శ్రీకాళహస్తికి ఏమైంది?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • జిల్లాలోని 73 కేసుల్లో 50 అక్కడే
  • పట్టణం నుంచి జిల్లాకు వైరస్‌ విస్తరణ
  • అధికార యంత్రాంగ వైఫల్యంతో విజృంభణ
  • తొలుత లండన్‌ కేసులో నిర్లక్ష్యం
  • ఆ తర్వాత మర్కజ్‌ ఉదంతంలో కూడా..
  • క్వారంటైన్‌లోనూ వ్యాపించిన వైరస్‌
  • లాక్‌డౌన్‌ను పట్టించుకోని స్థానికులు
  • సాయం పేరుతో రాజకీయ నేతల జాతర
  • పరిస్థితి విషమించడంతో హడావిడి

అది 85 వేలు దాటని జనాభా కలిగిన చిన్న పట్టణం. స్వర్ణముఖి నదీ తీరాన వాయులింగేశ్వరుడు వెలిసిన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. పవిత్రతకే కాదు ప్రశాంతతకు కూడా పేరుపడిన శ్రీకాళహస్తి ఇప్పుడు కరోనా వైర్‌సకు కేంద్రంగా మారింది. ఇప్పటికే 50 పాజిటివ్‌ కేసులతో జిల్లాను వణికిస్తున్న ఈ పట్టణానికి అసలు ఏమైంది? వైరస్‌ ఎక్కడ మొదలై ఎక్కడికి విస్తరిస్తోంది? 17 మంది ప్రభుత్వ ఉద్యోగులకే వైరస్‌ సోకిన విచిత్ర స్థితి ఎందుకు దాపురించింది? ఇందులో ఎవరి బాధ్యత ఎంత? చిత్తూరు జిల్లాలో 73 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వాటిలో 50 శ్రీకాళహస్తి కేంద్రంగానే నమోదయ్యాయి. ఈ పట్టణానికి మార్చి 12 తర్వాత లండన్‌, ఢిల్లీ, చెన్నైల నుంచి 15 మంది రాగా వారిలో నలుగురికి వైరస్‌ సోకింది. అయితే వీరి ద్వారా 46 మంది ఇతరులకు వైరస్‌ వ్యాపించింది. ఇందులో 17 మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఒక వలంటీరు ఉన్నారు. దీంతో కరోనా విధులంటేనే ప్రభుత్వ ఉద్యోగులందరూ భయపడిపోతున్నారు. ఇక ఎవరి నుంచి సోకిందో తెలియని స్థితిలో ఏడు నెలల గర్భవతి వైర్‌సతో ఆస్పత్రి పాలైంది. శ్రీకాళహస్తి పట్టణం నుంచే కాళహస్తి మండలానికి, తొట్టంబేడు, వరదయ్యపాలెం, బీఎన్‌ కండ్రిగ, ఏర్పేడు మండలాలకు, పుత్తూరు పట్టణానికీ కరోనా వ్యాపించింది. వైరస్‌ విజృంభణతో శ్రీకాళహస్తి పట్టణమంతా రెడ్‌జోన్‌గా మారిపోయింది. పోలీసు వాహనాల సైరన్లు, పోలీసు హెచ్చరికలూ తప్ప మరేవీ వినిపించని స్థితికి పట్టణం చేరుకుంది.

ఇది నిలువెత్తు నిర్లక్ష్యం..!
దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రకటించిన తొలిరోజే జిల్లాలోనే మొదటి కరోనా పాజిటివ్‌ కేసు శ్రీకాళహస్తిలో నమోదైంది. లండన్‌ నుంచి మార్చి 18న శ్రీకాళహస్తికి వచ్చిన యువకుడొకరు 23న అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లాడు. అతనికి కరోనా వైరస్‌ సోకినట్లు 25న వెల్లడైంది. అప్పటికే అతను కుటుంబంతో, బంధుమిత్రులతో గడిపాడు. ఊరి బయట దాబాలకు వెళ్లాడు. ఆ యువకుడిని, కుటుంబసభ్యులను మాత్రమే క్వారంటైన్‌కు తరలించిన అధికారులు, అతడి ఇంటికి రాకపోకలు సాగించిన ఇరుగుపొరుగువారిని, స్నేహితులను విస్మరించారు. కేవలం ఆ యువకుడు చెప్పింది విని తలూపేశారు! లండన్‌ యువకుడు వైరస్‌ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లిపోయాడు. అయితే నెల తర్వాత అతడి ఇరుగుపొరుగున ఉన్న నలుగురికి, అతని స్నేహితుడొకరికి పాజిటివ్‌ అని తేలింది. అంటే లండన్‌ యువకుడు వచ్చాక 35 రోజులుగా ఈ ఐదుగురూ క్వారంటైన్‌లో కాకుండా ఇళ్లలోనే ఉంటూ పట్టణంలో తిరుగుతూ పలువురిని కలుస్తూ ఉన్నారు. ఇప్పుడు వీరి కుటుంబాలు, వీరి సెకండరీ కాంటాక్టులు ప్రమాదంలో పడ్డారు. లండన్‌ యువకుని ఆస్పత్రికి పంపినప్పుడే వీరందిరినీ గుర్తించి క్వారంటైన్‌ చేసివుంటే వైరస్‌ లింకు అక్కడితోనే తెగిపోయేది.

మర్కజ్‌ నుంచీ పాకిన వైరస్‌
ఇక శ్రీకాళహస్తి నుంచి ఢిల్లీ మర్కజ్‌ జమాత్‌ సమావేశాలకు వెళ్లిన 13 మందిలో మార్చి 17న ఆరుగురు, 18న ముగ్గురు విమానంలో తిరుపతికి వచ్చి శ్రీకాళహస్తి చేరుకున్నారు. 19న నలుగురు రైలులో గూడూరు మీదుగా శ్రీకాళహస్తి చేరుకున్నారు.  కేంద్ర నిఘా విభాగం మార్చి 29న హెచ్చరించే దాకా వీరిని జిల్లా యంత్రాంగం గుర్తించలేకపోయింది. అప్పుడు హడావిడిగా 30,31 తేదీలలో వీరినీ, కొంతమంది బంధువులనూ క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. అయితే రిజర్వేషన్‌ లేకుండా ఢిల్లీ నుంచి వచ్చిన వారి గురించిన సమాచారం లేకపోవడంతో వారు పట్టణంలో ఇళ్లలోనే గడిపేశారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన ఒక వ్యక్తినీ, అతని భార్యనూ క్వారంటైన్‌కు తరలించిన అధికారులు వీరి ఇద్దరు కొడుకులను పట్టించుకోలేదు. ఈ నెల 16న తండ్రికి నెగెటివ్‌, తల్లికి పాజిటివ్‌ వచ్చింది. అప్పుడు మరోసారి అధికారులు వారింటికి వెళ్లి,   కాంటాక్ట్‌ల గురించి ఇంట్లోనే ఉన్న కొడుకులను ప్రశ్నించారు. ఆ ఇద్దరి గురించి  అప్పుడు కూడా పట్టించుకోలేదు. అదే రాత్రి ఆ ఇద్దరు కొడుకుల్లో ఒకరికి పాజిటివ్‌ అని తేలింది. వారి పక్కింటి మహిళకు పాజిటివ్‌ అని 19న బయటపడింది. ఆమె కుమారునికి కూడా పాజిటివ్‌ అని 21న వెల్లడైంది. ఢిల్లీ వెళ్లి వచ్చిన మరో వ్యక్తి కుటుంబాన్ని క్వారంటైన్‌ చేసిన అధికారులు అతడి అన్న కుటుంబాన్ని పట్టించుకోలేదు. వారు ఇంట్లోనే ఉంటూ సాధారణ జీవితం గడిపారు. ఈ నెల 21న అతడి అన్నకు, అన్న కుమార్తెకు వైరస్‌ సోకినట్టు తేలింది. మరో ‘ఢిల్లీ వ్యక్తి’ పొరుగింట్లో ఉన్న మహిళకు కూడా అదే తేదీన పాజిటివ్‌గా తేలింది. ఇంకో ఢిల్లీ వ్యక్తి ఇంట్లోనే అద్దెకున్న ప్రభుత్వాస్పత్రి మహిళా ఉద్యోగిఒకరు వైరస్‌ బారిపడినట్లు ఈ నెల 23న వెల్లడైంది. క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంటున్న వారు వ్యవహరించిన తీరు కూడా వైరస్‌ వ్యాప్తికి కారణమైంది! ఈ కేంద్రాల్లో విడివిడిగా ఉండకుండా ఒకే గదిలో వారంతా కలిసి గడిపారు.

లాక్‌డౌన్‌ బేఖాతరు
లాక్‌డౌన్‌ ప్రకటించిన రోజు నుంచే శ్రీకాళహస్తి పట్టణంలో రెడ్‌జోన్‌ ఆంక్షలు కూడా మొదలయ్యాయి. చివరికి 23న పట్టణం మొత్తం రెడ్‌జోన్‌గా ప్రకటించాల్సి వచ్చింది. అయినా తొలి నుంచీ పట్టణంలో ఆంక్షల అమలులో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు.. పేదలకు సాయం పేరుతో పట్టణంలో జాతరలే జరిగాయి.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates