టీచర్ల చలో అసెంబ్లీ ఉద్రిక్తం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  •  ఇందిరా పార్కు నుంచి అసెంబ్లీ దిశగా పరుగులు
  • పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయింపు
  • కళ్లుగప్పి కొందరు అసెంబ్లీకి
  • జిల్లాల్లోనూ ఎక్కడికక్కడ పోలీసుల అడ్డగింతలు

ఎక్కడికక్కడ అరెస్టులు.. అడ్డగింతలు.. వాగ్వాదాల నడుమ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పింఛనర్ల ఐక్య వేదిక శుక్రవారం తలపెట్టిన చలో అసెంబ్లీ ఉద్రిక్తంగా మారింది. నిర్బంధాలు ఎదురైనా తప్పించుకున్న ఆందోళనకారులు ఉదయం పది గంటలకే హైదరాబాద్‌ ఇందిరా పార్కు చౌరస్తాకు తరలి వచ్చారు. అంతకుముందు దోమల్‌గూడ టీఎ్‌సయూటీఎఫ్‌ భవన్‌ పరిసర ప్రాంతాల నుంచి ర్యాలీగా వస్తున్నవారిని పార్కు చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వీరిలో కొందరు లోయర్‌ ట్యాంక్‌బండ్‌ మీదుగా అసెంబ్లీ వైపు పరుగు తీయబోగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇందిరా పార్కు వద్ద రోడ్డుపై బైఠాయించారు. బలవంతంగా అరెస్టు చేయబోగా వాగ్వాదం చోటుచేసుకుంది. అప్పటికీ పలువురు కళ్లుగప్పి అసెంబ్లీ వరకు రాగా పోలీసులు అరెస్టు చేశారు. గురువారమే జిల్లాల్లో సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నా.. పెద్ద సంఖ్యలోనే హైదరాబాద్‌ రావడం గమనార్హం. 2 వేల మంది ఆందోళనకారులను నగరంలోని 14 ఠాణాలకు తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అడ్డుకోవడంపై ఐక్య వేదిక నేతలు చావ రవి, సదానందగౌడ్‌, మైస శ్రీనివాసులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

బస్టాపుల్లో ఉన్నవారినీ వదలకుండా..
చలో అసెంబ్లీని విజయవంతం చేయాలన్న పట్టుదలతో ఉన్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు.. పోలీసుల కళ్లుగప్పేందుకు ఇందిరా పార్కు పరిసర ప్రాంత బస్టాపులు, టిఫిన్‌ సెంటర్లను ఎంచుకున్నారు. సాధారణ ప్రయాణికుల్లా బస్టాపుల్లో నిల్చున్నారు. వారిని పోలీసులు పసిగట్టి అరెస్టు చేసి వివిధ  స్టేషన్లకు తరలించారు. చలో అసెంబ్లీ భగ్నానికి పోలీసులు.. ఇందిరాపార్కు చౌరస్తా నుంచి బండమైసమ్మనగర్‌ చౌరస్తా వరకు దిగ్బంధం చేశారు. రెండు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి ముళ్లకంచెలు ఉంచారు. పార్కును మూసివేశారు. అదనపు సీపీ చౌహాన్‌, అడిషనల్‌ సీపీ ట్రాఫిక్‌ అనిల్‌కుమార్‌, సెంట్రల్‌ జోన్‌ డీసీపీ విశ్వప్రసాద్‌, పోలీసు ఉన్నతాధికారులు తరుణ్‌జోషి, చిక్కడపల్లి ఏసీపీ శ్రీధర్‌, గాంధీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సుంకరి శ్రీనివా్‌సరావు, చిక్కడపల్లి ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డిలు బందోబస్తును పర్యవేక్షించారు.

అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు
భారీ బందోబస్తు ఏర్పాటు చేసినా పోలీసు వలయాలను దాటుకుని కొందరు ఉపాధ్యాయులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఇలా వచ్చిన 63 మందిని   సైఫాబాద్‌ స్టేషన్‌ పరిధిలో అరెస్ట్‌ చేశారు. రవీంద్ర భారతి సమీపంలో ఉపాధ్యాయులను అరెస్ట్‌ చేస్తుండగా ఉద్రిక్తత నెలకొంది. రెండు రోజుల క్రితం విద్యార్థి సంఘాల అసెంబ్లీ ముట్టడిని అడ్డుకున్నా.. ఉపాధ్యాయులు మాత్రం వ్యూహాత్మకంగా రవీంద్రభారతి, ఏఆర్‌ పెట్రోల్‌ బంకుల మీదుగా అసెంబ్లీ సమీపానికి చేరుకున్నారు. కాగా, కామారెడ్డి జిల్లా భిక్కనూరు టోల్‌గేట్‌ వద్ద ప్రత్యేకంగా పోలీసులు చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. ఇందిరా పార్కు నుంచి ర్యాలీగా వెళ్తున్న ఉపాధ్యాయ నాయకులను పోలీసులు అడ్డుకునే క్రమంలో టీపీటీఎఫ్‌ నాయకుడు భీమళ్ల సారయ్యకు గాయాలయ్యాయి. వరంగల్‌ సుబేదారి పోలీసులు ఐక్య వేదిక అర్బన్‌ జిల్లా నాయకుడు, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు యాట సదయ్యను గురువారం అర్ధరాత్రి 12 గంటలకు అరెస్టు చేశారు.
అరెస్టులు నిరంకుశం.. అఖిలపక్ష, ప్రజాసంఘాల ప్రతినిధులు
చలో అసెంబ్లీ అరెస్టులను అఖిలపక్షాలు, ప్రజాసంఘాల ప్రతినిధులు ఖండించారు. ఉపాధ్యాలయినులను లాఠీలతో కొట్టి అరెస్టు చేయడం ప్రభుత్వ నిరంకుశ విధానానికి నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వం బేషరతుగా వారిని విడుదల చేయాలని టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకట్‌రెడి, తమ్మినేని వీరభద్రం కోరారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates