ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై కీలక తీర్పు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

రిజర్వేషన్ల కల్పన ప్రభుత్వాల విచక్షణాధికారమేనన్న సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల వారికి ఉద్యోగాల్లో, పదోన్నతుల్లో రిజర్వేషన్లను కల్పించడానికి సంబంధించి శుక్రవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్రాలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలాగే, ప్రమోషన్లలో రిజర్వేషన్లను అమలు చేయాలని కోరడానికి సంబంధించి ఎలాంటి ప్రాథమిక హక్కు లేదని పేర్కొంది. ‘రిజర్వేషన్లు కల్పించాలని కోర్టులు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించలేవు’ అని జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వరరావు, జస్టిస్‌ హేమంత్‌ గుప్తాల ధర్మాసనం తేల్చిచెప్పింది.

2012 సెప్టెంబర్‌ 5న ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు అందులో పేర్కొనలేదు. ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయగా, ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రభుత్వ నోటిఫికేషన్‌ను కొట్టివేసింది. ఆ ఉత్తరాఖండ్‌ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పు వెలువరిస్తూ సుప్రీంకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ నోటిఫికేషన్‌ను సమర్ధిస్తూ, హైకోర్టు ఆదేశాలను కొట్టివేసింది.

ప్రభుత్వ నిర్ణయం చట్టవ్యతిరేకమని కోర్టు నిర్ధారించడం సరికాదని తీర్పులో పేర్కొంది. ‘పబ్లిక్‌ పోస్ట్‌ల్లో నియామకాలకు సంబంధించి రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టులు ఆదేశించలేవని చట్టంలో స్పష్టంగా ఉంది. అలాగే, ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు కచ్చితంగా రిజర్వేషన్లు కల్పించాలనే నిబంధన కూడా లేదు. అయినా, ఒకవేళ రాష్ట్రాలు తమ విచక్షణాధికారాన్ని వినియోగించుకుని వారికి రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే, కచ్చితమైన గణాంకాలు సేకరించి, తద్వారా ఆయా వర్గాలను సరైన ప్రాతినిధ్యం లేదని భావిస్తే.. రిజర్వేషన్లు కల్పించవచ్చు’ అని ధర్మాసనం వివరించింది.

రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగంలో ఉన్న నిబంధనలపై కూడా ధర్మాసనం వివరణ ఇచ్చింది. ‘రాజ్యాంగంలోని 16(4), ఆర్టికల్‌ 16(4ఏ) అధికరణలు ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాల్లో, ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించే అధికారాన్ని ప్రభుత్వాలకు కల్పిస్తున్నాయి. ఆయా వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లేదని విశ్వసిస్తే ప్రభుత్వాలు వారికి రిజర్వేషన్లు కల్పించేలా నిర్ణయం తీసుకోవచ్చు. ఆయా అధికరణాల్లో ఆ విషయం స్పష్టంగా ఉంది’ అని ధర్మాసనం పేర్కొంది.

తీర్పును ఖండిస్తున్నాం: కాంగ్రెస్‌
రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తమకు ఆమోదనీయం కాదని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. బీజేపీ పాలనలో ఎస్సీ, ఎస్టీల హక్కులు ప్రమాదంలో పడ్డాయని ఆరోపించింది. ఈ తీర్పును పార్లమెంట్‌ లోపల, వెలుపల కాంగ్రెస్‌ లేవనెత్తుతుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్‌ వాస్నిక్‌ ఆదివారం తెలిపారు. ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడం వారికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. అది ప్రభుత్వాల విచక్షణాధికారంపై ఆధారపడకూడదని కాంగ్రెస్‌ విశ్వాసం’ అని వాస్నిక్‌ పేర్కొన్నారు.

Courtesy Sakshi

RELATED ARTICLES

Latest Updates