ఆర్టీసీ మహిళా కార్మికుల సమస్యలకు అంతం లేదా?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 కె. నాగలక్ష్మి

టీఏస్‌ఆర్టీసీలో సమ్మె ముగిసిన అనంతరం డిసెంబరు ఒకటిన ప్రతి డిపో నుంచి ఇద్దరు మహిళలు సహా 5మంది కార్మికులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో విందుకు ఆహ్వానించారు. ఆనాటి సమావేశంలో ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం అనేక వరాలు కురిపించారు. కార్మికులకు ఏ సమస్య వచ్చినా వెల్ఫేర్‌ కమిటీల ద్వారా పరిష్కరిస్తామనీ, భవిష్యత్తులో కార్మికులకు యూనియన్ల అవసరం ఉండదనీ.. ఇక రెండేండ్ల వరకూ గుర్తింపు యూనియన్ల ఎన్నికలనూ రద్దుచేస్తున్నామనీ ప్రకటించారు. 55 రోజుల సమ్మె వేతనాలు చెల్లిస్తామనీ, అందరికీ ఒక ఇంక్రిమెంట్‌ ఇస్తామనీ, రిటైర్మెంట్‌ వయస్సును 58 సంవత్సరాల నుంచి 60కి పెంచుతామనీ హామీ యిచ్చారు. టెంపరరీ ఉద్యోగుల సర్వీసుల్ని పర్మినెంట్‌ చేస్తామనీ, సింగరేణి కార్మికులకులాగే ప్రతి ఏడాదీ బోనస్‌ చెల్లిస్తామనీ అన్నారు. అంతేకాక పీఎఫ్‌ బకాయిలనూ, కో- ఆపరేపేటివ్‌ సొసైటీ బకాయిలనూ ప్రభుత్వం చెల్లిస్తుందనీ, ఏటా 1000 కోట్ల బడ్టెట్‌ విడుదలచేసి ఆర్టీసీని లాభాలబాట పట్టిస్తామనీ, కార్మికులకు ఉద్యోగభద్రత కల్పిస్తామనీ చెప్పారు. దీనితో మహిళలు సహా ఆర్టీసీ కార్మికులందరూ తమ కష్టాలు తొలగిపోయాయని ఆనందించారు.

కేసీఆర్‌ తమ పాలిట దేవుడని పొంగిపోయి ఉత్సాహంగా విధుల్లో చేరారు. కానీ, సమ్మె తరువాత అధికారుల వైఖరి చూస్తుంటే పొమ్మనలేక పొగబెట్టిన చందంగా వుందని పలువురు కార్మికులు వాపోతున్నారు. కార్మికులకు యూనియన్లను దూరంచేసి తమ సమస్యలపై ప్రశ్నించే గొంతులను అణచివేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చిన్న చిన్న కారణాలతో కార్మికులపై వేధింపులకు పాల్పడుతున్నారు. ఎవరైనా గొంతెత్తి ప్రశ్నిస్తే.. ‘నో డ్యూటీ’ అని వారిని పక్కన కూర్చోబెట్టటం, డ్యూటీకి రెండు నిమిషాలు ఆలస్యమైనా, ఆబ్సెంటులు వేయటం సర్వసాధారణమైంది. ఎవరైనా అత్యవసరమై సెలవు అడిగినా మంజూరు చేయటం లేదు. దీనికితోడు డ్యూటీ అవర్స్‌ పెంచటంతో ప్రతి కార్మికుడూ, కార్మికరాలూ ఏ ప్రతిఫలం లేకుండానే అదనంగా రెండు గంటలు డ్యూటీ చేయాల్సి వస్తున్నది.

సమ్మె తరువాత మహిళా కార్మికుల అవస్థలు మరింత పెరిగాయి. మహిళా సమస్యలపై ప్రత్యేక కమిటీ వేస్తామని చెప్పినా ఇప్పటివరకూ అటువంటి కమిటీ జాడేలేదు. ఉన్న వెల్ఫేర్‌ కమిటీలు కార్మికుల సమస్యలను తెలుసుకోవటం మాని డమ్మీలుగా మారి ప్రభుత్వం చెప్పిన పాఠాలనే వల్లెవేస్తున్నాయి. ప్రగతిభవన్‌ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ మహిళలకు భద్రత కల్పించే పేరుతో మహిళా కండక్టర్లందరికీ మొదటి షిఫ్టు డ్యూటీలను అంటే ఉదయం షిఫ్టులు వేయటానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ నిర్ణయంపైకి బాగానే కనిపించినా వాస్తవంగా ఈ మొదటి షిఫ్టు డ్యూటీలతో మహిళలు మరిన్ని ఇబ్బందులపాలవు తున్నారు. మొదటి షిఫ్టు డ్యూటీలంటే ఉదయం 4.30 గంటలలోపే రిపోర్టుచేయాలి. సీనియారిటీ ప్రకారం డ్యూటీలు ఉదయం 4.30 నుంచి కేటాయిస్తున్నారు. ఉదయం 4.30 గంటలకు ఒక మహిళ డ్యూటీకి రావాలంటే డిపోలకు దూరంగా నివాసం ఉండే మహిళలు తమ ఇంటి నుంచి కనీసం 3.30 గంటలకు బయలుదేరాలి. ఇంకా దూరంగా ఉండే మహిళలు తెల్లవారు జామున 3 గంటలకే బయలుదేరాల్సి వస్తున్నది. అంత పొద్దున్నే వారు ఇంటి నుంచి రావాలంటే వారికి ఆ సమయంలో రవాణా సదుపాయం ఉండదు. అంతేకాదు, ఆ సమయంలో రోడ్లపై జన సంచారం కూడా ఉండదు. కనుక వారికి రక్షణ కూడా ఉండదు. ప్రతిరోజూ ఇంట్లో ఎవరో ఒకరి సాయంతో సదరు డిపోలకు రావాల్సి వస్తున్నది. దీంతో ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా ప్రతిరోజూ అసౌకర్యం కలుగు తున్నది. అంతేకాక మహిళలు ఇంట్లో ఉదయం వేళల్లో అనేక బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది.

చిన్న పిల్లలున్న మహిళలైతే వారిని స్కూళ్లకు తయారుచేయటం, వంటా వార్పూ, పిల్లలకు టిఫిన్‌ బాక్సులు సర్దిపెట్టటం యిలా.. రకరకాల బాధ్యతలుంటాయి. ఉదయం 4.30 గంటలకే డ్యూటీలకు అందుకోవాలంటే పిల్లలు నిద్రలేవకముందే వారు డ్యూటీలకు ఆదరాబాదరాగా పరుగులు పెట్టాల్సి రావటంతో కుటుంబసభ్యులందరికీ అసౌకర్యమే కాదు, పిల్లలను సరిగా బడికి పంపలేక వారు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. మొత్తం కుటుంబ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారవుతున్నది. ఈ విధమైన డ్యూటీలు కాకుండా తాము ఎంపిక చేసుకొనే సమయాన్ని బట్టి డ్యూటీలు సర్దుబాటు చేయాలని మహిళలు కోరుకుంటున్నారు. కానీ, వారి మొర ఆలకించేవారే లేరు. అంతేకాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ డిసెంబరు ఒకటిన ప్రగతి భవన్‌ సమావేశంలో మాట్లాడుతూ.. 20 రోజుల గడువులోపలే ప్రతి డిపోలో మహిళలకు ప్రత్యేక టాయిలెట్స్‌, డ్రెసింగ్‌ రూమ్స్‌, డైనింగ్‌ రూమ్స్‌ ఏర్పాటుచేస్తామనీ, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవుతోపాటు, మూడు నెలల పిల్లల సంరక్షణ (చైల్డ్‌ కేర్‌) సెలవు కూడా ఇస్తానని చెప్పారు. కానీ, ఆచరణలో ఇవేవీ అమలయ్యే పరిస్థితులు కనిపించటం లేదు.
చాలా డిపోలలో కనీసం టాయిలెట్‌ సదుపాయాలు కూడా సరిగాలేక మహిళా ఉద్యోగులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనితో వారు గంటలతరబడి నీళ్ళు తాగకుండా డ్యూటీలు చేస్తూ అనేక వృత్తి, రుగ్మతలకు గురవు తున్నారు. ఎవరికైనా అత్యవసరమై సెలవు అడిగితే మహిళలని కూడా చూడకుండా డీఎవమ్‌లు సెలవులు ఇవ్వటానికి నిరాకరిస్తున్నారు. దీనితోవారు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.

ఇంకొకవైపు నస్టాల పేరుతో ప్రయాణికులపై చార్జీల భారం మోపిన ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఒక్క హైదరాబాద్‌ జోన్‌లోనే 1069 బస్సులను రద్దుచేసింది. దీనితో అటు ఆర్టీసీ కార్మికులకు డ్యూటీలు సరిగా ఇవ్వకుండా వేధించడమేకాక, ఇటు ప్రజలు కూడా సరిపడా బస్సులు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులుపడే పరిస్థితులేర్పడ్డాయి. రద్దుచేసిన బస్సుల స్థానంలో 1360 అద్దె బస్సులను తెస్తామని చెప్పారు. కానీ, ఇప్పటికి 68 బస్సులు మాత్రమే వచ్చాయి. దీనితో యాజమాన్యం కార్మికులకు సరిగా డ్యూటీలు ఇవ్వకుండా వారికి రోడ్లపై డ్యూటీలు వేస్తోంది. బస్సులలో విధులు నిర్వహించాల్సిన కార్మి కులు కర్రలు పట్టుకొని రోడ్లపై నిల్చొని ప్రయాణికు లను బస్సుల్లో ఎక్కించే పనిలో ఉండాల్సి వస్తున్నది. ఇదేమని ప్రశ్నిస్తే.. నో డ్యూటీ అనీ, ఆబ్సెంట్‌ వేస్తామనీ బెదిరించడమేకాక.. వారిని టార్గెట్‌చేసి ఇచ్చే చార్జ్‌షీట్లకూ, మెమోలకు కొదవేలేదు.

తెలంగాణ రాష్ట్రం వస్తే తమ బాధలన్నీ తీరిపోతాయని భావించి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆర్టీసీ మహిళా కార్మికులే కాదు, మొత్తం కార్మికులందరూ తీవ్ర ఒత్తిడీ, వేధింపులకూ గురవుతున్నారు. తమ జీవితాలు అగమ్యగోచరంగా మారిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా యాజమాన్యాలు కార్మికులపట్ల తమ వైఖరి మార్చుకోవాలి. ప్రతినిత్యం లక్షలాదిమందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతూ తమ ఆరోగ్యాలను సైతం ఫణంగా పెట్టి ప్రజలకు సేవలందిస్తున్న ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలి. ప్రజా రవాణా మెరుగుగా పనిచేస్తేనే అటు మహిళా కార్మికులతోపాటు ఇటు ప్రయాణికులు కూడా సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరగలుగుతారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates