తెలంగాణ ఫుడ్స్‌లో పందికొక్కులు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • టెండర్లలో సిండికేట్‌ అయి కోట్ల దోపిడీ
  • ఏళ్లుగా ఆరేడు సంస్థలదే గుత్తాధిపత్యం
  • పంచదార… మార్కెట్‌ ధర కంటే అధికం
  • శనగపప్పు 3 నెలల్లో రూ.18 పెరిగింది
  • ఒకే సరుకుకు నాలుగు సంస్థలు ఎల్‌ 1
  • చూసీచూడనట్టు ప్రభుత్వ యంత్రాంగం

తెలంగాణ ఫుడ్స్‌కు ముడిసరుకు సరఫరాదారులు సిండికేటు అయి ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతున్నారు. ఏళ్ల తరబడి నాలుగైదు ఏజెన్సీలే కాంట్రాక్టును చేజిక్కుంచుకుంటున్నాయి. మార్కెట్‌ రేటు కంటే ఎక్కువ కోట్‌ చేసి కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. టెండర్లలో ఆరేడు ఏజెన్సీలు పాల్గొంటే వాటిలో నాలుగు ఎప్పుడూ ఎల్‌ 1గా, మిగిలిన రెండో మూడో ఎల్‌ 2గా వస్తాయి. ప్రతిసారీ వారే ఎల్‌ 1 (అన్ని టెండర్లలో అతి తక్కువ ధర)గా ఎందుకొస్తున్నారో ఉన్నతాధికారులకు ఏ మాత్రం అనుమానం రాలేదంటే వారు ఏ స్థాయిలో మేనేజ్‌ చేశారో అర్థం చేసుకోవచ్చు. నాలుగు నెలలకోసారి పిలిచే టెండర్లలో ఆ ఏజెన్సీల వారే పాల్గొంటారు. ఇతరులకు అడుగుపెట్టే చాన్స్‌ ఇవ్వరు.

ఆరేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన తెలంగాణ ఫుడ్స్‌ను 1976లో ఏర్పాటు చేశారు. ఇక్కడ బాలామృతం, స్నాక్స్‌వంటి పౌష్టికాహార ఉత్పత్తులను తయారుచేసి రాష్ట్రంలోని 149 సమీకృత స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టులకు పంపుతారు. ప్రతి నెలా 6000 టన్నుల బాలామృతం, 200 టన్నుల స్నాక్‌ ఫుడ్స్‌ను ఉత్పత్తి చేస్తారు.

ముడిసరుకుల కోసం ఈ ప్రొక్యూర్‌మెంట్‌ పోర్టల్‌’ ద్వారా టెండర్లు ఆహ్వానిస్తారు. ప్రతి నెలా పంచదార 1200 టన్నులు, శనగపప్పు 600, మొక్కజొన్న 70, నూనె 600, పాలపొడి 600 టన్నులు కొంటారు. కొన్నేళ్లుగా ఈ టెండర్లను ఆరేడు ఏజెన్సీలు మాత్రమే దక్కించుకుంటున్నాయి. అన్ని వస్తువుల సరఫరాలోనూ ఇవే సంస్థలు ఉంటున్నాయి. విచిత్రమేమిటంటే… కిలో చక్కెర సరఫరాకు వీరు టెండర్‌లో కోట్‌ చేసేది 45.11 పైసలు. రెండేళ్లుగా ఇదే ధరకు సరఫరా చేస్తున్నారు. కానీ బయట మార్కెట్లో కిలో రూ.35-38 దొరుకుతోంది. ఒక్క పంచదారలోనే కిలోకు రూ.10 చొప్పున నెలకు రూ.1.20 కోట్లు దండుకుంటున్నారు. మిగిలిన వస్తువుల్లోనూ ఇదే తంతు. ఏళ్ల తరబడి దోపిడీ ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు.

ఇలా సిండికేటు అవుతారు”’తెలంగాణ ఫుడ్స్‌లోని వివిధ స్థాయుల్లో సిబ్బంది ‘సిండికేటు కాంట్రాక్టర్ల’కు సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిఫలంగా కాంట్రాక్టర్లు ఆ ఉద్యోగులను బాగా చూసుకుంటారట! సాధారణంగా ఏదైనా ప్రభుత్వ సంస్థ టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు వివిధ ధరలకు కోట్‌ చేస్తుంటారు. తెలంగాణ ఫుడ్స్‌కు ముడి సరుకులు సరఫరా చేసే సంస్థలు మాత్రం ఒకే ధర కోట్‌ చేస్తాయి. మరో రెండు సంస్థలు దాని కంటే ఒక్క రూపాయి అదనంగా కోట్‌ చేస్తాయి. నలుగురు ‘ఎల్‌ 1’ అయితే మరో ఇద్దరు ఎల్‌ 2 అవుతారు. వారికే కాంట్రాక్టు దక్కుతుంది. ఒకరు కోట్‌ చేసే ధర మరొకరికి తెలియదు. పైగా టెండరు దక్కించుకునేందుకు ఒక్కోసారి బాగా తక్కువ ధరకు కూడా కోట్‌ చేస్తారు. తెలంగాణ ఫుడ్స్‌లో మాత్రం అందుకు పూర్తి విరుద్ధం. మార్కెట్‌లో కంటే పది రూపాయలు అదనంగా కోట్‌ చేసి మరీ టెండర్లను చేజిక్కించుకుంటున్నారు.

పైసలతో సహా ఒకటే ధర

  • 2017 జనవరిలో పంచదార టెండర్లలో నలుగురు ట్రేడర్లూ కేజీకి ఒకే ధర కోట్‌ చేశారు. అది రూ.44.10 పైసలు. ఇలాగే ఏప్రిల్‌లో ముగ్గురు ట్రేడర్లూ రూ.45.15 పైసలకు, సెప్టెంబరులో నలుగురు ట్రేడర్లూ రూ.44.73 పైసలకే కోట్‌ చేసి ఎల్‌ 1గా టెండరు దక్కించుకున్నాయి.
  • 2017 జనవరిలో శనగపప్పు టెండరుకు మూడు ఏజెన్సీలూ కేజీకి ఒకే ధర కోట్‌ చేశాయి.అది రూ.90.30 పైసలు. ఇలాగే ఏప్రిల్‌లో మూడు సంస్థలూ రూ.99.75 పైసలకు, సెప్టెంబరులో నాలుగు సంస్థలూ రూ.82కు కోట్‌ చేసి ఎల్‌ 1 టెండరు దక్కించుకున్నాయి.
  • దోపిడీకి పరాకాష్ట ఏమిటంటే మూడు నెలల్లో కేజీ సెనగపప్పు ధరలో రూ.18 తేడా చూపించారు.
  • 2018 సెప్టెంబరులో శనగపప్పుకు నలుగురు ఒకే ధర (రూ.82)కు కోట్‌ చేసి టెండరు దక్కించుకున్నారు.
  • తొలి మూడు నెలల్లో ఓ మూడు నాలుగు సంస్థలు పంచదార టెండరు దక్కించుకుంటే మిగిలిన రెండు మూడు సంస్థలు శనగపప్పు టెండరు సాధిస్తాయి. తర్వాత టెండర్‌లో వారు అటూ ఇటూ మారతారు. కొత్తవాళ్లను మాత్రం రానివ్వరు. 20 ఏళ్లుగా వారే టెండర్లు దక్కించుకుంటున్నారని తెలంగాణ ఫుడ్స్‌ ఉద్యోగులు కొందరు చెబుతున్నారు.

విచారణ నిర్వహించాలి…ఏళ్ల తరబడి ఐదారు సంస్థలు సిండికేటుగా ఏర్పడి కోట్లాది రూపాయలు దోచుకుంటున్నా అధికార యంత్రాగానికి పట్టదు. ఉన్నతాధికారులతో కమిటీని నియమించి విచారణ జరిపిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని సంస్థ ఉద్యోగులు అంటున్నారు.

Courtesy Andhrajyothy

 

RELATED ARTICLES

Latest Updates