కార్డుతో పనిలేకుండా నిత్యావసరాలు పంపిణీ చేయండి

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌: కూలీలకు, పేదలకు రేషన్‌కార్డు, బయోమెట్రిక్‌తో సంబంధంలేకుండా 12 కిలోల బియ్యం, ఇతర నిత్యావసరాలు అందజేయాలంటూ ప్రభుత్వానికి బుధవారం హైకోర్టు ఆదేశించింది. లాక్‌డౌన్‌ సమయంలో కార్డులేని వారికి, వలస కూలీలకు కూడా నిత్యావసరాలు పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. అటవీ ప్రాంతాల్లోని గిరిజనులకూ బయోమెట్రిక్‌తో సంబంధంలేకుండా నిత్యావసరాలు పంపిణీ చేయాలంది. రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున తెల్ల రేషన్‌కార్డులను అధికారులు రద్దు చేశారని, మరోవైపు 12 కిలోల బియ్యంతోపాటు ఇచ్చే నిత్యావసరాలకు రేషన్‌కార్డు చూపాలంటుండటంతో పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సామాజిక కార్యకర్త ఎస్‌.క్యూ.మసూద్‌ రాసిన లేఖను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ కె.లక్ష్మణ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. లబ్ధిదారులకు నోటీసులు ఇవ్వకుండా సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా లక్షల కార్డులను ఎలా రద్దు చేస్తారని అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. ఆయన స్పందిస్తూ రేషన్‌ కార్డులను రద్దు చేసినవారికి సైతం 12 కిలోల బియ్యం, ఇతర నిత్యావసరాలు అందజేస్తామని హామీ ఇవ్వడంతో తదుపరి విచారణను ధర్మాసనం జూన్‌ 2వ తేదీకి వాయిదా వేసింది.

రూ.1500 సాయం అందరికీ ఇవ్వండి
తెల్ల రేషన్‌ కార్డుదారులందరికీ జీవో 45 ప్రకారం రూ.1500 సాయం అందించాలని ప్రభుత్వానికి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత మూడు నెలలుగా బియ్యం తీసుకున్నవారికే కాకుండా కార్డుదారులందరికీ సంబంధిత మొత్తాన్ని ఇవ్వాలని స్పష్టం చేసింది. వరుసగా మూడు నెలలు బియ్యం తీసుకోనివారికి రూ.1500 సాయం నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ ఎ.సృజన రాసిన లేఖను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై బుధవారం ధర్మాసనం విచారణ చేపడుతూ.. ప్రభుత్వం కార్డులు జారీ చేసినవారందరికీ లాక్‌డౌన్‌ సమయంలో ప్రకటించిన రూ.1500 ఆర్థిక సాయం అందించాల్సి ఉందని తెలిపింది. లాక్‌డౌన్‌ సమయంలో ధనవంతులు సుఖంగానే ఉన్నా పేదలకు ఆర్థిక సాయం అందించకపోతే ఆకలితో దుర్భర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది.

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates