స్వాట్‌ టీములు ఎందుకు?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

* ప్రశ్నిస్తోన్న పార్టీలు, సంఘాలు
* ఎవరిపై ప్రయోగిస్తారు?
* ప్రకాశం జిల్లాలో ఇప్పుడు ఉగ్రవాదులున్నారా?
* నల్లమలలోనూ మావోయిస్టులు లేరని ప్రకటించిన పోలీసులు

1966 ఆగస్టు ఒకటిన చార్లెస్‌ జోసఫ్‌ విట్టన్‌ అనే అతను తన భార్యను, తల్లిని చంపి తరువాత ఆస్టిన్‌లోని టెక్సాస్‌ విశ్వవిద్యాలయంలో ప్రధాన భవనంలోని 28వ అంతస్తు ఎక్కి అక్కడ ఒక స్నైపరుగా స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని సుమారు గంటన్నర వ్యవధిలో 14 మందిని కాల్చి చంపాడు. అదే క్యాంపస్‌లో 32 మందిని గాయపర్చాడు. ఈ సంఘటన తర్వాత అమెరికాలోని లాస్‌ ఏంజిల్‌ పోలీసులు ఆలోచించి ఇలాంటి సంఘటనలను నిరోధించేందుకు తమ ఏజెన్సీలో కొత్త యూనిట్‌ను ఏర్పాటు చేయాలనుకున్నారు. వారి ఆలోచనల నుంచే పుట్టిందే స్వాట్‌ టీము. ఈ విషయాన్ని మన పోలీసులు గుర్తు చేస్తూ ఇక్కడా ఈ టీమును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకు ప్రకాశం జిల్లాను ఎంచుకున్నారు. దీన్ని తాజాగా ప్రకాశం జిల్లా పోలీసులు ఏర్పాటు చేశారు. ఇక్కడ పైలట్‌ ప్రాజెక్టుగా భావించి డిజిపి గౌతంసెవాంగ్‌ దీన్ని ప్రారంభించారు. ఇదొక అద్భుత ఆవిష్కరణగా అభివర్ణించారు. ఏర్పాటు చేసిన ఎస్పీని అభినందించారు.
హఠాత్తుగా ప్రకాశం జిల్లా పోలీసులు ఈ స్వాట్‌ టీమును ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఏ సంఘటన జరిగింది? వారి ఆలోచనలకు ఏది అద్దం పట్టింది? మన జిల్లాలోగానీ, రాష్ట్రంలోగానీ, దేశంలోగానీ విట్టన్‌లాంటి తుపాకీ వ్యక్తులు లేరు. ఎవరూ అలా ఉన్మాదులుగా మారి కాలేజీల్లోగానీ, ప్రయివేటు ఆఫీసుల్లోగానీ, రద్దీ ప్రాంతాల్లోగానీ ఎక్కడా అలాంటి కాల్పులు జరపలేదు. స్పైపర్లు గురించి కూడా ఏనాడూ మనం వినలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రకాశం జిల్లాను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంచుకోవడం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. పోలీసులు ముందు జాగత్తతో మంచి టీమును ఏర్పాటు చేయడాన్ని ఎవరూ వ్యతిరేకించరు. వాళ్లు చెప్పే మాటల్లో వాస్తవం ఎంతుంది? దీని ఉద్దేశాలు ఏమిటి? నిజంగా ఇక్కడ నియంత్రించలేనంతగా ఉగ్రవాదం పెరిగిందా? తీవ్రవాదం ఉంందా? అసాంఘిక శక్తులు పెట్రేగిపోతున్నారా? వంటి ప్రశ్నలకు పోలీసు శాఖ సమాధానం చెప్పాలి.
స్వాట్‌ టీముల ఏర్పాటుపై పార్టీలు, ప్రజా సంఘాలు, అభివృద్ధి వేదికలు, పౌరసంఘాలు పెదవి విరుస్తున్నాయి. ఈ జిల్లాలో అలాంటి పరిస్థితులు ఏమున్నాయంటున్నాయి. ఇప్పుడు హఠాత్తుగా ఈ బృందాన్ని ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో ముందు జాగత్తలు తర్వాత సంగతి ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు ఇంత ప్రమాదంగా ఉన్నాయా? అనే ఆందోళన ప్రజల్లోనూ కలుగుతోంది. ఇందుకు పోలీసుశాఖ కారణంగా చెప్పక తప్పదు. రాజకీయ కోణంలో విశ్లేషించినా పరిస్థితులు అంత ప్రమాదకరంగా ఏమీలేవంటున్నారు. ఉగ్రవాదులు దాడులు చేసిన పంజాబ్‌, ఛండీఘర్‌, బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాల్లోనే ఈ బృందాలున్నాయి. ఈ టీము ప్రాముఖ్యతను వివరించేందుకు పోలీసు శాఖ జారీ చేసిన నోట్‌లోనూ దేశాన్ని పట్టిపీడిస్తోన్న పెద్ద సమస్య తీవ్రవాదంగా చూపారు. బరితెగించిన ఉగ్రవాదం కారణంగా అభివృద్ధికి నోచుకోని దేశాలున్నాయని, శాంతికాముక దేశమైన అగ్రరాజ్యాలకు దీటుగా ఎదుగుతోన్న మన భారతదేశంపై ద్వేషంతో తీవ్రవాదంతో అలజడి సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తూ ప్రజాస్వామ్యాన్ని అల్లకల్లోలం చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తున్న ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఉగ్రవాదాన్ని అరికట్టాలంటే ఒక సమగ్ర ఆర్థిక-రాజకీయ వ్యూహం అవసరం. కేవలం శాంతిభద్రతల సమస్యగా చూసినందునే అది పరిష్కారం కావడం లేదు. పాలకులు రాజకీయంగా పరిష్కారాలు చూడాలి. అంతేతప్ప ఇలాంటి పోలీసు బృందాలతో కాదనేది గమనంలో ఉండాలి. పైగా నల్లమలలోనూ మావోయిస్టులు లేరని పోలీసులే ప్రకటించారు. గతంలో వారిని ఏరివేసేందుకు అక్కడ ఇలాంటి టీములను ఏర్పాటు చేశారు. వారి ప్రభావంపోయాక టీములుపోయాయి. ఇప్పుడు ఈ స్వాట్‌ అవసరమేమిటి? యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు తెరపైకి వస్తున్నాయి. పాలకులు తర్జనభర్జనలు పడుతున్నారు. ఇందుకోసం వీటిని ఏర్పాటు చేస్తున్నారా? అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. అవసరం లేనిచోట్ల ఇలాంటి పోలీసు బృందాలు ఏర్పాటు చేయడం ప్రజలను అణచ డానికేనని పార్టీలు అంటున్నాయి. ప్రజాసంఘాలు, అభివృద్ది వేదికలు కూడా వీటి అవసరం ఈ జిల్లాలో లేవంటున్నాయి. ప్రజా ఉద్యమాలను అణచడానికి దోహదపడతాయే తప్ప మేలు చేయవంటున్నారు. ఏ కారణం చెప్పి వీటిని ఏర్పాటు చేశారో ఆ పరిస్థితులు గానీ, ఆ సంఘటనలుగానీ ఇక్కడ లేనప్పుడు వాటి అవసరం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు.

