మోడీ పాలనలో తుపాకీ సంస్కృతి

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

వి. శ్రీనివాసరావుImage result for - వి. శ్రీనివాసరావు

ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో హింస రాజ్య విధానంగా మారుతోంది. రాజ్యం ప్రజల బాగోగులు చూడాలి. సంక్షేమానికి బాధ్యత వహించాలి. కానీ ఇందుకు భిన్నంగా బీజేపీ వ్యవహరిస్తోంది. ప్రజలంతా మాంద్యంతో అల్లాడుతుంటే మోడీ ప్రభుత్వం ప్రజలపై తుపాకీ ఎక్కుపెడుతోంది. భిన్నాభిప్రాయాలను దౌర్జన్యంగా అణచివేయడం, ఆందోళనలపై ప్రయివేటు సైన్యాన్ని పురిగొల్పడం, మైనార్టీలపై విద్వేషాలను రెచ్చగొడుతూ నాయకులే ప్రసంగాలు చేయడం నిత్యకృత్యంగా మారింది.

2018 ఏప్రిల్‌ 2న ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగారుస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా భారత్‌ బంద్‌ జరిగింది. ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌లలో నాటి బీజేపీ ప్రభుత్వాలు కాల్పులు జరుపగా 11 మంది మృతి చెందారు. అందులో 7గురు ప్రయివేటు బుల్లెట్లకు బలయ్యారు. బజరంగ్‌దళ్‌కు చెందిన గూండాలే ఈ కాల్పులు జరిపారని తర్వాత రుజువైంది. ఈ ఏడాది డిసెంబర్‌ 19న పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుతంగా సాగిన ఉద్యమంపై కాల్పులు చేసి 30మందిని బలిగొన్నారు. ఇందులో పోలీసు బుల్లెట్లకు ఇద్దరు మరణించారని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. మిగతావారు ఎలా చనిపోయారు? పోస్టుమార్టం రిపోర్టు కూడా బయట పెట్టకుండా హడావుడిగా చనిపోయిన వారి అంత్యక్రియలు జరిపించారు. త్రిపుర, కేరళ, మహారాష్ట్రలలో ప్రత్యర్థులపై కాల్పులు, దాడులు జరిపి అనేకమందిని బలిగొన్నారు. భీమా కొరేగావ్‌లో దళితులపై దాడి చేసి వారినే ముద్దాయిలుగా కేసులు పెట్టి వేధిస్తున్నారు. అర్బన్‌ నక్సల్స్‌ పేరుతో పౌర హక్కుల నేతలను, రచయితలను జైళ్ళో పెట్టారు. గౌరీ లంకేశ్‌, గోవింద పన్సారే, కల్బుర్గీ, దబోల్కర్‌లను హత్య చేసిన విషయం అందరికీ తెలుసు. నేడు బీజేపీ ఎంపీలుగా ఉన్న ప్రజ్ఞాసింగ్‌ మాలెగావ్‌ బాంబు పేలుళ్ళ కేసులో నిందితురాలు. గోహత్య పేరుతో 18మంది దళితులను, ముస్లిం రైతులను చంపారు. హైదరాబాద్‌ కేంద్ర విశ్వవిద్యాలయంలో రోహిత్‌ వేముల ఆత్మ బలిదానం నుంచి గుజరాత్‌ ‘ఉనా’ దళితులపై దాడుల వరకు దేశంలో జరిగిన పలు హింసాత్మక ఘటనలకు ఆర్‌యస్‌యస్‌ అనుబంధ సంఘాలే కారణం. మోడీ అధికారానికి వచ్చాక ఇవి మరింత పెరిగాయి. 2019 రెండోసారి అధికారానికి వచ్చాక హింస రాజ్య నిర్వచనంగా మారింది.

జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో ముసుగులేసుకొచ్చి విద్యార్థి యూనియన్‌ అధ్యక్షురాలు అయిషీఘోష్‌తో సహా పలువురు విద్యార్థులపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. జార్ఖండ్‌లో అన్సారీ అనే ముస్లిం యువకుణ్ణి ‘జై శ్రీరాం’ అనలేదని చేతులు కట్టేసి కొట్టి చంపారు. బెంగాల్‌లో ఆఫీజ్‌ అనే మరో యువకుణ్ణి రైలు నుంచి కిందికి తోసేసి చంపారు. అల్లరి మూకలు డిమాండ్‌ చేసినట్టు ‘జై శ్రీరాం’ అనకపోవడమే అతను చేసిన నేరం. ముంబయిలో ఫెలుజ్‌ అనే టాక్సీ డ్రైవర్‌ను ఇలాగే వందేమాతరం చెప్పలేదని చంపేశారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కోకొల్లలుగా పెరిగిపోయాయి. అనేక ఘటనలు కార్పొరేట్‌ మీడియాలో ఇవ్వడం మానేశారు. ప్రజల దృష్టికి రాకుండా అడ్డుకోవడానికి మీడియాపై ఒత్తిడి తెస్తున్నారు. సాహసించి రిపోర్టు చేసే జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారు. మత ఘర్షణలు 30శాతం పెరిగాయి. పౌరసత్వ వ్యతిరేక ఉద్యమం సందర్భంగా ఆర్‌యస్‌యస్‌ విశ్వరూపం మరింత బట్టబయలవుతోంది. ప్రత్యర్థులను దేశ ద్రోహులనే పేరుతో వేధిస్తున్నారు. కేసులు పెడుతున్నారు. జైళ్లకు పంపుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలిచ్చారని యూనివర్సిటీ విద్యార్థులపై కేసులు పెడుతున్నారు. కర్నాటకలో ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా నాటకం వేసిన చిన్న పిల్లలు, టీచర్లు, తల్లిదండ్రులపై కేసు పెట్టారు. 3వ తరగతిలోపు చదివే పిల్లల్ని విచారణ పేరుతో వేధిస్తున్నారు. శాంతియుతంగా సాగుతున్న ఆందోళనలపై దాడి చేసి రక్తపాతం సృష్టిస్తూ ఆందోళనాకారుల్ని హింసావాదులుగా ప్రచారం చేసి, ఎదురుదాడి చేయడం ప్రభుత్వానికి పరిపాటిగా మారింది.

ఎన్నికల కమిషన్‌ నిద్రపోతోందా?
గాంధీ హత్యతో మొదలైన ఆర్‌యస్‌యస్‌ హింసావాదం మత కల్లోలాలతో విచ్చలవిడిగా పేట్రేగిపోతూనే ఉంది. మోడీ, అమిత్‌ షా సహా అనేకమంది బీజేపీ ఎంపీలు హింసను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రోత్సహిస్తూ మాట్లాడుతున్న తీరు ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మత విద్వేషాలు, హింసను రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేస్తున్నా ఎన్నికల కమిషన్‌ చేతలుడిగి వ్యవహరిస్తోంది. బీజేపీకి ఓటేయకుంటే రేప్‌ చేస్తామని మహిళలను బెదిరించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఎన్‌ఆర్‌పై మిస్డ్‌ కాల్స్‌ ఇవ్వమని చెప్పి, అందులో అమ్మాయిలతో డేటింగ్‌ ఇప్పిస్తామని చెప్పిన విషయం గతంలో వెలుగు చూసింది. షహీన్‌బాగ్‌లో సత్యాగ్రహం చేస్తున్న మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీ పర్వేష్‌ వర్మ ‘షాహీన్‌బాగ్‌ మహిళల్ని కాల్చి చంపేయ’మని పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ‘దేశ ద్రోహుల్ని కాల్చేయ’మంటూ బహిరంగంగా పిలుపు నిచ్చారు. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఢిల్లీ ఎన్నికల సభలో మాట్లాడుతూ ‘మాటలతో వినకుంటే బుల్లెట్లతో చెబుతామంటూ’ విద్వేషంతో చెలరేగిపోయారు. ‘మీకు చేతకాకుంటే ఎన్నికల (ఢిల్లీ) తరువాత మేం షాహీన్‌బాగ్‌ శిబిరాన్ని ఎత్తేస్తాం’ అంటూ ఆప్‌ పార్టీకి మరో బీజేపీ ఎంపీ సవాలు విసిరారు. జామియా మిలియా విద్యార్థులు జనవరి 30న మహాత్మా గాంధీకి నివాళులు అర్పించడానికి శాంతియుతంగా రాజ్‌ఘాట్‌ వెళుతుంటే ఒక దుండగుడు కాల్పులు జరిపాడు. అతను ‘ఆప్‌’ సభ్యుడంటూ పోలీసులతో చెప్పించి ఢిల్లీ ఎన్నికల్లో లబ్ది పొందాలని పథకం వేశారు. బాధ్యత కలిగిన కేంద్ర మంత్రి స్థానంలో ఉన్న ప్రకాశ్‌ జవదేకర్‌ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఉద్దేశించి ‘టెర్రరిస్ట్‌’ అన్నాడు. అంటే హింసతో రగిలిపోతున్న ఆర్‌యస్‌యస్‌ మూకదాడిని ప్రోత్సహించడం కాక ఏమవుతుంది? ఎంపీ అనంతకుమార్‌ హెగ్డే స్వాతంత్య్రోద్యమాన్ని తులనాడుతూ అదంతా నాటకమని దానికి నాయకత్వం వహించిన మహాత్ములంతా బ్రిటిష్‌ వారి ఏజెంట్లని నోరు పారేసుకున్నారు. అయినా ఇలాంటి వారిపై ఎన్నికల కమిషన్‌ ఎలాంటి చర్య తీసుకోలేదు. ప్రధాని మోడీ నోరెత్తి మాట్లాడటం లేదు.

