ఎటూ తేల్చని సిట్‌

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఏదైనా సంచలనాత్మక ఉదంతం చోటు చేసుకున్నప్పుడు దాని తీవ్రతను బట్టి దర్యాప్తు బాధ్యతను ప్రత్యేక బృందాల(సిట్‌)ను ఏర్పాటు చేస్తారు. సమర్థులైన అధికారులకు ఆ బాధ్యతను అప్పగిస్తారు. సమగ్రంగా, త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయడం దీని లక్ష్యం. ఆ బృందమే దర్యాప్తు నిర్వహించి న్యాయస్థానంలో అభియోగపత్రాల్ని దాఖలు చేయాలి. కానీ తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పటివరకు ఏర్పాటైన మూడు సిట్‌లూ దర్యాప్తును సమగ్రంగా ముగించిన దాఖలాలు లేవు. తాజాగా షాద్‌నగర్‌ చటాన్‌పల్లి ఎదురుకాల్పుల ఘటనలో దిశ హత్యాచారం కేసు నిందితుల మృతిపై సిట్‌ ఏర్పాటు కావడం ప్రాధాన్యం సంతరించుకొంది.

  1. నాలుగున్నరేళ్లు దాటినా అంతే సంగతులు
    కేసు: ఆలేరు వద్ద ఎన్‌కౌంటర్‌
    సిట్‌ సభ్యులు:సందీప్‌ శాండిల్య (ఐజీ-పర్సనల్‌), షానవాజ్‌ ఖాసిం (ఖమ్మం ఎస్పీ), దయానంద్‌రెడ్డి (ఇంటెలిజెన్స్‌ అదనపు ఎస్పీ), రమణకుమార్‌ (మాదాపూర్‌ ఏసీపీ), రాజా వెంకట్‌రెడ్డి, రవీందర్‌ (ఇన్‌స్పెక్టర్లు)
    నేపథ్యం:ఉమ్మడి నల్గొండ జిల్లా ఆలేరు వద్ద 2015 ఏప్రిల్‌ 7న జరిగిన కాల్పుల్లో వికారుద్దీన్‌తో సహా మరో నలుగురు పోలీసు వ్యానులోనే హతమయ్యారు. వరంగల్‌ కేంద్ర కారాగారం నుంచి పాత కేసు విచారణ నిమిత్తం వీరిని నాంపల్లి న్యాయస్థానానికి తీసుకొస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్కార్టు పోలీస్‌ సిబ్బంది చేతుల్లో నుంచి వికారుద్దీన్‌ బృందం తుపాకులు లాక్కునేందుకు ప్రయత్నించడంతో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందనే అంశంపై దర్యాప్తునకు సిట్‌ ఏర్పాటైంది.
    పనితీరు: నాలుగున్నరేళ్లు దాటినా దర్యాప్తు పూర్తి కాలేదు.
  2. జీడిపాకంలా విచారణ
    కేసు: నయీం అక్రమాస్తుల వ్యవహారం
    సిట్‌ సభ్యులు:నాగిరెడ్డి(ఐజీ), శ్రీనివాసరెడ్డి (సైబరాబాద్‌ క్రైమ్స్‌ అదనపు డీసీపీ), శ్రీధర్‌, సుధాకర్‌, షాకిర్‌ హుస్సేన్‌, రాజశేఖర్‌రాజు, వెంకటేశ్‌, మధుసూదన్‌రెడ్డి, సీతారాం (ఇన్‌స్పెక్టర్లు)
    నేపథ్యం:కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ నయీముద్దీన్‌ 2016 ఆగస్టు 8న షాద్‌నగర్‌ మిలీనియం టౌన్‌షిప్‌ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు.అతడు బెదిరింపుల ద్వారా కూడబెట్టిన అక్రమాస్తుల వ్యవహారాన్ని తేల్చడంతో పాటు అతడితో సంబంధమున్న రాజకీయ నాయకులు, పోలీస్‌ అధికారుల సంగతి తేల్చేందుకు సిట్‌ ఏర్పాటైంది.
    పనితీరు: సిట్‌ పలు అంశాల్ని శోధించింది. 200లకు పైగా కేసులు నమోదు చేయించడంతో పాటు 75కు పైగా కేసుల్లో అభియోగపత్రాల్ని దాఖలు చేయించింది. రూ.వందల కోట్ల అక్రమాస్తుల్ని గుర్తించగలిగింది. అయితే రాజకీయ నాయకుల ప్రమేయంపై మాత్రం ఇప్పటివరకు ఏమీ తేల్చలేకపోయింది.
  3. ఆదిలోనే హడావుడి…
    కేసు: ఐటీ గ్రిడ్‌ డేటా చౌర్యం
    సిట్‌ సభ్యులు:స్టీఫెన్‌ రవీంద్ర (ఐజీ), శ్వేత (కామారెడ్డి ఎస్పీ), రోహిణి ప్రియదర్శిని (సైబరాబాద్‌ డీసీపీ-క్రైమ్స్‌), శ్రీధర్‌ (నారాయణపేట ఎస్డీపీవో), రవికుమార్‌రెడ్డి (సైబరాబాద్‌ డీఎస్పీ), శ్యాంప్రసాద్‌రావు (మాదాపూర్‌ ఏసీపీ), శ్రీనివాస్‌ (సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ), రమేశ్‌, వెంకట్రామిరెడి ్డ(సైబర్‌క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్లు)
    నేపథ్యం:తెలుగుదేశం పార్టీకి సాంకేతిక సేవలందిస్తున్న ఐటీ గ్రిడ్‌ సంస్థ ఆంధ్రప్రదేశ్‌ ప్రజల డేటాను చోరీ చేసిందనేది అభియోగం. ప్రజలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన సమాచారాన్ని ఆ సంస్థ ఇతర ప్రయోజనాలకు వినియోగించిందనే అభియోగంతో మాదాపూర్‌లో కేసు నమోదైంది. దీనిపై గత మార్చిలో సిట్‌ ఏర్పాటైంది.
    పనితీరు: రాజకీయ ప్రాధాన్యం సంతరించుకోవడంతో తొలినాళ్లలో కొంత హడావుడి జరిగినా ప్రస్తుతం ఈ కేసులో ఎక్కడా కదలిక లేదు. (ఆయా సిట్‌లలోని అధికారుల హోదాలు వాటిని ఏర్పాటు చేసినప్పటివి)

తాత్సారానికి అసలు కారణం అదేనా? : ఇప్పటివరకు ఏర్పాటైన మూడు సిట్‌ల పనితీరును పరిశీలిస్తే దర్యాప్తు అంత సులభంగా కొలిక్కిరాదనే విషయం స్పష్టమవుతోంది. ఇందుకు కారణాల్ని విశ్లేషిస్తే.. సిట్‌ ఏర్పాటైన సమయంలో ఉన్నంత హడావుడి గానీ, శ్రద్ధ గానీ తర్వాతికాలంలో కానరావట్లేదు. సాధారణంగా సిట్‌ ఏర్పాటు చేసినప్పుడు పలు హోదాల్లోని పోలీస్‌ అధికారుల్ని గుర్తించి బాధ్యతలు అప్పగిస్తారు. కేసు తీవ్రతను బట్టి ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో దీన్ని ఏర్పాటు చేస్తారు. ఆ బృందంలోని పోలీసు అధికారులకు ఈ కేసు దర్యాప్తు అదనపు భారం కావడమే జాప్యానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సిట్‌ ఏర్పాటైనప్పుడు కొన్ని రోజులు మాత్రమే ప్రత్యేక కేసుపై దృష్టి సారించిన బృందం సభ్యులు తర్వాత తమ రోజువారీ పనుల్లో నిమగ్నమైపోతున్నారు. కాలక్రమేణా కేసు ప్రాధాన్యం తగ్గడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటం లాంటి కారణాలతో దర్యాప్తు మూలన పడుతోంది.

Courtesy Eenadu…

RELATED ARTICLES

Latest Updates