ఐఏఎస్‌ మురళి వీఆర్‌ఎస్‌

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

  • స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు
  • ఆగస్టు 31 నుంచి అమలుకు సీఎస్ జోషికి లేఖ
  • ఏడాదిన్నరగా పనిలేకుండా అసంతృప్తితో ఉన్నా
  • నేనే కాదు.. చాలామంది ఐఏఎస్ లల్లో అసంతృప్తి ఉంది
  • రాష్ట్రంలో దారుణంగా విద్యా రంగం.. అధ్వానంగా స్కూళ్లు
  • ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. పూర్తిగా విస్మరించింది
  • విద్యారంగంపై ముఖ్యమంత్రి సమీక్షించిన దాఖలాల్లేవ్‌
  • ఈ రంగంలో స్వచ్ఛంద సేవ చేయాలనుకుంటున్నా: మురళి

ఐఏఎస్‌ అధికారి, రాష్ట్ర పురావస్తు (ఆర్కైవ్స్‌) శాఖ డైరెక్టర్‌ ఆకునూరి మురళి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌)కు దరఖాస్తు చేసుకున్నారు. సచివాలయంలో శనివారం ఆయన సీఎస్‌ ఎస్కే జోషిని కలిసి లేఖ అందజేశారు. ఆగస్టు 31వ తేదీ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణకు అనుమతి ఇవ్వాలని అందులో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.వీఆర్‌ఎస్‌కు దారి తీసిన కారణాలను వివరిస్తూ.. ప్రభుత్వ తీరును నిరసించారు.

ఏడాదిన్నరగా ఎలాంటి పని లేకుండా ఉన్నానంటూ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘‘నేను 35 ఏళ్లుగా ప్రభుత్వ సర్వీసులో ఉన్నాను. ఎన్నడూ పని లేకుండా లేను. కానీ.. నన్ను ప్రభుత్వం భూపాలపల్లి కలెక్టర్‌ పదవి నుంచి బదిలీ చేసి పురావస్తు డైరెక్టర్‌ జనరల్‌గా నియమించింది. ఇక్కడికి వచ్చాక పని లేకుండాపోయింది. అసలు ఇది ఐఏఎస్‌ పోస్టే కాదు. ఎలాంటి సౌకర్యాలూ లేవిక్కడ. ఏడాదిన్నరగా ఇక్కడ ఎలాంటి పని లేకుండా ఉన్నాను. అప్పటి నుంచీ తీవ్ర అసంతృప్తితోనే ఉన్నాను. నాకే కాదు.. చాలా మంది ఐఏఎ్‌సలలో అసంతృప్తి ఉంది. ఇది దాచేస్తే దాగని సత్యం’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా 20 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన వారికి వీఆర్‌ఎస్‌ ఆప్షన్‌ ఉందని, తాను 35 ఏళ్ల సర్వీసు పూర్తి చేశానని చెప్పారు. ఇంత సర్వీసులో పని లేకుండా ఉన్నానంటే ఇక్కడేనని, ఒంట్లో సత్తువ ఉన్నప్పుడే ఏదైనా సేవ చేయాలన్న ఆలోచన వచ్చిందని తెలిపారు. ఇక్కడ పని లేకుండా పడి ఉండేకంటే.. బయటి సమాజానికి ఏదైనా సేవ చేయాలన్న ఉద్దేశంతో పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నానని వివరించారు. ‘‘నేను ఎక్కడ పని చేసినా పూర్తిస్థాయిలో సేవలు అందించాను. ఉపాధి హామీ పథకం డైరెక్టర్‌గా పని చేసినప్పుడు కోటి మందికి ఉపాధి కల్పించాను. సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా అహర్నిశలు కృషి చేశాను.

గోదావరిపై గోదావరిఖని వద్ద బ్రిడ్జితోపాటు మరో రెండు బ్రిడ్జిల నిర్మాణంలో కీలక పాత్ర పోషించాను. గోదావరిఖని బ్రిడ్జి వద్ద ఆక్సిజన్‌ మాస్కు ధరించి పిల్లర్ల గుంతలు పరిశీలించాను. ఇంత కష్టపడినా.. తగిన గుర్తింపు లభించలేదు’’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు. వీఆర్‌ఎస్‌ తర్వాత విద్యా రంగంలో సేవలు అందించాలనుకుంటున్నానని చెప్పారు. రాష్ట్ర విద్యా రంగం దారుణంగా ఉందని, ప్రభుత్వం దానిని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టుకు కోట్లాది నిధులను వెచ్చిస్తున్నారు. వాటిలో కొన్నిటిని వెచ్చించినా 1000 ప్రభుత్వ స్కూళ్లను బాగుచేయవచ్చు. కానీ.. తెలంగాణలో విద్యా రంగానికి ప్రాధాన్యం లేదు. కేరళ, ఢిల్లీల్లో తప్ప మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా విద్యను పట్టించుకోవడం లేదు. ఏపీలో అక్కడి ప్రభుత్వం విద్యపై దృష్టిసారించింది. ఇక్కడ మాత్రం పాఠశాలల పరిస్థితి అధ్వానంగా ఉంది. స్విట్జర్లాండ్‌ వంటి చిన్న దేశంలో 27 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడుంటే.. తెలంగాణలో 17 మంది విద్యార్థులకే ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. ఇక్కడ ఉపాధ్యాయులకు కొరత లేదు. ఇద్దరు విద్యార్థులకు ఇద్దరు టీచర్లున్న పాఠశాలలూ ఉన్నాయి. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టవచ్చు. కానీ.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. విద్యా రంగంపై ముఖ్యమంత్రి కనీసం సమీక్షించిన దాఖలాల్లేవు’’ అని తీవ్ర ఆరోపణలు చేశారు. విద్యా రంగంపై రూ.45 వేల కోట్లు వెచ్చించే ప్రభుత్వం.. ఏడాదికి రూ.5 వేల కోట్ల చొప్పున ఇస్తే గాడిలో పెట్టవచ్చునని, రూ.20 వేల కోట్లు ఇస్తే ఇక్కడి స్కూళ్లన్నింటినీ తీర్చిదిద్దవచ్చునని అన్నారు. ‘‘మాజీ మంత్రి కేటీఆర్‌ సందర్శించిన స్కూళ్లు ఎందుకు బాగుపడ్డాయి? గవర్నర్‌ శ్రద్ధ పెట్టిన ప్రభుత్వ స్కూలు ఎలా గాడిలో పడింది? ఇలా నిక్కచ్చిగా మానిటరింగ్‌ చేస్తే విద్యా రంగం తప్పకుండా బాగుపడుతుంది. అందుకే పదవీ విరమణ తర్వాత విద్యా రంగంలో సేవలందించాలనుకుంటున్నా. సామాజిక సేవా కార్యకర్తగా పని చేస్తా’’ అని వివరించారు.

స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేయడమా, ఇతర అంతర్జాతీయ సంస్థలతో కలిసి పని చేయడమా అనేది ఇప్పుడే చెప్పలేనని అన్నారు. రాష్ట్రంలోని విద్యా రంగాన్ని తీర్చిదిద్దాలన్నదే తన ఆశయమన్నారు. ఈ సందర్భంగా, ‘కాంగ్రెస్‌ నేత, మాజీ ఐఏఎస్‌ కొప్పుల రాజు మీకు చాలా దగ్గర కదా! రాజకీయాల్లో చేరతారా!?’ అని విలేకరులు ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని, తాను విద్యా రంగంలోనే సేవలందిస్తానని చెప్పారు. ఇది కూడా రాజకీయాల్లో భాగమేనని వ్యాఖ్యానించారు. నిజానికి, ఇప్పటికే ఐపీఎస్‌ వీకే సింగ్‌ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యకం చేసిన విషయం తెలిసిందే. రాజకీయాలతో బంగారు తెలంగాణ సాధించలేమని, రూ.2 కోట్ల పనికి రూ.50 కోట్ల వేతనాలు చెల్లించాల్సి వస్తోందని, స్టేషనరీ విభాగాన్ని మూసేయడమే మేలని ఘాటుగా వ్యాఖ్యానించారు.

విజయాలు.. వివాదాలు

కొత్తగూడేనికి చెందిన ఆకునూరి మురళి 1981లో ఆర్‌అండ్‌ బీ శాఖలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా సర్వీసు మొదలుపెట్టారు. వివిధ హోదాల్లో సేవలు అందించిన తర్వాత, 2012లో కన్‌ఫర్డ్‌ ఐఏఎస్‌ హోదా పొందారు. తెలంగాణ వచ్చిన కొత్తలో 2014లో సెర్ప్‌ సీఈవోగా పని చేశారు. కొత్త జిల్లాలను ప్రకటించిన తర్వాత 2016 అక్టోబరులో ప్రభుత్వం ఆయనను భూపాలపల్లి జిల్లా తొలి కలెక్టర్‌గా నియమించింది. బాధ్యతలు స్వీకరించిన మర్నాడే ఆయన తండాల బాట పట్టారు. పల్లె నిద్రలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టారు. కమలాపూర్‌ పాఠశాలను దత్తత తీసుకుని కార్పొరేట్‌ స్థాయిలో విద్య అందించేందుకు కృషి చేశారు. ప్రభుత్వాస్పత్రులపై భరోసా కల్పించారు. మరుగుదొడ్ల నిర్మాణంపై చైతన్యం తీసుకొచ్చారు. తుపాకుల గూడెం, కాళేశ్వరం భూ సేకరణలో కీలక పాత్ర పోషించారు. అయితే, అడవి పందులను చంపుకొని తింటే తప్పులేదని వివాదంలో చిక్కుకున్నారు. బ్రాహ్మణులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. ‘‘ఎంపీడీవోలు వెధవలు, పని పాట రాని దున్నపోతులు. కనీసం పని చేతకాదు. మిమ్మల్నందరినీ ఏం చేయాలి’’ అంటూ ఎంపీడీవోలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లోనే వ్యాఖ్యానించడం మరింత వివాదాస్పదమైంది. ఈ వివాదాల నేపథ్యంలోనే సర్కారు ఆయనను బదిలీ చేసింది.

RELATED ARTICLES

Latest Updates