హౌం మంత్రి అమిత్‌షా మాట్లాడుతూ ‘ఢిల్లీ ఎన్నికల్లో ఈవీఎం మిషన్‌ బటన్‌లో పద్మంపై నొక్కితే వచ్చే కరెంట్‌ షాక్‌కు షాహీన్‌బాగ్‌ దీక్షలో ఉన్నవారు పారిపోవాల’న్నారు. పాకిస్థాన్‌లో కూడా ముస్లిం ఉగ్రవాదులు ఇలాగే రెచ్చగొడుతున్నారు. వారికీ ఆర్‌యస్‌యస్‌ వారికి తేడా ఏముంది? ఇద్దరూ మత విద్వేష రాజకీయాలనే నడుపుతున్నారు. కనీసం అక్కడ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అలాంటి వారిని ఖండిస్తున్నారు. పాకిస్థాన్‌ సాంస్కృతిక శాఖా మంత్రి హిందువులకు వ్యతిరేకంగా ఇలాగే రెచ్చగొడుతూ మాట్లాడితే అతణ్ణి మంత్రి వర్గం నుంచి తొలగించారు. మరి మోడీ కనీసం ఆ పని కూడా చేయకుండా విద్వేషాలను రెచ్చగొడుతున్న వారిని వెనకేసుకొస్తున్నారు. మోడీ కేబినెట్‌లో కనీసం 12మంది మంత్రులు నిరంతరం మత విద్వేషాలు రెచ్చగొడుతూ మాట్లాడారు. వారిని హీరోలను చేసి మోస్తున్నారు. బీజేపీని వ్యతిరేకించే వారంతా దేశద్రోహులన్నట్టుగా మాట్లాడుతున్నారు. సోషల్‌ మీడియాలో బూతులు, అబద్ధాలతో ప్రజల మధ్య చీలికలు పెడుతున్నారు.

ఆర్‌యస్‌యస్‌కు అనేక సంఘాలున్నాయి. అవసరాన్ని బట్టి కొత్తవి పుట్టుకొస్తున్నాయి. రెచ్చగొట్టే వారిని వెనకేసుకొస్తారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తే వారికీ తమకూ సంబంధం లేదంటారు. తెర వెనుక నుంచి నడిపిస్తుంటారు. సభల్లో హింసను ప్రేరేపిస్తూ ఉపన్యసిస్తారు. ఇప్పుడు బజరంగ్‌దళ్‌ సహా కొన్ని కొత్త సంఘాలు స్థాపించి ఆయుధ శిక్షణ ఇస్తున్నారు. కత్తి తిప్పడం మొదలుకొని తుపాకీ, రివాల్వర్‌ ప్రయోగం వరకూ అన్నీ నేర్పిస్తున్నారు. మిలటరీని కూడా మతోన్మాదపూరితం చేయాలని చూస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఢిల్లీకి దగ్గర్లో బులంద్‌ షహర్‌లో మిలటరీ స్కూలు నెలకొల్పారు. మత విద్వేషంతో పాటు రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు వీరు తెగబడుతున్నారు. ఎలాంటి లైసెన్సులు లేకుండా ఆయుధాలు వాడుతున్నారు. ప్రయోగిస్తున్నారు. అయినా పోలీసులు స్పందించరు. ప్రభుత్వాలు చర్య తీసుకోవు. ఈ గ్యాంగులు ఇలాగే కొనసాగితే దేశంలో సామాన్య పౌరులకు భద్రత ఉండదు. రాజకీయ ప్రత్యర్థులకు అస్తిత్వం ఉండదు. పౌర హక్కులు, ప్రజాస్వామ్యమే మృగ్యమవుతుంది. ఇస్లామిక్‌ ఉగ్రవాదాన్ని సాకుగా చూపించి ప్రతీకారంగా హిందూత్వ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఒక ఉగ్రవాదానికి మరొక మత ఉగ్రవాదం సమాధానం కాదు. అందుకే ఇలాంటి సాయుధ గ్యాంగులను నిషేధించాలని ప్రజలంతా ముక్తకంఠంతో డిమాండు చేయాలి. మతాలకతీతంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొని దేశ సమగ్రతను కాపాడుకోవాలి.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates