కార్మికుల సమ్మె.. బొగ్గు బంద్‌.

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

బ్లాకుల వేలంపై ఆగ్రహం
సింగరేణిలో కార్మికుల సమ్మె
27 భూగర్భ గనులు, 19 ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో విధుల బహిష్కరణ

బొగ్గు బ్లాకులను వేలం పాట ద్వారా కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఐదు జాతీయ కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. 72 గంటల సమ్మెలో భాగంగా మొదటి రోజు గురువారం రాష్ట్రంలోని సింగరేణి వ్యాప్తంగా కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ర్యాలీలు తీశారు. కార్మికులకు వామపక్షాలు కూడా మద్దతుగా నిలిచాయి. బొగ్గు పరిశ్రమను నిర్వీర్యం చేసేలా ఉన్న ప్రయివేటుకు అప్పగించే ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్‌ చేశాయి.

గోదావరిఖని: సింగరేణి వ్యాప్తంగా 27 భూగర్భ గనులు, 19 ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో విధులు నిర్వర్తించే కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు. దీంతో సుమారు లక్షా75వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఆదిలాబాద్‌ జిల్లాలోని మందమర్రి, శ్రీరాంపూర్‌, బెల్లంపల్లి డివిజన్లలోని 6 ఓసీపీ, 17 భూగర్భ గనుల్లోని 19వేల మంది కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. దీంతో 19వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కార్మికులతో నిత్యం కళకళలాడే గని పరిసరాలు వెలవెల బోయాయి. గనుల్లో అత్యవసర పనుల్లో తప్ప మిగతావారు హాజరు కాలేదు.

సమ్మె మొదటిరోజు విజయవంతం చేసిన కార్మికవర్గానికి ఐదు జాతీయ సంఘాల నాయకులు తుమ్మల రాజురెడ్డి, వై.గట్టయ్య, ధర్మపురి, రియాజ్‌ అహ్మద్‌, కెగర్ల మల్లయ్య కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలోని ఆర్జీ1 జీఎం కార్యాలయం నుంచి బొగ్గు గనుల వరకు మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అండర్‌ గ్రౌండ్‌ గనులు, ఓపెన్‌ కాస్ట్‌, వివిధ డిపార్ట్‌మెంట్ల కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఆర్జీ1 జీఎం కార్యాలయం ఎదుట టీబీజీకేఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

గోదావరిఖని విట్టల్‌ నగర్‌పోస్ట్‌ ఆఫీస్‌ వద్ద నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కడారి సునీల్‌, సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వేల్పుల కుమార స్వామి, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి తోకల రమేష్‌, ఏఐసీటీయూ రాష్ట్ర నాయకులు ఎంఏగౌస్‌ పాల్గొన్నారు. ప్రధాన చౌరస్తాలో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. బొగ్గు గనుల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, సత్తుపల్లి సింగరేణి బొగ్గు గనులు ఓపెన్‌ కాస్ట్‌లలో కార్మికులు పెద్ద సంఖ్యలో సమ్మెలో పాల్గొన్నారు.

కొత్తగూడెం రీజియన్‌ పరిధిలో ఉన్న కొత్తగూడెం కార్పొరేట్‌, ఇల్లందు, మణుగూరు, సత్తుపల్లి ప్రాంతాల్లో 3300 మంది కార్మికులగాను, 2000 మంది సమ్మెలో పాల్గొన్నారు. 90 వేల టన్నులకుగాను, 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే జరిగింది. గనుల వద్ద జరిగిన సమావేశంలో సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(సీఐటీయూ) రాష్ట్ర కార్యదర్శి మందా నరసింహారావు మాట్లాడారు. బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేయాలని, ఔట్‌ సోర్సింగ్‌ పేరుతో చేపడుతున్న బొగ్గుగనుల ప్రయివేటీకరణను ఆపాలని డిమాండ్‌ చేశారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates