వైరస్‌కు వడదెబ్బ

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

వేడి వాతావరణంలో  సామర్థ్యాన్ని కోల్పోతున్న కరోనా

నాగ్‌పుర్‌: ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే వాతావరణంలో కరోనాకు మనుగడ కష్టమవుతున్నట్లు భారతీయ శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో గుర్తించారు. దేశంలోని వేడి వాతావరణం వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు దోహదపడే అవకాశముందని తేల్చారు. అయితే, వాతావరణ పరిస్థితులతో పోలిస్తే.. భౌతిక దూరం, లాక్‌డౌన్‌ వంటి ప్రమాణాలే కొవిడ్‌పై పైచేయి సాధించడంలో అత్యంత కీలక ఆయుధాలని వారు స్పష్టం చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, శ్రీనగర్‌, న్యూయార్క్‌ల్లో పర్యావరణ పరిస్థితులు.. వైరస్‌ వ్యాప్తి తీరును నాగ్‌పుర్‌లోని ‘జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్‌ పరిశోధన ఇన్‌స్టిట్యూట్‌(నీరి)’ శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో విశ్లేషించారు. సాధారణంగా వైరస్‌లు అధిక ఉష్ణోగ్రతల వద్ద తమ సామర్థ్యాన్ని కోల్పోతుంటాయని.. కరోనా అందుకు అతీతమేమీ కాదని వారు తేల్చారు. అయితే, పర్యావరణ కారకాలతో పోలిస్తే స్వీయ జాగ్రత్తలతోనే వైరస్‌కు ముకుతాడు వేసే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌తోపాటు భౌతిక దూరం ప్రమాణాలను పక్కాగా అమలుచేయడం వల్లే కేరళలో వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడం సాధ్యమైందని పేర్కొన్నారు.

వైరస్‌ పుట్టుకపై అమెరికా, చైనా సంయుక్త అన్వేషణ
బీజింగ్‌: యావత్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ పుట్టుక రహస్యాన్ని ఛేదించడమే లక్ష్యంగా అమెరికా, చైనా శాస్త్రవేత్తలు సంయుక్త అన్వేషణను ప్రారంభించారు. కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన అయాన్‌ లిపికిన్‌, గ్వాంగ్ఝౌలోని సన్‌-యట్‌-సేన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన లూ జిన్‌హై ఈ మేరకు కసరత్తులు ప్రారంభించారు. వారి మధ్య సమన్వయం పెరగడంలో చైనాలోని ‘వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం’ కీలక పాత్ర పోషిస్తోంది. గత ఏడాది డిసెంబరు కంటే ముందే కరోనా ఆవిర్భవించిందా? వుహాన్‌లో కాకుండా మరెక్కడైనా అది వెలుగుచూసిందా? అనే విషయాలను శాస్త్రవేత్తలు పరిశీలించనున్నారు. మరోవైపు, కరోనా జాతి వైరస్‌లకు సంబంధించి గబ్బిలాలపై పరిశోధనల కోసం చైనాలోని వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ సహా పలు ప్రయోగశాలలకు ఆంథోనీ ఫౌచీ నేతృత్వంలోని ‘అలర్జీ, అంటువ్యాధుల నివారణ జాతీయ ఇన్‌స్టిట్యూట్‌’ నుంచి గత ఏడాది కోట్ల రూపాయల నిధులు అందిన వివరాలు తాజాగా బయటకు రావడం కలకలం సృష్టిస్తోంది.

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates