దేశంలో యాక్టివ్‌ కేసులు ఆరు లక్షలకుపైగా ఉన్నాయని, వీటిలో అత్యధికం ఆ పది రాష్ట్రాల నుంచేనని వివరించారు. అందుకే, కరోనాపై పోరాటంలో ఆ పది రాష్ట్రాల బాధ్యత చాలా ఎక్కువని చెప్పారు. పరీక్షలను నిర్వహిస్తేనే కరోనాను సమర్థంగా అరికట్టగలమని స్పష్టం చేశారు. కరోనా పరిస్థితిపై ఆంఽధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళ నాడు, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, బిహార్‌, గుజరాత్‌, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మంగళవారం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో మహమ్మారి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను చర్చించారు. ుూమీ పది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఒకచోట సమావేశంకండి. చర్చించుకోండి. మీమీ రాష్ట్రాల్లో పరిస్థితిపై సమీక్షించండి. తద్వారా, ఒకరి అనుభవాల నుంచి మరొకరు ఎంతో నేర్చుకోవచ్చు. ఎక్కడెక్కడ మంచి మంచి పద్ధతులు అవలంబించారో తెలుస్తుంది’’ అని సూచించారు. వైర్‌సకు సంబంధించి కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయని, అందుకే, ఇటువంటి సమావేశాలు, చర్చలు తప్పనిసరి అని ముఖ్యమంత్రులకు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు పెరుగుతోందని, తద్వారా, ప్రభుత్వం సమర్థంగా చర్యలు తీసుకుంటోందని అర్థమవుతోందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.

దేశంలో మరణాల సగటు శాతం తగ్గుతుండడం సంతోషం కలిగించే అంశమని, ఇంకా చెప్పాలంటే, ప్రపంచ సగటు కంటే కూడా దేశంలో తక్కువగా ఉందని చెప్పారు. అతి త్వరలోనే మరణాల రేటు ఒక శాతం కంటే తక్కువకు వచ్చేస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. ‘‘దేశంలో రోజుకు దాదాపు 7 లక్షల పరీక్షలు చేస్తున్నాం. వీటి సంఖ్య ఇంకా పెరుగుతోంది. తద్వారా, వైర్‌సను ముందే గుర్తించడానికి, కట్టడి చేయడానికి వీలవుతోంది. మరణాల రేటు భారీగా తగ్గుతోంది. యాక్టివ్‌ కేసులు కూడా తగ్గుతున్నాయి. అదే సమయంలో, రికవరీ రేటు పెరుగుతోంది’’ అని వివరించారు. ప్రజలు తమంతట తాము కరోనా గురించి తెలుసుకుని, ఇళ్లలోనే వేరుగా ఉండి వ్యాధిని తగ్గించుకోవడం మంచి పరిణామమని అన్నారు.

ఓ సందర్భంలో, ఉత్తరప్రదేశ్‌, హరియాణా, ఢిల్లీల్లో నమోదైన కేసులు ఆందోళన కలిగించాయని తెలిపారు. అయితే, ఢిల్లీ, దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లో కరోనా నియంత్రణకు హోం మంత్రి అమిత్‌ షా చేసిన కసరత్తును వివరించారు. కట్టడి జోన్ల విభజన, రిస్కు ఎక్కువ ఉన్నవారి స్ర్కీనింగ్‌పై ఎక్కువ దృష్టి సారించడం అమిత్‌ షా వ్యూహంలో కీలకమని వివరించారు. అనంతరం, కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనాను విజయవంతంగా కట్టడి చేయడంలో ప్రధాని మోదీ నాయకత్వాన్ని ముఖ్యమంత్రులంతా కొనియాడారని, ఎప్పటికప్పుడు తమకు మార్గనిర్దేశం, సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఆర్టీపీసీఆర్‌ పరీక్షలకు అయ్యే ఖర్చులో సగం కేంద్రం భరించాలని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కోరారు. అలాగే, అత్యాధునిక వెంటిలేటర్ల కొనుగోలుకు ఆర్థిక సహకారం అందించాలన్నారు.

రెండోసారి రాకుండా చర్యలు: ఠాక్రే
కరోనా రెండోసారి రాకుండా నియంత్రించడానికి చర్యలు తీసుకుంటున్నామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే చెప్పారు. ఇందుకు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఆస్పత్రులు నిర్మిస్తామన్నారు. కరోనాకు సంబంధించి ఒక్క కేసును కానీ, ఒక్క మరణాన్ని కానీ మహారాష్ట్ర దాచలేదని స్పష్టం చేశారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates