సోషల్ మీడియాలో చురుకైన పాత్ర

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 ప్రధాన స్రవంతి మీడియా విఫలమైన చోట…
వర్సిటీల్లో ఆగని దాడులు

న్యూఢిల్లీ: సోషల్‌ మీడియా వల్ల నష్టాల సంగతి పక్కన పెడ్తే, సామాజిక ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఇటీవలి పరిణామాల్లో రుజువైంది. ప్రధాన స్రవంతి టీవీ ఛానళ్లు, పత్రికలు విస్మరించిన(అధికార వర్గాలకు కోపం తెప్పించే వాస్తవాలు) సంఘటనల్ని సోషల్‌ మీడియా వెలుగులోకి తెచ్చింది. ఓ చిన్న స్మార్ట్‌ఫోన్‌ కూడా వాస్తవాల్ని కళ్లకు కట్టి చూపడంలో కీలకపాత్ర వహించడం నేటి సాంకేతిక యుగంలో సాధ్యమవుతోంది. ఫిబ్రవరి 6న దేశ రాజధాని నగరం ఢిల్లీలోని గార్గీ మహిళా కళాశాలలో జరిగిన దారుణ సంఘటనల్ని వెలుగులోకి తేవడంలో ప్రధాన స్రవంతి మీడియా విఫలమైంది. సంఘటన జరిగిన మూడు, నాలుగు రోజుల వరకూ దేశ ప్రజలకు ఆ విషయం తెలియకుండా దాచి పెట్టడం వెనుక కారణం ఏమై ఉంటుంది..? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, సంఫ్‌ుపరివార్‌ శక్తులకు భయపడటంగాక మరేమిటి..?

ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని ఓ కాలేజీ విద్యార్థినులపై మూకుమ్మడి లైంగిక వేధింపులు జరిగితే మీడియా దృష్టికి ఆ సంఘటనలు రాలేదని చెప్పగలరా..? అది ఏ మారుమూల ప్రాంతంలోనో జరిగితే అలా భావించడానికి ఆస్కార ముండేది. కానీ, జరిగింది దేశ రాజధాని నగరంలో. .పోలీసుల సమక్షంలోనే..ఈ సంఘటన పట్ల జాతీయ మీడియా నిర్లక్ష్యానికి కారణమేమిటి..? ఈ ప్రశ్నకు సమా ధానం ఆ సంఘటనలో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అల్లరి మూక సంఘ్ పరివార్‌ అనుకూల శక్తులు కావడమే.. జాతీయ మీడియాలో కొన్ని సంస్థలు బీజేపీకి అనుకూలం. అందువల్ల ఆ సంస్థలు తెలిసినా బయట పెట్టవు… కొన్ని సంస్థలు ఎంతోకొంత స్వతంత్రంగా వ్యవహ రించేవే.. అయినా, వీటి యాజమాన్యాలు కూడా బీజేపీ ఇమేజ్‌ని డ్యామేజ్‌ చేసే వార్తల పట్ల కాస్త జాగ్రత్తగా ఉంటా యి. ఎందుకంటే.. ఐటీ, సీబీఐ, ఈడీలతో దాడులు చేయించి ఆ సంస్థల ఉనికినే ప్రమాదంలో పడేసే శక్తి తమకున్న దని ఇప్పటికే కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ కొందరికి రుచి చూపించింది. అది చాలు.. సంఘ్ పరివార్‌ ప్రత్యేకంగా బెదిరించాల్సిన పనిలేదు. గార్గీ సంఘటనలో విద్యార్థి నుల పై లైంగిక వేధింపులకు పాల్పడింది

సంఫ్‌ుపరివార్‌ అను కూల శక్తులేనని స్పష్టమైంది. ఫిబ్రవరి 6న ఈ సంఘటన జరిగింది. ఆ రోజు రెవరీ పేరుతో ఏటా జరిగే సాంస్కృతిక ఉత్సహాన్ని ఆ కాలేజీ విద్యార్థినులు జరుపుకుంటున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని మిగతా కళాశాలల విద్యార్థులు కూడా ఆ కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చారు. అందుకు వారికి అనుమతి ఉన్నది. అదే రోజున ఆ ప్రాంతంలో సీఏఏ అనుకూల ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీలోని కొందరు కాలేజీలోకి చొరబడ్డ తర్వాతే విద్యార్థినులపై లైంగిక వేధింపు సంఘటనలు జరిగాయి. తాగిన మైకంలో ఉన్న అల్లరి మూక తమ లైంగిక భాగాలపై తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారని బాధిత విద్యార్థినులు సోషల్‌ మీడియా ద్వారా తమ గోడు వెల్లబోసుకున్నారు. ఆ తర్వాతే టీవీ ఛానళ్లు, పత్రికలు అందుకు సంబంధించిన వాస్తవాల్ని ప్రపంచానికి తెలిపాయి. అల్లరిమూకలోని కొందరు జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేశారని బాధితులు తెలిపారు. దీంతో, ఈ దుస్సంఘటనలకు పాల్పడింది ఎవరో మరింత స్పష్టమవుతోంది.

