సాయం అందితే తప్ప పరిశ్రమలు సాగవు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

లాక్‌డౌన్‌తో ఎంఎ్‌సఎంఈలు కుదేలు.. 20 లక్షల మంది ఉపాధికి గండి

హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ కారణంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎ్‌సఎంఈ)  కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలో పారిశ్రామిక ఉత్పత్తులను పునఃప్రారంభించడం ఎలా అని ఎంఎ్‌సఎంఈ యజమానులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకున్న యజమానులు కొంత మేర నష్టాలను భరించి తిరిగి పనులు చేపట్టడానికి సమాయత్తమవుతుండగా.. మరికొందరు యూనిట్ల మూసివేతే శరణ్యమని భావిస్తున్నారు. స్వయం ఉపాధి యూనిట్లకు ముడి సరుకులు లేక, ఉత్పత్తి చేసిన సరుకులకు మార్కెట్‌ లేక ఆర్థిక సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. భారీ పరిశ్రమలు  ఏదో రకంగా ఉత్పత్తులను ప్రారంభించే అవకాశం ఉన్నప్పటికీ ఎంఎ్‌సఎంఈలు మాత్రం ప్రభుత్వ సాయం అందనిదే కొనసాగే అవకాశాలు కన్పించడం లేదు. లాక్‌డౌన్‌ సమయంలో కార్మికులు, ఉద్యోగులను ఎట్టి పరిస్థితుల్లో తొలగించరాదని, ఆ సమయంలో వారికి పూర్తిస్థాయి వేతనాలు చెల్లించాలనే ఆదేశాలున్నాయి.

యూనిట్లలో ఉత్పత్తి లేకున్నా వేతనాల చెల్లింపు పలు ఎంఎ్‌సఎంఈలకు తలకు మించిన భారమైంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు లేకపోవడం తీవ్రంగా నిరాశపర్చిందని ఎంఎ్‌సఎంఈ యజమానులు వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 వేలకు పైగా ఉన్న ఎంఎ్‌సఎంఈల్లో 10 వేలకు పైగా యూనిట్లు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి మూతపడ్డాయి. మిగిలిన వాటిల్లో అధిక శాతం గ్రేటర్‌ పరిధి, పరిసర జిల్లాల్లోనే విస్తరించి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో ప్రధానంగా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, బియ్యం, పప్పు, నూనె మిల్లులు, ప్లాస్టిక్‌, ఫ్యాబ్రికేషన్‌, ఎలక్ట్రికల్‌, ఎలకా్ట్రనిక్‌, జిన్నింగ్‌, స్పిన్నింగ్‌ పరిశ్రమలున్నాయి.

లాక్‌డౌన్‌ అనంతరం ఇవన్నీ మూతపడగా.. ఫార్మా, అనుబంధ ఉత్పత్తుల పరిశ్రమలు యథావిధిగా పనిచేస్తున్నాయి. వ్యవసాయ అనుబంధ, బియ్యం, పప్పు, నూనె తదితర మిల్లులు కార్యకలాపాలను ప్రారంభించాయి. కానీ అత్యధిక శాతం కార్మికులు పని చేస్తున్న టెక్స్‌టైల్స్‌, చేనేత రంగం కుదేలైంది. తెలంగాణలో ఉన్న 3500 టెక్స్‌టైల్స్‌ పరిశ్రమల్లో దాదాపు 3.5లక్షల మంది కార్మికులున్నారు.

20 లక్షల మందికి ఉపాధి కరువు
ఎంఎ్‌సఎంఈలు మూతపడటంతో సుమారు 20 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. వీరిలో తెలంగాణ జిల్లాలకు చెందిన స్థానికులు 20-30శాతం వరకు ఉండగా.. మరో 20-30 శాతం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారున్నారు. మిగిలినవారంతా  ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్‌, ఒడిసా, పశ్చిమ బెంగాల్‌ తదితర ప్రాంతాల నుంచి వలస వచ్చి ఉపాధి పొందుతున్నారు.  కేవలం చేనేత పరిశ్రమలపై ఆధారపడిన 40వేల కుటుంబాలు లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల మూతపడటంతో వేల కోట్ల ఉత్పత్తులు నిలిచిపోయాయి.

లాక్‌డౌన్‌ ఎత్తివేసినా ఈ యూనిట్‌లు ఇప్పటికిప్పుడు పని ప్రారంభించలేని పరిస్థితులు నెలకొన్నాయి.  కాగా,  అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే పరిశ్రమలను పునఃప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మాస్క్‌లు, శానిటైజర్లను అందజేయడం, కార్మికులకు ఆహారం ఇవ్వడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇది తమకు అదనపు భారమేనని ఎంఎ్‌సఎంఈ యజమానులు వాపోతున్నారు. ఆయా యూనిట్ల వారీగా పరిస్థితిని అంచనా వేసి అవసరమైన సాయం ప్రభుత్వం నుంచి అందితే తప్ప కొనసాగించే పరిస్థితి లేదని ఎంఎ్‌సఎంఈ యజమానుల ఫోరం చైర్మన్‌ కె.కోటేశ్వరరావు స్పష్టం చేశారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates