సిద్దిపేట జిల్లాలో.. ఏకే-47 కాల్పుల కలకలం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
అక్కన్నపేటలో సిమెంటు ఇటుకల గొడవ
గంగరాజు అనే వ్యక్తిపై సదానందం కాల్పులు
తప్పిన ప్రాణాపాయం.. పరారీలో నిందితుడు
టీవీల్లో చూసి సమాచారమిచ్చిన యువకుడు
సాయంత్రం కోహెడ వద్ద నిందితుడి అరెస్టు
ఆ తుపాకీ హుస్నాబాద్‌ ఠాణాలో మాయం

అక్కన్నపేట, కోహెడ : సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో గురువారం రాత్రి ఏకే-47 కాల్పుల కలకలం రేగింది. నాలుగు సిమెంటు ఇటుకల విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన వివాదంలో.. ఓ వ్యక్తి తన వద్ద అక్రమంగా దాచిపెట్టుకున్న ఏకే-47తో కాల్పులకు దిగాడు. ఈ ఉదంతంతో.. మూడేళ్ల క్రితం హుస్నాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌లో కనిపించకుండాపోయిన ఒక ఏకే-47, ఒక కార్బైన్‌ కేసు మిస్టరీ వీడినట్లయింది. వివరాల్లోకి వెళ్తే.. అక్కన్నపేటకు చెందిన దేవిని సదానందం గతంలో పదేళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నాడు.

మూడు రోజుల క్రితం సదానందం, అతడికి పొరుగునే ఉండే గుంటి గంగరాజు కుటుంబానికి మధ్య నాలుగు సిమెంట్‌ ఇటుకల విషయంలో వివాదం జరిగింది. అదే రోజు రాత్రి సదానందం ఓ తల్వార్‌తో గంగరాజు కుటుంబంపైకి వెళ్లాడు. గంగరాజును చంపేస్తానంటూ బెదిరించాడు. స్థానికులు అతడిని వారించి, అక్కడి నుంచి పంపించారు. అంతటితో గొడవ సద్దుమణిగిందని అంతా అనుకుంటుండగా.. సదానందం మాత్రం గంగరాజును అంతమొందించేందుకు పథకం పన్నాడు. అందులో భాగంగా.. తన వద్ద ఉన్న ఏకే-47తో గంగరాజును కాల్చి చంపాలనుకున్నాడు.

అతడు మూడేళ్ల క్రితం హుస్నాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ నుంచి ఓ ఏకే-47, ఒక కార్బైన్‌ తుపాకీని దొంగిలించాడు. గంగరాజుపై కాల్పులు జరిపే ముందు.. ఎవరికీ అనుమానం రాకుండా రెండు రోజులుగా బాణసంచా కాల్చడం ప్రారంభించాడు. గురువారం రాత్రి గంగరాజును చంపేందుకు ఇంట్లో దాచిన ఏకే-47 తుపాకీని బయటకు తీశాడు. పనిచేస్తుందో.. లేదోనని నిర్ధారించుకునేందుకు నేలపైకి ఓ రౌండు కాల్చాడు. అంతా సవ్యంగా ఉందనుకుని నిర్ధారించుకుని.. గంగరాజు ఇంటికి వెళ్లాడు. ఇంటి తలుపులు వేసి ఉండటంతో.. కిటికీలోంచి రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ హఠాత్పరిణామంతో గంగరాజు కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. పెద్దపెట్టున తుపాకీ శబ్దాలు రావడంతో.. స్థానికులంతా ఇళ్లలోంచి బయటకు వచ్చారు. వారిని గమనించిన సదానందం.. తుపాకీతో పరారయ్యాడు. ఇంటిముందు అలికిడి విని బయటకు వచ్చిన గంగరాజు కుటుంబ సభ్యులు అసలు విషయం తెలుసుకుని, పోలీసులకు సమాచారం అందించారు. హుస్నాబాద్‌, సిద్దిపేట ఏసీపీలు మహేందర్‌, రామేశ్వర్‌, ట్రాఫిక్‌ ఏసీపీ బాలాజీ తమ సిబ్బందితో కలిసి సంఘటనాస్థలికి చేరుకున్నారు.

ఒక లైవ్‌ బుల్లెట్‌, రెండు కాల్చిన బుల్లెట్ల షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సదానందం ఇంట్లో ఏకే-47ను భద్రపరిచే బెల్టు, ఒక తల్వార్‌, ఒక బాడిసె, రెండు సెల్‌ఫోన్లను సీజ్‌ చేశారు. కాల్పులు జరిపిన తూటాలు సర్వీసు ఆయుధం నుంచి వచ్చినవేనని ప్రాథమికంగా నిర్ధారించారు. ఏకే-47 బెల్టు కూడా పోలీసులు వినియోగించేదే కావడంతో.. కచ్చితంగా అది మూడేళ్ల క్రితం హుస్నాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌లో మాయమైనదేనని గుర్తించారు. సదానందాన్ని అరెస్టు చేసేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఓ యువకుడి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. కోహెడలో సదానందాన్ని అరెస్టు చేశారు. తాను వాడిన తుపాకీని హుస్నాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌లో దొంగిలించానని అంగీకరించాడని తెలిసింది.

దాంతో.. పోలీసులు మరో తుపాకీ(కార్బైన్‌)ని దాచిన ప్రదేశానికి నిందితుడిని తీసుకెళ్లి.. సీజ్‌ చేసినట్లు సమాచారం. అదే సమయంలో.. తుపాకులను దాచడంలో సదానందానికి సహకరించిన అతడి భార్య కృష్ణవేణిని కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది. కాగా.. హుస్నాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌లో 2016 డిసెంబరులో ఏకే-47, కార్బైన్‌ తుపాకులు చోరీకి గురయ్యాయి. ఈ విషయంపై 2017 మార్చి 25న ‘ఆంధ్రజ్యోతి’ ఓ కథనాన్ని ప్రచురించింది. అప్పటి సీఐ భూమయ్య బదిలీ తర్వాత ఆయన గన్‌మన్లు తుపాకులను సరెండర్‌ చేయకపోవడాన్ని ప్రస్తావించింది.

తుపాకుల చోరీ ఇలా..
పటిష్ఠ భద్రత ఉండే పోలీ్‌సస్టేషన్‌లో.. అందులోనూ ఠాణాలోని ఆయుధాగారం (బెల్‌ ఆఫ్‌ ఆర్మ్‌స్‌) నుంచి తుపాకులు ఎలా చోరీకి గురయ్యాయి? పోలీసుల విచారణలో సదానందం ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు. సదానందానికి, అతడి మొదటి భార్యతో గొడవలు జరిగేవి. అది కాస్తా 2016లో హుస్నాబాద్‌ ఠాణాలో కేసు పెట్టేదాకా వెళ్లింది. ఆ క్రమంలో పోలీసులు పలుమార్లు సదానందానికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అదే సమయంలో అతడు పోలీసు సిబ్బందితో చనువుగా ఉండేవాడు. ఈ క్రమంలో ఓ రోజు అంతా బందోబస్తు విధుల్లో ఉండగా.. అదును చూసుకుని, ఏకే-47, కార్బైన్‌ తుపాకులను చోరీ చేశాడు. మొదటి భార్యతో అనధికారికంగా విడిపోయాక.. అతడు కృష్ణవేణిని పెళ్లి చేసుకున్నాడని పోలీసులు గుర్తించారు. ఇంట్లో తుపాకులు ఉన్న విషయం కృష్ణవేణికి ముందునుంచీ తెలిసినా.. పోలీసులకు సమాచారం ఇవ్వలేదని, ఈ కేసులో ఆమెను కూడా నిందితురాలిగా చేరుస్తామని అధికారులు తెలిపారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates