చర్మానికీ ఓ బ్యాంకు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

Image result for Skin bank in Osmania hospital"ఉస్మానియాలో ఏర్పాటుకు ప్రతిపాదనలు
 ప్రభుత్వం అంగీకరిస్తే అందుబాటులోకి
పేద రోగులకు ఎంతో మేలంటున్న వైద్యులు

బ్లడ్‌ బ్యాంకు.. ఐ బ్యాంకుల గురించి అందరికీ తెలిసిందే. అలాగే చర్మం భద్రపరచడానికి కూడా ఓ బ్యాంకు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో దీనిని ఏర్పాటు చేయాలనే యోచనతో అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం ఉస్మానియాలో ఏటా 1,000 వరకు ప్లాస్టిక్‌ సర్జరీలు జరుగుతుంటాయి. కాలిన గాయాలు, చేతికి, కాళ్లకు, శరీరంపై ఇతర భాగాల్లో తీవ్ర గాయాలు, తెగిన చేతులు, వేళ్లు అతికించడం.. ఇతరత్రా చికిత్సలకు చర్మం అవసరం అవుతోంది. ఇప్పటి వరకు రోగి శరీరంలోని వివిధ భాగాల నుంచి చర్మాన్ని సేకరించి గాయాలైన చోట అమర్చుతున్నారు. 15-20 శాతం మాత్రమే ఇలా సేకరించడానికి వీలవుతుంది. అంతకంటే ఎక్కువ చర్మం అవసరమైనప్పుడు కష్టమవుతోంది. అందుకే చర్మ బ్యాంకు ఏర్పాటు అత్యవసరమని అధికారులు పేర్కొంటున్నారు.

ప్రస్తుతం బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తుల నుంచి ఇతర అవయవాలు సేకరించినట్లే వారి బంధువుల అనుమతితో చర్మాన్ని సేకరిస్తుంటారు. ప్రమాదాల్లో మృతి చెందిన వారి నుంచి కూడా కుటుంబ సభ్యుల అనుమతితో 12 గంటల్లోపు చర్మాన్ని సేకరించి భద్రపరచవచ్చు. అవయవాలను సాధారణంగా 4 నుంచి 7 గంటల్లోపే ఇతరులకు అమర్చాల్సి ఉంటుంది. అమర్చిన తర్వాత కూడా జీవితాంతం అవసరమైన మందులను వాడాలి. చర్మాన్ని మాత్రం ఎన్ని రోజులైనా భద్రపరిచేందుకు వీలుంది. ఇన్‌ఫెక్షన్లను నివారించడానికి కొన్నిరోజులపాటు కవర్‌గా మాత్రమే దానిని వాడతారు. తర్వాత ఇది ఊడిపోతుంది. అందుకే ఎక్కువగా మందులు వాడాల్సిన అవసరం ఉండదు.

ఏమిటి ఉపయోగం?
ప్రస్తుతం ముంబయి, గుజరాత్‌, పుణె, దిల్లీలలో మాత్రమే ఈ తరహా బ్యాంకులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉన్నాయి. ప్రైవేటులో ఒక శాతం చర్మానికి గ్రాఫ్టింగ్‌ చేయాలంటే రూ. 30,000 నుంచి రూ. 1.5 లక్షల వరకు ఖర్చవుతోంది. 30-40 శాతం కాలిన గాయాలైతే గ్రాఫ్టింగ్‌కు రూ. 15 లక్షలపైనే అవుతుంది. ఈ నేపథ్యంలో ఉస్మానియా ఆసుపత్రిలో ఈ బ్యాంకు ఏర్పాటు చేస్తే ఎంతోమంది పేదలు, సామాన్యులకు మేలు జరుగుతుందని వైద్యులు భావిస్తున్నారు. ఒక ప్లాస్టిక్‌ సర్జరీ నిపుణుడితోపాటు ఇద్దరు, ముగ్గురు పీజీలు, నర్సులతో కూడిన ప్రత్యేక బృందం, పరికరాల కొనేందుకు రూ. కోటి వరకు వ్యయం అవుతుందని చెబుతున్నారు.

ఎందుకీ బ్యాంకు?
ముఖ్యంగా అగ్ని ప్రమాదాల్లో గాయపడిన వారికి చర్మం చాలా అవసరం. చర్మం కింద నాలుగు పొరలు ఉంటాయి. మంటల్లో కాలిపోయినప్పుడు కింద పొరలు కూడా దెబ్బతింటాయి. ఫలితంగా ఇన్‌ఫెక్షన్లు సోకి ఎక్కువమంది మృతి చెందుతుంటారు. తక్కువ గాయాలతో వచ్చిన వారికి వారి శరీరంలోని ఇతర భాగాల నుంచి చర్మం సేకరించి కాలిన గాయాల వద్ద అతికిస్తారు. ఇది పెద్ద కష్టం కాదు. కానీ శరీరమంతా కాలితే మాత్రం.. చికిత్స కష్టమవుతుంది. అప్పుడు స్కిన్‌ బ్యాంకు నుంచి చర్మాన్ని సేకరించి రోగికి తాత్కాలిక బయలాజికల్‌ కవర్‌గా గ్రాఫ్టింగ్‌ చేసి ఇన్‌ఫెక్షన్లను నియంత్రిస్తారు. మూడు వారాల తర్వాత ఈ చర్మం ఊడిపోతుంది.

(Courtesy Eenadu)

RELATED ARTICLES

Latest Updates