ఏడు దశాబ్దాల రాజ్యాంగ హామీ ఏమాయె?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

  పి. చిదంబరం
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

మన రాజ్యాంగం ప్రతిరోజూ ఉల్లంఘనకు గురవుతోంది. దేశ పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం సమకూరుస్తామని హామీ ఇచ్చిన 70 సంవత్సరాల అనంతరం కూడా కనీసం సగం మంది పౌరులకు ఎలాంటి న్యాయం అందడం లేదు. మిగతా సగం మందికి అరకొరగా మాత్రమే అందుతోంది!

భారత ప్రజలమైన మనం భారత రాజ్యాంగాన్ని మనకు మనమే సమర్పించుకున్నాం. ‘ఒక వ్యక్తి, ఒక ఓటు’ అనే సూత్రం ప్రాతిపదికన రాజ్యాంగ సభ ఏర్పాటు కాలేదు. కనుక అది యావత్ దేశ ప్రజలందరికీ నిజంగా ప్రాతినిధ్యం వహించలేదు. అయినప్పటికీ అంతిమ ఫలితం ఆధారంగా చూస్తే, రాజ్యాంగ సభ భారత ప్రజలందరికి ప్రాతినిధ్యం వహించిందని చెప్పి తీరాలి. అత్యవసర పరిస్థితి (1975–-77) లేదా కేంద్ర ప్రభుత్వం అకాలంగా కూలిపోవడం (1979–-80) లాంటి మహా ఒత్తిళ్లను అధిగమించడంలో మన రాజ్యాంగం అత్యంత వివేకవంతంగా, ప్రభావాత్మకంగా పని చేయగలదని రుజువయింది. వందకు పైగా సవరణలు జరిగినప్పటికీ రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు ఎటువంటి విఘాతం వాటిల్లకుండా మన సంవిధానం వర్థిల్లుతోంది.

రాజ్యాంగ ‘మౌలిక వ్యవస్థ’ మార్పులకు, సవరణలకు అతీతమైనదనే సిద్ధాంతాన్ని ప్రముఖ న్యాయ కోవిదుడు నానీ పాల్కీ వాలా ప్రవచించారు. అయితే, పాల్కీవాలా వాదనను పలువురు రాజ్యాంగ విద్వాంసులు, న్యాయనిపుణులు కొట్టివేశారు. రాజ్యాంగాన్ని సవరించే విషయంలో (అధికరణ 368) సార్వభౌమిక పార్లమెంటు అధికారాలను ఎలా కుదిస్తారు? కార్యనిర్వాహక వర్గం నియమించిన న్యాయమూర్తుల సమీక్షకు రాజ్యాంగ అంశాలను నివేదించడం ఎలా సమంజసం? అని న్యాయశాస్త్ర దురంధరులు ప్రశ్నించారు. అప్పట్లో ఈ అంశంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనంలోని 13 మంది న్యాయమూర్తులలో ఏడుగురు మాత్రమే పాల్కీవాలా వాదనను అంగీకరించారు. దేశ పౌరులు అందరికీ న్యాయం–- సామాజిక, ఆర్థిక, రాజకీయ–సమకూర్చాలని భారత రాజ్యాంగం సంకల్పించింది. ఆ సంకల్పంలోని ప్రతి పదబంధానికి– – ఉదాహరణకు సామాజిక న్యాయం–- ఒక గంభీర, విస్తృత అర్థం వున్నది. సామాజిక న్యాయం విషయమై రాజ్యాంగం చేసిన వాగ్దానం కోట్లాది మంది ప్రజల హృదయాలలో ఆశాజ్యోతులను వెలిగించింది, ఇంకా వెలిగిస్తోంది. ఆ హామీ నుంచి వారు, తమ జీవితాలను సమున్నతం చేసుకోగలగడంపై ఒక స్పష్టమైన భరోసాను పొందుతున్నారు. ఈ జనవరి 26న మనం రాజ్యాంగ 70 వ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్నాం.

కఠినమైన ప్రశ్నలు అడగవలసిన సమయమిది. సామాజిక న్యాయాన్ని ఎవరు పొందారు? ఎవరు పొందలేదు? ఆర్థిక న్యాయం అంటే ఏమిటి? పౌరులందరూ ఆర్థిక న్యాయాన్ని పొందారా? పౌరులు అందరికీ ఒక రాజకీయ ఓటు వుంటే సమస్త ప్రజలకు రాజకీయ న్యాయం సమకూరుతుందా?

శతాబ్దాలుగా మన సమాజంలో అట్టడుగు స్థాయిలో వున్నవారు షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల ప్రజలే. ఇతర వెనుకబడిన కులాలవారు, ఈ వర్గాలలో మరింతగా వెనుక బడిన కులాల వారు, మైనారిటీలు అభివృద్ధి ఫలాలకు పెద్దగా నోచుకోనివారే. జీవన స్థితిగతులను మెరుగుపరచుకోవడంలో ఈ వర్గాల వారు ఇప్పటికీ తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మన దేశంలో దళితులు, ఆదివాసీలు, ముస్లింలు ఇప్పుడు ఎటువంటి దయనీయ పరిస్థితులలో ఉన్నారో అమెరికాలో ఆఫ్రికన్ అమెరికన్లు (నల్లజాతి ప్రజలు) ఒక వంద సంవత్సరాలకు పైగా అటువంటి దీన పరిస్థితులలోనే వున్నారు. ఆఫ్రికన్ అమెరికన్ల బానిసత్వాన్ని రద్దు చేసేందుకు ఒక అంతర్యుద్ధం అవసరమయింది. 1963లో పౌర హక్కుల చట్టంతో ఆ ప్రజలను సమపౌరులుగా అంగీకరించి, వారి జీవన స్థితిగతులను మెరుగుపరిచే సుదీర్ఘ ప్రక్రియ ప్రారంభమయింది. ఆఫ్రికన్ అమెరికన్లు గతంలో కంటే ఇప్పుడు మరింత ఎక్కువగా సమానావకాశాలను పొందుతున్నారు.

భారత్‌లో మనకు అంటరానితనాన్ని గర్హించిన రాజ్యాంగం వున్నది. మతం ప్రాతిపదికన వివక్షను అది పూర్తిగా నిషేధించింది. షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల వారికి విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ సదుపాయం కల్పించింది. అయితే ,విద్యా ఉద్యోగాలలోనూ, ఆరోగ్య భద్రతలోనూ, ఇతర మానవాభివృద్ధి అంశాలలోనూ ఆ అణగారిన వర్గాల వారికి సామాజిక న్యాయం సమకూరడం లేదన్నది ఒక కఠోర వాస్తవం. ప్రభుత్వోద్యోగాలను పొందడంలో ఆ వర్గాల వారు ఇప్పటికీ అనేక తీవ్ర సమస్యల నెదుర్కొంటున్నారు.

గృహ వసతి, నేరాలు, విచారణలో వున్న ఖైదీలు, క్రీడా బృందాలలో సరైన ప్రాతినిధ్యం కొరవడడం మొదలైన అంశాలకు సంబంధించిన భోగట్టాను నేను ప్రస్తావించలేదు. సంబంధిత సమాచారాన్ని పరిశీలిస్తే ఆయా అంశాలలో ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు తీవ్ర వివక్షకు గురవుతున్నారన్న వాస్తవం స్పష్టమవుతుంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే వారు నిర్లక్ష్యానికి గురవుతున్నారు, అవమానాల పాలవుతున్నారు, హింసకూ బాధితులవుతున్నారు.

సామాజిక న్యాయంతోనే ఆర్థిక న్యాయం సమకూరుతుందనేది ఎవరూ నిరాకరించలేని సత్యం. ఉపేక్షకు గురవుతూ, తీవ్ర ప్రతికూల పరిస్థితుల నెదుర్కొంటున్న ఎస్సీలు, ఎస్టీలు మైనారిటీలు సరైన విద్యార్హతలు లేనివారు. ఆస్తుల విషయం చెప్పనవసరం లేదు. ప్రభుత్వోద్యోగాలు గానీ, నాణ్యమైన ప్రైవేట్ ఉద్యోగాలు గానీ వారికి లభించడం లేదు. ఇటువంటి పరిస్థితులలో జీవన స్థితిగతులను మెరుగుపరచుకునేందుకు అవసరమైన ఆదాయం వారికి ఎలా లభిస్తుంది? వివిధ మానవాభివృద్ధి సూచీలకు సంబంధించిన అధికారిక నివేదికలే ఆయా వర్గాల దయనీయ పరిస్థితులను స్పష్టంగా వెల్లడిస్తున్నాయి.

రాజ్యాంగం ఇచ్చిన మూడో హామీ రాజకీయ న్యాయం గురించి చూద్దాం. ఈ విషయంలోనూ మన గణతంత్రరాజ్యం పురోగతి మనకు గర్వదాయకంగా లేదు. రిజర్్వడ్‌ నియోజకవర్గాల పుణ్యమా అని చట్ట సభలలో షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల వారికి చెప్పుకోదగిన ప్రాతినిధ్యం లభిస్తోంది. పార్లమెంటు, శాసనసభలతో పాటు ప్రజలు ఎన్నుకునే పంచాయతీలు, పురపాలకసంఘాలు, జిల్లా పరిషత్‌లు, మునిసిపల్ కార్పొరేషన్లలో కూడా ఆ వర్గాల వారికి చెప్పుకోదగ్గ ప్రాతినిధ్యం లభిస్తోంది. అయితే, వారికి రాజకీయ న్యాయం సమకూరుతుందా? లేదు. ఆ ప్రాతినిధ్యంతోనే అది ఆగిపోతున్నది. అంతకు మించి అది ఆ వర్గాల వారికి ప్రాప్తించడం లేదు. పలు రాజకీయ పార్టీలలో, విధాన నిర్ణయాలకు సంబంధించిన అత్యున్నత స్థాయి కమిటీలలో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ప్రాతినిధ్యం కేవలం లాంఛన ప్రాయమే. ఎస్సీలు తమ సొంత రాజకీయ పార్టీలు స్థాపించుకున్నా (బహుజన్ సమాజ్ పార్టీ, విసికె ఇందుకు ఉదాహరణలు) ఆ పార్టీలకు షెడ్యూల్డ్ కులాల ఓటర్ల నుంచి మాత్రమే మద్దతు లభిస్తుంది. ఈ వాస్తవాం దృష్ట్యా ఆ పార్టీలు విస్తృత స్థాయిలో సామాజిక, రాజకీయ సంకీర్ణాలను నిర్మించక పోతే అవి ఏ మాత్రం ఎదగలేవు. ఏ ప్రజల శ్రేయస్సు కోసం ఏర్పడ్డాయో ఆ ప్రజల శ్రేయస్సుకు ఎంత మాత్రం తోడ్పడలేవు. ఇక మైనారిటీలు ముఖ్యంగా ముస్లింల విషయానికి వస్తే పరిస్థితి మరీ ఘోరంగా వున్నది. ప్రధాన స్రవంతి రాజకీయ పక్షాలన్నిటిలోనూ మైనారిటీ సెల్స్ వున్నాయి. అయితే, పార్టీ అగ్ర నాయకత్వంలో మైనారిటీల నేతలకు స్థానం వుండదు. భారతీయ జనతా పార్టీ అయితే వారికి రాజకీయ బాధ్యతలను అప్పగించే విషయంలో బహిరంగంగానే తప్పించుకొంటుంది. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక, జాతీయ జనాభా పట్టికతో ముస్లిం మైనారిటీలను బెదిరిస్తోంది. ఇక ముస్లింలు నెలకొల్పిన, వారి నాయకత్వంలో వున్న ఇండియన్ యూనియన్ ఆఫ్ ముస్లిం లీగ్, ఎఐఎమ్ఐ ఎమ్(అఖిల భారత మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్)లు మహా అయితే సంకీర్ణ భాగస్వాములుగా

వుండగలవు, వుంటున్నాయి కూడా. ఇతర పార్టీల విజయావకాశాలను దెబ్బ తీయగలుగుతున్నాయి అంతేగాని అవి తమ సొంతంగా విజయం సాధించలేవు.

ముస్లింలకు సంబంధించిన విషయాలు స్వల్ప మద్దతును మాత్రమే పొందగలుగుతున్నాయి. లేదంటే తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతున్నాయి. జమ్మూ-కశ్మీర్ విషయాన్నే తీసుకోండి . కశ్మీర్ లోయలో నివశిస్తున్న 75 లక్షల మంది ప్రజలకు సంబంధించిన సమస్య విశాల భారతదేశ ప్రజల మద్దతును పొందడంలో విఫలమవుతోంది. ఎవరికీ పట్టని విషయమై పోతోంది. కశ్మీర్ లోయ ( ఇప్పుడు ఒక కేంద్ర పాలిత ప్రాంతం) గత ఆగస్టు 5 నుంచి తీవ్ర దిగ్బంధంలో వున్నది. ఉగ్రవాద సంఘటనలు పెచ్చరిల్లి పోయాయి. 2019లో సంభవించిన ఉగ్రవాద సంఘటనలు గత పది సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక స్థాయిలో చోటు చేసుకున్నాయి. అలాగే వివిధ సంఘటనల్లో హతమై పోయిన లేదా గాయపడిన పౌరుల సంఖ్య కూడా రికార్డు స్థాయిలో అత్యధికంగా వున్నది. ఎటువంటి అభియోగాలు లేకుండానే ముగ్గురు మాజీ ముఖ్య మంత్రులతో సహా మొత్తం 609 మంది పోలీసు కస్టడీలో కొనసాగుతున్నారు. విశాల భారతదేశం కశ్మీర్ ప్రజలను మరచిపోయి ఇతర అత్యవసర అంశాలకు ప్రాధాన్యమిస్తున్నట్టుగా కన్పిస్తోంది. ఇదెంతైనా విచారకరం. గత ఆగస్టులో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేయడంపై సుప్రీం కోర్టులో పలు హెబియస్ కార్పస్ పిటీషన్లు దాఖలై, విచారణలో వున్నాయి. మన రాజ్యాంగం ప్రతిరోజూ ఉల్లంఘనకు గురవుతోంది. కోట్లాది ప్రజలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం నిరాకరింపబడుతోంది. జమ్మూ-కశ్మీర్ వ్యవహారంలో రాజ్యాంగ ప్రతిష్ఠకు తీవ్ర భంగం వాటిల్లింది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసినవారు రాజ్యాంగాన్ని అపవిత్రం చేశారు. దేశ పౌరులందరికీ న్యాయం సమకూరుస్తామని హామీ ఇచ్చిన 70 సంవత్సరాల అనంతరం కూడా కనీసం సగం మంది పౌరులకు ఎలాంటి న్యాయం అందడం లేదు. మిగతా సగం మందికి అరకొరగా మాత్రమే అందుతోంది.

(Courtesy Andhrajyothi)

RELATED ARTICLES

Latest Updates