కరుకుదనం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • ప్రజలను పాలకులు తమ పిల్లల్లా చూసుకోవాలని, దయగా ప్రేమగా ఉండాలని పూర్వం చెప్పేవారు. కాస్త మానవత్వంతో వ్యవహరించిన రాజులకు మంచి కీర్తి దక్కేది. కఠినాత్ములకు, నిర్దయులకు ఉండేది అపకీర్తి తప్ప, కీర్తి కాదు కదా? ఆధునిక కాలంలో పాలకులు ప్రజలతో ప్రజాస్వామికంగా వ్యవహరించాలన్నది ఆదర్శం. ఎందుకంటే, పాలకులు ప్రజల ప్రతినిధులు, వారు ఎన్నుకుంటేనే వారి తరఫున అధికారపీఠం మీద కూర్చున్నవారు. ప్రజలకు ఆమోదకరంగా పాలన సాగించవలసిన అవసరం, ప్రజల భాగస్వామ్యంతో పరిపాలించవలసిన అవసరం నేటి పాలకులకు ఉంటుంది. ప్రజలలో రకరకాల అభిప్రాయాలు ఉన్నప్పుడు, అందరినీ ఏకాభిప్రాయానికి తీసుకువచ్చి, సామరస్యం సాధించవలసిన బాధ్యత కూడా ఏలికలదే. ప్రభుత్వంతోనే భేదాభిప్రాయం ఏర్పడినప్పుడు ప్రజలతో పాలకులకు కాస్త సంవాదం, కొంత ఘర్షణ అనివార్యమవుతాయి కానీ, అప్పుడు కూడా అది శత్రుపూరిత పోరాటంగా ఉండకూడదు. ద్వేషం, కక్ష, పంతం ఉండకూడదు. ఎక్కడోఅక్కడ ఉభయతారకంగా, అవసరమైతే పాలకులు రెండడుగులు దిగి వచ్చేలా పరిష్కారం జరగాలి.
    యాభైరోజులు కావస్తున్న ఆర్టీసీ సమ్మె విషయంలో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మొదటినుంచి అవాంఛనీయంగానే ఉంటున్నది. కఠినవైఖరి అని ప్రభుత్వం భావిస్తున్నదేమో కానీ అది కరకు వైఖరిగా, జగమొండితనంగా మాత్రమే ప్రజలకు కనిపిస్తున్నది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమని అడగడమేమిటి అని కోపం వచ్చిందా, లేక, నిన్నటి దాకా పాలకపార్టీకి అనుబంధంగా ఉన్న సంఘం సమ్మెకు దిగిందని పంతం పెరిగిందా తెలియదు. విలీనం సంగతి పక్కన పెడతాము అన్నా, పాలకులు కరగలేదు. పూర్తిగా దిగివచ్చి, విధుల్లో చేరతాము అనుమతించమన్నా, ప్రభుత్వం పెదవి విప్పడం లేదు. ఇట్లా ఉంటే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతామని ఆశిస్తున్నారేమో తెలియదు.
    ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దాఖలయిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేయడంతో, ఇక ఆర్టీసీ విచ్ఛిత్తి ప్రారంభమవుతుందని ఊహించవచ్చు.
    ఆర్టీసీకి లాభసాటి కాని రూట్లు ప్రైవేటు వారు మాత్రం ఎందుకు తీసుకుంటారు? లాభసాటి అయిన రూట్లు ప్రైవేటుకు ఇచ్చేస్తే, ఆ సంస్థ పూర్తిగా అదృశ్యమవుతుంది. రాబడికి, వ్యయానికి మధ్య ఇంతపెద్ద తేడా ఉన్నప్పుడు ప్రైవేటు వారు మాత్రం ఎట్లా నడపగలరు? తక్కువ వేతనాలు ఇచ్చినా, నిర్వహణకు తక్కువ వ్యయం అయినా, ప్రైవేటీకరణ తరువాత కూడా ప్రభుత్వం ప్రజారవాణాకు రాబడి ఆశించని పెట్టుబడి పెట్టవలసిందే. ఎందుకంటే, ప్రజారవాణా ఆర్థిక క్రియాశీలతకు ప్రాణప్రదం కాబట్టి. సంక్షేమం పేరుతో యథేచ్ఛగా వేల కోట్లు పంచిపెట్టే ప్రభుత్వానికి, ఒక చారిత్రాత్మక ప్రజారవాణాసంస్థను సజావుగా నడపడానికి సాయం చేయడం నిజంగా కష్టమా? తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాలుపంచుకున్న 50 వేల మంది కార్మికులు స్వరాష్ట్రంలో సాధించుకున్న బంగారు భవిష్యత్తు ఇదేనా? మనసు కరగని, స్పందన తెలియని పాలనలో తక్కిన ఉద్యోగ, కార్మిక వర్గాలు కూడా రేపు ఎదుర్కొనబోయే భవితవ్యం ఇదేనా?
    ఆర్టీసీ కార్మికులు ఈ సందర్భంగా ఒక అంశం గుర్తు పెట్టుకోవాలి. ప్రభుత్వం పంతానికి వెళ్లినమాట నిజమే అయినా, కార్మికులు ఈ విషయాన్ని ఆ దృష్టితో చూడడం ఉచితం కాదు. సమ్మె తగిన ఫలితాన్ని సాధించకపోవడం, ప్రభుత్వం స్పందించకపోవడం ఓటమిగా భావించకూడదు. సమీక్షించుకోవచ్చు, ఆత్మవిమర్శ చేసుకోవచ్చు. కానీ, ఈ సుదీర్ఘ సమ్మె యావత్‌ తెలంగాణ సమాజానికి చెందిన ఒక కీలకమైన ఆకాంక్షను వ్యక్తం చేసింది. ప్రజారవాణా వ్యవస్థను ప్రైవేటుపరం కాకుండా రక్షించుకోవడంలో కార్మికుల ప్రయోజనాలు కూడా ఇమిడి ఉండవచ్చును కానీ, అది ప్రజలందరి అవసరం కూడా. ఒక సమష్టి ప్రయోజనాన్ని కాపాడడానికి కార్మికవర్గం చేసిన ప్రయత్నంగా ఈ సమ్మెను చూడాలి. ఆ ప్రయత్నం సఫలం కాకపోయి ఉండవచ్చు. ఆ ప్రయత్నంలో అనేక మంది సహోద్యోగులను వారు కోల్పోయి ఉండవచ్చు. వారి కుటుంబాలు యమయాతన అనుభవించి ఉండవచ్చు. అయినా, చివరకు జరిగింది వైఫల్యం కాదు. ఒక సూత్రబద్ధ అంశానికి కార్మికుల కట్టుబాటు వ్యక్తమైంది. అది విజయమే.
    ప్రజారవాణా వ్యవస్థలో ప్రైవేటు పెత్తనం ఎట్లా ఉండబోతున్నదో త్వరలో తెలంగాణ ప్రజలకు అనుభవంలోకి వస్తుంది. నేటి ప్రభుత్వ విధానం ఎంతటి ప్రజావ్యతిరేకమో అప్పుడు అందరికీ బాధాకరంగా తెలిసివస్తుంది. ఇంతటి కీలకమైన పౌరసదుపాయానికి సంబంధించిన సంక్షోభంలో ప్రభుత్వానికి చెప్పగలిగిన నిపుణులు, విధానకర్తలు, పెద్దమనుషులు ఎవరూ లేకుండా పోవడం, లేదా చెప్పడానికి ఎవరికీ వీలులేకపోవడం, చెప్పిన హితవులు కంచుగోడలను దాటి ఏలికల చెవికి చేరకపోవడం, చేరినవి కూడా చలనం కలిగించకపోవడం ఇవన్నీ దురదృష్టాలు. ప్రజలకు ఇవి బహుశా స్వయంకృత దురదృష్టాలు.
                                                                                              Courtesy Andhrajyothy…

RELATED ARTICLES

Latest Updates