ఇక్కడ అంతటి ప్రమాదకర పరిస్థితుల్లేవు
ఉగ్రవాదం, అసాంఘిక శక్తుల ఏరివేత పేరుతో జిల్లాలో స్వాట్‌ టీము ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. దీనిపై ప్రజలతో చర్చించలేదు. పోలీసులు ఈ బృందం ఏర్పాటు చేయడానికి చెప్పిన కారణాలు కూడా సహేతుకంగా లేవు. ఉగ్రవాదం ఇక్కడ ఏమీలేదు. ఉన్న చట్టాలను అమలు చేయడానికి యంత్రాంగాన్ని అభివృద్ది చేసుకోకుండా కొత్తగా చట్టాలను మార్చడం, పోలీసు బృందాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం లేదు. వీటిని ప్రయోగించి ప్రజాఉద్యమాలపై ఉక్కుపాదం మోపాలనే ఆలోచన తప్ప మరొకటి కాదు. వీటిని ఉపసంహరిస్తేనే మంచిది.
* పూనాటి ఆంజనేయులు, సిపిఎం తూర్పు ప్రకాశం జిల్లా కార్యదర్శి

ప్రజలను అణచడానికే
నల్లమలలో యురేనియం కోసం ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. తప్పకుండా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ప్రజలను అణచడానికి తీవ్రవాదం పేరుతో ఇలాంటి బృందాలు ఏర్పాటు చేస్తున్నారు. రేపు నల్లమల కోసం ఉద్యమాలు చేసే ప్రజలను, పార్టీలను కూడా తీవ్రవాదులను పట్టుకున్నట్లు పట్టుకునేందుకు ఈ టీములు ఉపయోగపడతాయి. ఇక్కడ తీవ్రవాదం లేదు. సముద్రంలో మెరెన్‌ను అభివృద్ధి చేసుకుంటే అలాంటి ప్రమాదాలు నివారించవచ్చు. ఇక్కడ హఠాత్తుగా పైలట్‌ ప్రాజెక్టుగా దీన్ని పెట్టడం సరికాదు.
* ఎం.ఎల్‌.నారాయణ, సిపిఐ జిల్లా కార్యదర్శి

ప్రజలపై పోలీసు జులుమే ఇది
ప్రభుత్వాన్ని నడిపే నాయకులు శ్రద్ధ పెడితే సమస్యలు తీరతాయి. చురుగ్గా అంతర్గత నిఘావ్యవస్థలు పనిచేయాలి. బాధ్యతగా వ్యవహరించాలి. పోలీసులు ఆదాయాలు లేనివాటిపై శ్రద్ధ పెట్టనందునే ఇలాంటివి పెరిగిపోతున్నాయి. నేరాలు, తీవ్రవాదాలు కొనసాగు తున్నాయి. పోలీసుల పనిసక్రమంగా చేస్తే ఫలితాలుం టాయి. అలా చేయనందున పోలీసులు, ఉగ్రవాదుల మధ్య ప్రజలు నలిగిపోతున్నారు. ఇప్పుడు స్వాట్‌ టీముల వల్ల ఇంకా నలిగిపోతారు. పోలీసుల జులుం ప్రజలపై ఇంకా పెరుగుతుంది. ఇలాంటివి వృథా.
* చుండూరి రంగారావు, అభివృద్ధి వేదిక కన్వీనర్‌

అంత అవసరం ఉందా?
ఈ జిల్లాలో తీవ్రవాదం పేరుతో పోలీసులు పైలట్‌ ప్రాజెక్టుగా స్వాట్‌ టీమును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా? వాస్తవంగా జిల్లాలో పశ్చిమ ప్రాంతం నుంచి జిల్లా కేంద్రం వరకూ జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా గణాంకాలను సమీక్షించి వీటిని ఏర్పాటు చేయాలి. వీటిని ఎందుకోసం పెడుతున్నామో ప్రజలకు చెప్పాలి. అవేవీ లేకుండా ఈ టీముల వల్ల ప్రయోజనం ఎవరికి. నల్లమలలో మావోయిస్టులు కూడా లేరని పోలీసులే ప్రకటించారు. ఇప్పుడు వీటి అవసరం ఏముంది. జరుగుతున్న నేరాలపై దృష్టి పెట్టాలి.
* షంషేర్‌ అహ్మద్‌, రిటైర్డ్‌ జాయింట్‌ కలెక్టర్‌

Courtesy Prajasakthi…

 

 

RELATED ARTICLES

Latest Updates