ప్రచారం ఎక్కువ.. పనులు తక్కువ

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– ఆరేండ్లలో ఒక్క పెద్ద పరిశ్రమా రాలేదు
– పెండింగ్‌లో రూ.2 వేల కోట్ల రాయితీ బకాయిలు
– పోటీని తట్టుకోలేక మూతపడుతున్న చిన్న పరిశ్రమలు

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఆరేండ్లలో ఒక్క భారీ పరిశ్రమ రాలేదు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ) రంగంలో ఎన్ని కొత్త పరిశ్రమలు వస్తున్నాయో దాదాపు అందులో సగానికిపైగా మూతపడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం గడిచిన మూడేండ్లుగా పరిశ్రమలకు చెల్లించాల్సిన రాయితీ బకాయిలు రూ. 2,000 కోట్లు పెండింగ్‌లో ఉండడంతో బ్యాంకు రుణాలు చెల్లించలేక వేలాది పరిశ్రమలు ఎన్‌పీఏ బాటపడుతున్నాయి. భూ బ్యాంక్‌ కోసం రైతులనుంచి తక్కువ ధరలకు బలవంతంగా భూములు కొని పారిశ్రామిక వేత్తలకు అధిక అధిక ధరలకు అమ్ముతున్నదని రైతులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ పారశ్రామిక రంగంలో 2019 ఏడాది ఒక్క ఐటీ రంగంలో తప్ప మిగతా ఉత్పత్తులు, ఉపాధిలో రాష్ట్ర సర్కార్‌ ప్రచారానికి పనులకు పొంతన లేకుండా ఉన్నది.

పెండింగ్‌లో 2500 కోట్లరాయితీలు
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ) రంగంలో గత ఐదేండ్ల కాలంలో చెల్లించాల్సిన రాయితీ బకాయిలు రూ.2000 కోట్లకు పేరుకు పోయాయి. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసే సమయంలో తీసుకుంటున్న స్టాంప్‌డ్యూటీ రిఫండ్‌, పెట్టుబడి మొత్తంపై ఇచ్చే సబ్సిడీ, మహిళా పారిశ్రామిక వేత్తలు, షెడ్యుల్‌ కులాలు, షెడ్యుల్‌ తెగల వారికి ఇచ్చే ప్రత్యేక రాయితీ, విద్యుత్‌ వాడకంపై యూనిట్‌కు రూ.1, పావలా వడ్డీకి రుణాలు తదితర అనేక రాయితీలను ప్రభుత్వం అందిస్తున్నది. అయితే గత ఐదేండ్లుగా తెలంగాణ సర్కార్‌ వీటిని చెల్లించక పోవడంతో బకాయిలు వేల కోట్లకు చేరుకున్నాయి.

పేరుకే హెల్త్‌ క్లీనిక్‌
నష్టాల బారిన పడి మూత పడ్డ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను (ఎంఎస్‌ఎమ్‌ఈ) పునరుద్ధరించేందుకు ప్రారంభించిన తెలంగాణ ఇండిస్టియల్‌ హెల్త్‌ క్లీనిక్‌ భవితవ్యం అగమ్యగోచరంగా తయారైంది. గడిచిన ఐదేండ్లలో 12 వేల పరిశ్రమలు మూతపడితే, ఒక్క 2019 ఏడాదిలోనే ఈ రంగంలో 2500 పరిశ్రమలు మూతపడ్డాయి. హెల్త్‌క్లీనిక్‌ ప్రారంభించిన 18 నెలల కాలంలో కేవలం 37 యూనిట్లు మాత్రమే పునరుద్ధరణకు నోచుకోగా, మరో 18 యూనిట్లు పునరుద్ధరణ దశలో ఉన్నాయి.

బలవంతంగా భూసేకరణ
పరిశ్రమల కోసం తెలంగాణ సర్కార్‌ ఉపయోగంలో లేని భూమితో కలుపుకుని మొత్తం లక్షా 50 వేల ఎకరాలను సేకరించాలని నిర్ణయించింది. గడిచిన ఐదేండ్ల కాలంలో 49 పారిశ్రామిక క్లస్టర్లకు శ్రీకారం చుట్టి ఇప్పటి వరకు 50 వేల ఎకరాలను సేకరించింది. వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పేరిట రూ.8 లక్షల నుంచి రూ.12.5 లక్షల వరకు చెల్లిస్తున్నది. ధరలు తమకు సమ్మతం కాదని భూములు ఇవ్వని రైతులను నయానో భయానో ఒప్పించి బలంతంగా గుంజుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

Courtesy Nava telangana

RELATED ARTICLES

Latest Updates