నా కొడుకును చంపేశారు..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– సీఏఏ, నిరసనల్లో పాల్గొనటమే వాడు చేసిన తప్పు
– పాట్నాలో హత్యకు గురైన యువకుడి తండ్రి ఆవేదన

ఫుల్వారీ షరీఫ్‌ (పాట్నా): రాజ్యాంగానికి విరుద్ధంగా మోడీ సర్కార్‌ తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు బీహార్‌నూ తాకాయి. సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా డిసెంబరు 21న ఆర్జేడీ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో శాంతియుత నిరసన ప్రదర్శనలపై పాట్నాలో దాడి, పోలీసు కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ రోజు నుంచి కనిపించకుండాపోయిన 18 ఏండ్ల యువకుడు అమీర్‌ హన్జా మృతదేహం పది రోజుల తర్వాత రెండు రోజుల క్రితం లభ్యమైంది. పాట్నా శివార్లలోని ఫుల్వారీ షరీఫ్‌లో భజరంగ్‌ దళ్‌కు చెందిన యువకుల బృందం డిసెంబరు 21న అమీర్‌ను హత్య చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ‘ముస్లిం అయినందునే నా కొడుకును హత్యచేశారు. భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు, దాని మద్దతుదారులే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. డిసెంబరు 21న ఆర్జేడీ బంద్‌ పిలుపు నేపథ్యంలో శాంతియుత నిరసన ప్రదర్శనల్లో పాల్గొనటం నా కొడుకు చేసిన నేరం’ అని అమీర్‌ హన్జా తండ్రి సోహైల్‌ అహ్మద్‌ తీవ్ర ఆవేదనవ్యక్తం చేశారు. ఈ ఘటన వెనుక ఏ ఇతర కారణాలు లేవన్నారు. కాగా, జేడీయూ నేతలుకానీ, ఆర్జేడీ నేతలుకానీ కనీసం పరామర్శిం చటానికి కూడా రాలేదని సోహైల్‌ చెప్పారు.
కాగా, ఇతరులతో కలసి అమీర్‌ను పట్టుకున్నామనీ, బ్యాట్‌తో తలను కొట్టి చంపినట్టు ఈ నేరంలో అరెస్టయిన నిందితుల్లో ఒకరైన దీపక్‌ కుమార్‌ తొలుత ఒప్పుకున్న విషయాన్ని సోహైల్‌ గుర్తుచేశారు. ఆ తర్వాత అమీర్‌ మృతదేహాన్ని అక్కడ సమీపంలోని ఒక చిన్న చెరువులో విసిరేశామని వారు చెప్పారు.

‘మంగళవారం ఉదయం నా సమక్షంలో చెరువు నుంచి మృతదేహాన్ని వెలికితీసినప్పుడు, బారీ భద్రత నడుమ పాట్నా మెడికల్‌ కళాశాలలో పోస్టుమార్టం నిర్వహించిన సమయంలో అతని శరీరంపై మూడు లోతైన గాయాలను చూశాను. నా కొడుకును వారు దారుణంగా హత్యచేశారు’ అని కన్నీటి పర్యంతమయ్యారు సోహైల్‌. ఈ హత్యకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకూ ఆరుగురు నిందితులను అరెస్టుచేశారు. కాగా, ప్రధాన నిందితుడు వినోద్‌ ఇంకా పరారీలో ఉన్నాడనీ, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు ఫుల్వారీ షరీఫ్‌ పోలీస్టేషన్‌ అధికారి చెప్పారు.

తన కొడుకు కనిపించటంలేదని ఫిర్యాదుచేసినా..
‘నిరసన మార్చ్‌ పూర్తయిన కొన్ని గంటల తర్వాత కూడా తన కొడుకు ఇంటికి రాకపోవటంతో నేను మిస్సింగ్‌ కంప్లయిట్‌ ఇచ్చాను. అమీర్‌ను వెతకాల్సిందిగా పోలీసులను వేడుకున్నాను. కానీ, వారు పట్టించుకోలేదు.’ అని సోహైల్‌ తెలిపారు. హత్య జరిగిన పది రోజుల తర్వాత మృతదేహం చెరువులో బయపడిందని చెప్పారు.

పోలీసుల అబద్దపు ప్రచారం…
‘నా కొడుకు మానసిక వికలాంగుడంటూ స్థానిక హిందీ దినపత్రికకు డీఎస్పీ ఇచ్చిన ప్రకటన నిరాధారమైనది, అందులో వాస్తవంలేదు. అమీర్‌ చాలా తెలివైనవాడు, చురుకైనవాడు. పదవ తరగతి పాసయ్యాడు. ఆ తర్వాత కుటుంబ అవసరాలరీత్యా చదువు మానేశాడు. బ్యాగులు తయారు చేసే వర్క్‌షాపులో పనిచేస్తున్నాడు. మానసిక వికలాంగుడన్న ముద్ర వేయటం ద్వారా ఈ కేసుకు కొత్త ట్విస్టు ఇచ్చేందుకు, నిందితులను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దర్యాప్తును పోలీసులు దారి మళ్ళించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని సోహైల్‌ ఆవేదన వ్యక్తంచేశారు.

ఓ ప్రయివేటు దుకాణం నుంచి తీసుకున్న సీసీటీవీ ఫుటేజ్‌లో సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా డిసెంబరు 21న జరిగిన నిరసన ప్రదర్శనలో జాతీయ జెండాతో అమీర్‌ పాల్గొనటాన్ని గుర్తించారు. కాగా, పోలీసులు కాల్పులు జరిపిన నేపథ్యంలో సంగత్‌గాలి ప్రాంతం వద్ద భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు కూడా దాడులకు తెగబడ్డారు.

అప్పుడే తన కొడుకును భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు హత్య చేసి సమీపంలోని చెరువులో పడేసివుంటారని బాధితుడి తండ్రి ఆరోపించారు. తనకు కావాల్సింది ప్రతీకారంకాదనీ, న్యాయం కావాలని సోహైల్‌ స్పష్టంచేశారు. సిఎఎ-ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసినందుకు ముస్లింలను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు రాష్ట్ర పోలీసులు మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్‌ ఆరోపించారు.

(Courtesy: NT)

RELATED ARTICLES

Latest Updates