సబ్సిడీలు రావు, రుణాలు మాఫీ కావు!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

యస్. అన్వేష్ రెడ్డి

కొత్త చట్టాలు తీసుకొస్తాం అంటున్నారు. మరి ఇప్పటివరకు పాసు పుస్తకాలు రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? కొత్త పట్టా పాసు పుస్తకాలు రాకపోవడంతో బ్యాంకులలో రుణం ఇవ్వట్లేదు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలన్నీ హామీలుగానే మిగిలిపోవడం రైతులకు నిరాశ కలిగిస్తున్నది. తొలి ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలలో రుణమాఫీ ఒకటి. రైతుకు లక్ష రూపాయల చొప్పున రుణమాఫీ చేస్తానని చెప్పింది. కానీ, రుణ మాఫీ డబ్బులు ఆరు విడతలుగా రైతుల ఖాతాలలో జమ చేయడం వల్ల ప్రయోజనం లేకుండా పోయింది.

మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత- రైతుల పంట రుణాలు రూ. 23వేల కోట్లు వుంటే, దాని మీద నాగిరెడ్డి కమిటీ వేసి అప్పులను రూ. 17వేల కోట్లకు కుదించారు. అందులో మొదటి విడతగా 25 శాతం రైతుల ఖాతాలలో జమ చేయడం వల్ల అది వడ్డీకే సరిపోలేదు. రైతుకు ఒక మాఫీ పత్రం ఇచ్చారు. ఆ పత్రంలో 25 శాతం పోను మిగిలిన 75 శాతం రాబోవు మూడేళ్ళల్లో మూడు దఫాలుగా 7శాతం వడ్డీతో సహా ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. కానీ, వడ్డీ డబ్బులు ఇవ్వకుండానే, మూడు దఫాలన్నది కాస్తా అయిదు దఫాలుగా జమ చేసినారు. వడ్డీ భారం రైతుల మీదనే పడింది.

రెండవసారి అధికారంలోకి రావడానికి కూడా లక్ష రూపాయల రుణమాఫీని వాడుకొన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకు ఆ ఊసే లేదు. ఇప్పుడు దాదాపుగా రూ.37,518కోట్ల రుణాలు వున్నవి. రుణమాఫీ అమలు చేయకపోవడం వల్ల కొత్త రుణాలు అందక రైతులు ప్రైవేటు అప్పులు చేశారు. సంవత్సరం లోపు రుణాలు రీషెడ్యూలు చేసుకుంటే 7 శాతం మాత్రమే వడ్డీ పడుతుంది. కానీ, ప్రభుత్వం మాఫీ చేస్తుంది కదా అని రైతులు కట్టలేదు. ప్రభుత్వం మాఫీ చేయకపోవడం వల్ల 7శాతం కాస్తా 14 శాతానికి పెరిగి రైతుపై అదనపు వడ్డీ భారం పడుతుంది.

2017లో రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా మొదలు పెట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం వల్ల రైతులకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగింది. రికార్డులు సరిచేసి నిజమైన భూమి హక్కుదారునికి కొత్త పట్టా పాసు పుస్తకం ఇవ్వాలన్నది ప్రధానంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు 95 శాతం భూరికార్డులు సరి చేసినామని చెబుతున్నరు. కానీ, ఇప్పటి వరకు 30 శాతం రైతులకు కూడా కొత్త పుస్తకాలు రాలేవు. వివాదంలో వున్నవాటిని పరిష్కారం చేయనే లేదు.

ఇందులో కొన్ని ముఖ్యమైన విషయాలు వున్నాయి. తెలంగాణలో భూములు ఒకరి నుండి మరొకరు కొనుగోలు చేసినప్పుడు కొందరు సాదా బైనామా రాసుకుంటే, మరి కొందరు రిజిష్ట్రేషన్ చేసుకుంటారు. రిజిష్ట్రేషన్ చేసుకున్నవారు కొందరు మ్యుటేషన్‌ కోసం రెవెన్యూ కార్యాలయంలో ఇస్తారు. కానీ, దస్తావేజులు ఉన్నయి కదా, సాదా బైనామా వుంది కదా, భూమిని సాగు చేసుకుంటున్నం కదా అని అనుకునే రైతులు చాలామంది వున్నారు.

ఇటీవల రికార్డులు సరిచేస్తున్న సందర్భాలలో… అమ్మినవారి పేరు మీదనే రికార్డులలో వున్నవాటిని కొన్నవారి పేరు మీదకు మార్చలేదు. భూమి ధరలు పెరగడంతో అమ్మినవారి కుటుంబం నుండి ఎవరైనా అభ్యంతరం చెబితే వాటిని అలానే వదిలేస్తున్నారు. దాని వలన వాస్తవ హక్కుదారునికి పట్టా పుస్తకం రావటం లేదు. ఉదాహరణకు పెద్దపల్లి జిల్లా మంథనిమండలంలోని ఒక గ్రామంలో ముత్యం రావు అనే రైతు గతంలో ఎప్పుడో దాదాపు 300 ఎకరాల భూమిని అక్కడి రైతులకు అమ్మాడు.

అప్పుడు కొన్న రైతు నుండి చేతులు మారుతూ వచ్చింది. సాదా బైనామా రాసుకున్న పేపర్ మాత్రమే ఆ రైతుల వద్ద వుంది. భూమిని కూడా వారే సాగు చేస్తున్నారు. ఇప్పుడు ముత్యం రావు మనవడు వచ్చి ‘రికార్డులలో మా తాత పేరు వుంది, ఈ భూమి మాది’ అంటున్నాడు. దాంతో రెవెన్యూ అధికారులు కొన్న వారి పేరు మీద పట్టా చేయడం లేదు. భూములలు అమ్మిన మరి కొందరు ధర పెరిగింది కదా అని కొన్నవారి దగ్గర మళ్ళీ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.

ఇంకో సమస్య వారసత్వ భూములు. ఇవి కూడా వారసుల పేరు మీదకు మార్పిడి చేస్తలేరు. మరో సమస్య.. కొందరి వద్ద పాత పట్టా పుస్తకాలు వున్నాయి, సాగులో వాళ్లే వున్నారు, కానీ, రెవెన్యూ రికార్డులలో పేరు లేదని మార్పిడి చేస్తలేరు. ఇలాంటివి ఏ గ్రామంలో చూసిన చాలా వున్నాయి. మరి కొందరికి పొజిషనులో వున్న భూమికీ రికార్డులలో వున్న భూమికీ తేడాలు వున్నాయి. ఇలాంటివి కూడా సరి చేయలేదు. అధికారులు ఎంతసేపు కాగితాలకే పరిమితం అవుతున్నారు కానీ ప్రాక్టికల్ గా వున్న సమస్య గురించి ఆలోచిస్తలేదు.

అసలు సర్వే చేయనిదే సమస్య పరిష్కారం కానే కాదు. మరొక అంశం ఏమిటంటే.. కొనుగోలు చేసిన భూములుగానీ, వివాదాల్లోని భూములుగానీ గ్రామాన్ని సాక్ష్యంగా తీసుకొంటేనే సమస్య పరిష్కారం అవుతుంది. ఇవేమీ చేయకుండా కొత్త చట్టాలు తీసుకొస్తాం అంటున్నారు. మరి ఇప్పటివరకు పాసు పుస్తకాలు రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? కొత్త పట్టా పాసు పుస్తకాలు రాకపోవడంతో బ్యాంకులు రుణం ఇవ్వడం లేదు. పండించిన పంట అమ్ముకుందామన్నా, పట్టా పుస్తకం లేకుంటే కొనుగోలు కేంద్రాలలో కొనని పరిస్థితి. పట్టా పుస్తకాల కోసం గ్రామ రెవెన్యూ, మండల రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులే కనబడుతున్నారు. ఇదే అదునుగా కొందరు అధికారులు రైతుల వద్ద లెక్కలేనన్ని డబ్బులు తీసుకుంటూ ఇబ్బందులు పెడుతున్నారు.

2018 ఖరీఫ్‌లో పెట్టుబడి సాయం కోసం అని ఎకరానికి రూ.4వేల చొప్పున (సామాజిక ఆర్థిక నివేదిక 2019 ప్రకారం) 51,50,000 మందికి రూ.5,260.94 కోట్లు ఇచ్చారు. 2018 రబీలో 49,03,000మందికి రూ.5,244.26 కోట్లు అందించారు. సాగు చేసుకుంటున్న రైతులకే పెట్టుబడి సాయం ఇవ్వాలి. కానీ, భూములు వుండీ సాగు చేయకుండా వున్న అనేకమంది పెద్ద పెద్ద రైతులకే ఎక్కువ ఇచ్చారు. 2018 రబీలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 2,47,000 మంది రైతులకు రైతుబంధు అందలేదు. రెవెన్యూ రికార్డుల తప్పిదాల వల్ల, రికార్డులు సరి చేయకపోవడం వల్ల లక్షలమంది రైతులకు రైతుబంధు అందలేదు. 2019 ఖరీఫ్ సాయాన్ని ఎకరానికి రూ.5వేలకు పెంచి 56,76,000 మందిని గుర్తించినప్పటికీ సెప్టెంబర్ 18 వరకు 39,72,000 మందికి రూ.4,381 కోట్లు ఇచ్చారు. ఇంకా 13,18,000 మంది రైతులకు రూ.2,578 కోట్లు ఇవ్వాలి. పెట్టుబడి సాయం అంటే విత్తనాలు వేసే ముందు ఇవ్వాలి కానీ, అయిపోయిన తర్వాత ఇస్తున్నారు. ఖరీఫ్ అయిపోయింది. మళ్ళీ రబీ మొదలైతుంది. ఇంకా రైతుబంధు ఊసేలేదు.

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మైక్రో ఇరిగేషన్‌ను పూర్తిగా విస్మరిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపుగా 2,46,000 మంది రైతులకు మాత్రమే 4,65,974 ఎకరాలకు డ్రిప్, 1,89,436 ఎకరాలకు స్ప్రింకర్లు అందించారు. ఇంకా సుమారు 1,40,000 దరఖాస్తులు పెండింగులో వున్నవి.

మరీ ముఖ్యంగా రైతుబంధు పథకం తీసుకొచ్చిన తర్వాత రైతులకు గతంలో వ్యవసాయ యంత్రాలకు ఇచ్చే సబ్సిడీని ఇవ్వట్లేదు. దీనివల్ల రైతులకు పెట్టుబడి పెరిగిపోతున్నది. అలాగే వడ్డీ రాయితీని కూడా ఇవ్వట్లేదు. సహకార సంఘాలలో దీర్ఘకాల రుణాలకు ఇవ్వాల్సిన 6 శాతం రిబేటును కూడా ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఈ విధంగా ఇదివరకు వచ్చే సబ్సిడీలను, వడ్డీ రాయితీలను తుంగలో తొక్కేశారు. ప్రకృతి వైపరీత్యాలకు పంట నష్టం జరిగితే ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనాలు వేసి కేంద్రానికి పంపాలి. కొన్ని సందర్భాలలో కేంద్ర బృందం కూడా పంట నష్టం జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తుంది. కేంద్రం నుండి వచ్చే వరకు ఆలస్యం అవుతుంది కాబట్టి రాష్ట ప్రభుత్వమే రైతులకు నష్ట పరిహారం ఇచ్చి కేంద్రం నుండి తీసుకోవాలి. కానీ, అలా చేయకుండా.. కేంద్రం ఇచ్చిన డబ్బులను కూడా రైతులకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఆలస్యం చేసిన సందర్భం వుంది.

2015లో జరిగిన పంట నష్టాలకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చాక, మళ్లీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. 2018 ఆగస్టులో జరిగిన పంట నష్టాలకు ఇన్‌పుట్ సబ్సిడీ కోసం ఆదిలాబాదుకు చెందిన ఒక రైతు హైకోర్టులో కేసు వేస్తే, కోర్టు ఆదేశాల అనుసారం 12 జిల్లాల్లో 28300.71 హెక్టార్లకు సంబంధించి ఇచ్చారు. 2016 నుండి 2019 వరకు ప్రకృతి వైపరీత్యాలతో అనేక నష్టాలు జరిగితే కేవలం 2018 ఆగస్టులో జరిగిన దానికి మాత్రమే, అది కూడా కోర్టు ఆదేశాలతో ఈ మాత్రమే ఇచ్చారు. అంటే, రైతులకు మేలు చేయాలనే విషయంలో ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి వుందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నష్టం అంచనాలు పూర్తి స్థాయిలో వేయటం లేదు. అంచనాలు వేసినా ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వని పరిస్థితి వున్నది. ఉదాహరణకు ఒక్క నిజామాబాద్ జిల్లానే తీసుకుంటే.. జిల్లా వ్యాప్తంగా 2016లో 47272 మంది రైతులు 30272.52 హెక్టార్ల పంటకు రూ.2108.34 లక్షల మేర నష్టం పాలయ్యారు. ఇప్పటికీ ఆ ఇన్‌పుట్ సబ్సిడీ అందలేదు.

ఇలా రైతులకు సబ్సిడీలు ఇవ్వకుండా, వడ్డీ రాయితీలు ఇవ్వకుండా, ఇన్‌పుట్ సబ్సిడీలు ఇవ్వకుండా, రుణమాఫీ హామీ అమలు చేయకుండా తెలంగాణ ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరిస్తున్నది.

రచయితచైర్మన్, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్

RELATED ARTICLES

Latest Updates