గతేడాది డిసెంబర్‌ 15న జామియా మిలియా ఇస్లామియా విద్యాలయంలో, ఈ ఏడాది జనవరి 5న జేఎన్‌యూలో జరిగిన ఘటనల విషయంలోనూ వాస్తవాల్ని చూపడంలో జాతీయా మీడియా(ఇండియా టుడేలాంటివి మినహా) విఫలమైంది. వీటిలో జామియా గురించి పరిశీలిస్తే.. బాధిత విద్యార్థులే పౌర జర్నలిస్టులుగా వ్యవహరించి సోషల్‌ మీడియా ద్వారా తమపై జరుగుతున్న పోలీసుల దమనకాండను వెలుగులోకి తెచ్చారు. ఆ రోజు విద్యార్థులు సీఏఏకు వ్యతిరేకంగా తమ క్యాంపస్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా పోలీసులు జరిపిన లాఠీచార్జి ఏకపక్షమేనని యథార్థ సంఘటనల దృశ్యరూపం కళ్లకు కట్టింది. మొదట బాధిత విద్యార్థుల దగ్గరున్న స్మార్ట్‌ ఫోన్ల ద్వారా తమ మిత్రులకు పంపిన ఫోటోల్లో అక్కడ జరుగుతున్నదేమిటో బయటి ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాతే టీవీ మీడియా అక్కడికి చేరుకునేలా చేసింది. పత్రికలు వాస్తవాల్ని వెలికి తీసేందుకు ఆ ఫోటేలే ఆధారమయ్యాయి. పోలీసులను దీనిపై ప్రశ్నించేందుకు అవే ప్రాథమిక ఆధారాలన్నది గమనార్హం.

గార్గీ సంఘటనలో బాధితులు మహిళలు కావడంతో దృశ్యీకరణ సాధ్యం కాలేదు. జరిగిన నేరాల్ని(అసభ్య ప్రవర్తనను) దృశ్యీకరించి చూపడం వల్ల బాధితులెవరన్నది అందరికీ చూపినట్టవుతుంది. అది నైతికంగా సరైంది కాదు. అయితే, బాధితులెవరన్నది వెల్లడించకుండా జరిగిన దుష్ట చర్యల్ని గురించి మీడియా బహిర్గతం చేసే వీలున్నా అది జరగలేదు. దేశ రాజధానిలోనే జాతీయా మీడియా వైఫల్యానికిది ఓ నిదర్శనం. దేశీయ జర్నలిజపు వెనకబాటుతనానికి కూడా ఇది ఓ ఉదాహరణ.

జేఎన్‌యూ విషయంలోనూ జాతీయ మీడియా.. జరిగిన సంఘటనల్లో తప్పెవరిదో చూపడంలో విఫలమైం దనే చెప్పాలి. యూనివర్సిటీ క్యాంపస్‌లోకి మారణాయు ధాలతో చొరపడ్డ ఏబీవీపీ విద్యార్థులు గూండాల్లా ప్రవర్తించి వామపక్ష విద్యార్థులు, మైనారిటీలే లక్ష్యంగా జరిపిన దాడిని దేశ ప్రజలకు చూపడంలో టీవీ ఛానళ్లు, పత్రికలు పారదర్శకంగా వ్యవహరించలేకపోయాయి. పైగా కోడిగుడ్డు మీద ఈకలు ఏరినట్టు వామపక్ష విద్యార్థులవైపు ఏమైనా తప్పులు జరిగాయా అంటూ భూతద్దంలో పెట్టి వెతికినట్టు వెకిలి ప్రయత్నం చేశాయి. తలకు తీవ్ర గాయమై చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషీఘోష్‌ను కనీసం పరామర్శించేందుకు కూడా ప్రధానిసహా కేంద్ర మంత్రులెవరూ చొరవ చూపకపోవడం ప్రశ్నార్థకం.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates