రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న ఆరెస్సస్‌

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

నిజానికి మన భారత రాజ్యాంగం హిందూమతం ప్రతిపాదించిన, వర్ణం, కులం, ఆచారం అన్నింటికి ప్రత్యామ్నాయ సిద్ధాంతాలతో రూపొందింది. ఈ క్రమంలో భారత దేశం ‘సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రంగా ప్రకటించబడింది. అంతేగాక సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని కలిగించేదిగా ఉంది. మన రాజ్యాంగం ద్వారా మనకు ఆలోచనా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ కలుగుతున్నాయి. భారత రాజ్యాంగం సమాన హోదా, సమాన అవకాశాలను కలిగిస్తుంది. దీని ద్వారా భారతీయులు రాను రాను సమైక్యతా భావాన్ని పెంపొందించుకోవలసి వుంది. కులమత భావాలు లేని అఖండతా భావం పెంపొందించుకొంటూ ముందుకు వెళ్ళాల్సి వుంది. కుల భావం తగ్గే కొద్దీ ప్రజల మధ్య సోదర భావం పెరుగుతుంది. ప్రతి మనిషికి ఒక విలువ, ఆత్మగౌరవం పెంపొందించుకోవలసి వుంది. అయితే బి.జె.పి అధికారంలోకి వచ్చాక రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయాలని ఆర్‌.యస్‌.యస్‌. ప్రయత్నిస్తోంది. డా||బి.ఆర్‌ అంబేద్కర్‌తో పాటు జవహర్‌లాల్‌ నెహ్రూ, బాబూ రాజేంద్రప్రసాద్‌, మౌలానా ఆజాద్‌, వల్లభబారు పటేల్‌, అల్లాడి కుప్పుస్వామి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం, ఎన్‌.జి.రంగా, బాబూ జగ్జీవన్‌రామ్‌, కామరాజ్‌ నాడార్‌ వంటి జాతీయ నాయకులు రాజ్యాంగ పరిషత్‌లో సభ్యులుగా ఉన్నారు. అంబేద్కర్‌ రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్‌గా వ్యవహరించారు. అనేక చర్చలు, మదింపుల తరువాత రాజ్యాంగంలో మూలసూత్రాలు రూపొందించబడ్డాయి. అయితే ఆర్‌.యస్‌.యస్‌ రాజ్యాంగేతరంగా ప్రవర్తిస్తూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తోంది. అన్ని మతాలు, సాంప్రదాయ పార్టీలు విజ్ఞానం వైపు నడపవలసి వుంది. ఆర్‌.యస్‌.యస్‌ కూడా ఆధునిక భావాలు సంతరించుకోకుండా దళితుల పట్ల ద్వేషాన్ని మరింత పెంచుకొంటోంది. కోట్లాది దేవుళ్ళను సృష్టించుకొంటూ పోతోంది. స్వాములు, యోగులు వంటి తత్వశాస్త్ర రహితులను, మానవ బలహీనతలను రెచ్చగొట్టే స్వాములను సృష్టిస్తోంది.
ఉత్పత్తిలో భాగస్వాములు కాని, మేధో సంపదలో భాగం కాని వారి సంఖ్య పెరిగే కొద్దీ మన ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోతుంది. నోబెల్‌ అవార్డు గ్రహీత అభిజిత్‌ బెనర్జీ ఈ విషయం నొక్కి చెబుతున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 17 అస్పృశ్యతా నివారణను నిర్దేశించింది. మహాత్మా గాంధీ అస్పృశ్యతా నివారణా కార్యక్రమం తీసుకొన్నారు. అత్యధిక మంది హిందువుల మనస్సుల్లో అస్పృశ్యతా భావం ఇంకా బలంగా ఉంది. ఒకపక్క సర్వేజన: సుఖినో భవంతు చెబుతూ మరోపక్క అస్పృశ్యతను గుండెల్లో పేర్చుకొని వుండటం ఎంత వరకు సామాజిక ధర్మం అవుతుంది? మాట్లాడితే, భారత, రామాయణాలను ఉదహరిస్తున్నారు. ఆ కథలు మొదట చిన్నవిగా ప్రారంభమై బృహత్తరంగా పెరిగిన క్రమం తెలియదా! వాస్తవ ధర్మం నీకు రాజ్యాంగంలో వున్నప్పుడు, పురాణ గాథలను అనుసరించి జీవించడం ఎందుకు? ప్రపంచం మొత్తంగా హిందూ మతం విస్తరిస్తోందని ఆర్‌.యస్‌.యస్‌ వారు చెబుతున్నారు. ప్రపంచంలో హిందూ ధర్మాన్ని ఆచరించడానికి అక్కడ కులం, అస్పృశ్యత, స్త్రీ అణచివేతను వీరు కొత్త బోధనల ద్వారా తెస్తున్నారు! ఇతర దేశాలు తమ భూభాగాన్ని పితృభూమిగా భావిస్తుంటే, భారతదేశం మాతృభూమిగా చేసుకున్నందుకు పొగుడుతున్న మీరు, కులాంతర వివాహాలు చేసుకొన్న వారిని ఎందుకు చంపుతున్నారు? సాటి మనిషిని మనిషిగా చూడలేని మత ధర్మం ఎలా విశ్వజనీనం అవుతుంది? హిందూ ధర్మం భారతీయ ధర్మం ఎలా అవుతుంది? ఆదిమ భారతీయులు సమ ధర్మంతో జీవించారు. వైదిక ధర్మాల వల్ల సమాజం సామాజిక విచ్ఛిన్నానికి గురైంది. అనేక పోరాటాల ఫలితంగా రాజ్యాంగం సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని ప్రకటించ గలిగింది.
రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌షా రాజ్యాంగాన్ని కుళ్లపొడిచేందుకు ప్రయత్నించడం ఆశ్చర్యం. రాజ్యాంగాన్ని అనుసరిస్తే ప్రజల్లో ఉత్పాదక శక్తి, సామర్ధ్యం పెరుగుతుందని అంబేద్కర్‌ చెప్పారు. అంతేగాక ప్రభుత్వ పరిశ్రమలను అభివృద్ధి చేయడం ద్వారా దళిత బహుజనులకు ఉద్యోగ వసతి కల్పించవచ్చన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం నిరంతరం పరిపాలనా సామర్ధ్యాన్ని పెంచుకోవాలన్నారు. అయితే ఇటువంటి చర్యలను ఆర్‌.యస్‌.యస్‌ వ్యతిరేకిస్తుంది. కారణం ప్రభుత్వ రంగ సంస్థలు పెరిగితే యస్‌.సి, యస్‌.టి, బి.సిలకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, తద్వారా పేదరికం పోతుం దని, అలా పేదరికం పోతే కర్మభావం మీద నమ్మకం పోతుందని ఆర్‌.యస్‌.యస్‌ భావిస్తుంది. పేదరిక నిర్మూలనకు కృషి చేయవలసిన ఒక మత సంస్థ పేదరికం పెరగడం ద్వారానే దేవుని మీద భక్తి పెరుగుతుందని భావించడం తిరోగమన చర్య.
ఆర్‌.యస్‌.యస్‌ మానవాభ్యుదయానికి వ్యతిరేకమైన సంస్థ. ఎన్నో సార్లు రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరించి నిషేధానికి గురైన సంఘం. హిందూ మతం ఆవిర్భవించక ముందటి తాత్వికాంశాలు వారికి తెలియదు. సాంఖ్యదర్శనం, న్యాయదర్శనం, వైశేషిక దర్శనం వంటి గ్రంథాలు ముందుకు తెచ్చిన తాత్విక చర్చలో పాల్గొనే సాహసం వారు చేయరు. మతం కోసం మనిషి కాదు. మనిషి కోసం మతం అని అంబేద్కర్‌ ప్రకటించారు. ఈ సందర్భంగానే మనుషులను జంతువులకన్నా హీనంగా చూసేవారు వంచకులు. అటువంటి వ్యక్తులతో కలిసి ఉండకండి. జంతువుల స్పర్శను అనుమతిస్తూ, మానవుల స్పర్శను నిషేధించే మతం, మతం కాదు మూర్ఖత్వం. నిరక్షరాస్యులను నిరక్షరాస్యులుగా, పేదలను పేదలుగా తొక్కి ఉంచే మతం, మతం కాదు అని ఆయన చెప్పారు.
నిజానికి కారల్‌ మార్క్స్‌ మతం మత్తు మందు వంటిదని చెప్పినా, అంబేద్కర్‌ మతోన్మాదం దేశానికి అవరోధమని చెప్పినా శాస్త్ర జ్ఞానాభివృద్ధి పట్ల జిజ్ఞాసను పెంచుకోమనేదే వారి సందేశం. మీ ఇంట్లో సగ భాగంగా వున్న మహిళను అవమానించి, నీకు అన్నాన్ని సృష్టిస్తున్న శ్రామికుణ్ణి అవమానించి దేశాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్ళలేవు. భారతీయులందరిదీ ఒకే ఒక ప్రవచన గ్రంథం. అదే భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగ అవగాహనతో మనం ముందుకు వెళితే ప్రపంచ దేశాలను అధిగమించే ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, తాత్విక, సాంకేతిక వ్యవస్థ మనకు ఏర్పడుతుంది. ఆ దిశగా లౌకికవాద భావజాల ఆచరణ కర్తలంతా ఐక్య శక్తితో ముందుకు నడవాలి. అప్పుడే మతోన్మాద భావజాలానికి ప్రత్యామ్నాయంగా బుద్ధుడు, మహాత్మాఫూలే, అంబేద్కర్‌, పెరియార్‌ రామస్వామి నాయకర్‌ వంటి వారు తీసుకొచ్చిన సామాజిక సాంస్కృతిక విప్లవం విజయవంతం అవుతుంది. ఆ దిశగా నడుద్దాం.

– డా|| కత్తి పద్మారావు ( వ్యాసకర్త నవ్యాంధ్రపార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు,
సెల్‌ : 9849741695 )

RELATED ARTICLES

Latest Updates