రూ.1.70 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

-ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల
-ఉచితంగా 5 కేజీల బియ్యం.. కేజీ పప్పు
– పీఎంకేవై కింద రైతుల ఖాతాల్లోకి రూ. 2 వేలు
– ఆరోగ్య కార్యకర్తలకు బీమా సౌకర్యం

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కలవర పెడుతున్న తరుణంలో..వలస, రోజువారీ కూలీలు, పట్టణ, గ్రామీణ పేదలకు రోజువారీ అవసరాలకను గుణంగా రూ.1.70 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ఎవరూ ఆకలితో బాధపడకూడదన్న ఉద్దేశంతో ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన పథకం కింద ఈ సాయాన్ని ప్రకటించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం తెలిపారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ దేశ జనాభాలో మూడింట రెండొంతుల మందిగా ఉన్న 80 కోట్ల పేద ప్రజలకు 5 కేజీల బియ్యం లేదా గోధుమలను ఉచితంగా అందించనున్నట్టు తెలిపారు. ఇప్పుడు అందిస్తున్న 5 కేజీలకు ఇది అదనం అని చెప్పారు. అదేవిధంగా పతి కుటుంబానికి వచ్చే మూడు నెలల పాటు కేజీ పప్పు ధాన్యాలు అందిస్తామని, వీటిని రెండు దశల్లో అందజేస్తామని తెలిపారు. మూడు నెలల పాటు ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ను ఇస్తామన్నారు.

అదేవిధంగా పీఎం కిసాన్‌ యోజన కింద(పీఎంకేవై) 8.59కోట్ల మంది రైతులు వెంటనే లబ్ధిపొందను న్నట్టు తెలిపారు. ఏడాదికి పొందుతున్న రూ.6 వేలల్లో…వచ్చే ఏడాది ఆర్థిక సంవత్సరంలో పొందనున్న తొలి విడతగా 2 వేల రూపాయలను ఏప్రిల్‌ మొదటి వారంలో ఇవ్వనున్నట్టు తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంఎన్‌ఆర్‌ఇజీఏ) కింద వేతన రేటును పెంచి ఒక్కో కార్మికునికి అదనంగా రూ. 2 వేలను అందించనున్నట్టు తెలిపారు. వృద్ధులు, వితంతవులు, వికలాంగులకు వచ్చే వెయ్యి రూపాయలను.. మూడు నెలల కాలానికి చెందిన మొత్తాన్ని రెండు విడతల్లో అందిస్తామన్నారు. లబ్ధిదారులకే ఇస్తామన్నారు. దీని వల్ల 3 కోట్ల మంది ప్రజలు లబ్దిపొందుతారని వివరించారు. జన్‌ధన్‌ ఖాతా కలిగి ఉన్న 20 కోట్ల మంది మహిళలకు నెలకు రూ.500 చొప్పున..మూడు నెలల పాటు అందిస్తామన్నారు.

ఉజ్వల పథకంలోని మహిళలకు మాత్రమే
అదేవిధంగా ఉజ్వల పథకంలో భాగస్వాములుగా ఉన్న మహిళలకు మాత్రమే ఉచిత గ్యాస్‌ సిలిండర్లను మూడు నెలల పాటు పొందేందుకు అవకాశం కల్పించనున్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. దీంతో 8.3 కోట్ల మంది కుటుంబాలు లబ్ధిపొందుతాయని అంచనా. 63 స్వయం సహాయక సంస్థలకు రూ. 20 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలను అందిస్తున్నారు.

రూ.15 వేల లోపు ఉద్యోగులకే లబ్ధి
రూ. 15 వేల కన్నా తక్కువ ఆదాయాన్ని పొందుతున్న ఉద్యోగులకు ఇఫీఎఫ్‌ ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఉద్యోగి, యజమాని వాటాలను కలిపి ఉద్యోగుల ఇఫీఎఫ్‌ ఖాతాల్లో ప్రభుత్వమే జమ చేస్తుంది. అది కూడా 100 మంది లోపు ఉద్యోగులున్న సంస్థలకే వర్తిస్తుంది. ఆ 100 మంది ఉద్యోగుల్లో 90 శాతం మంది రూ. 15 వేల లోపు జీతం కలిగి ఉండాలి. ఉద్యోగులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా 75 శాతం వరకు పీఎఫ్‌ ఉపసంహరించుకోవచ్చు. 3 నెలల జీతం లేదా 75 శాతం పీఎఫ్‌లో ఏది తక్కువైతే దాన్ని ఉపసంహరించుకునే అవకాశాన్ని ఇచ్చింది.

భవన, నిర్మాణ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ నిధిని ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేవలం నమోదు చేసుకున్న కార్మికులు 3.5 కోట్ల మంది..రూ.31 వేల కోట్లు పొందే అవకాశం ఉంది. శానిటేషన్‌ వర్కర్లు, ఆశా, పారామెడికల్‌, వైద్యులు, నర్సులకు రూ. 50 లక్షల చొప్పున ప్రత్యేక బీమా సదుపాయం కల్పిస్తున్నట్టు సీతారామన్‌ వెల్లడించారు.

– ఏమాత్రం సరిపోదు!
– సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఏచూరి
– ‘సామాజిక దూరం’ లక్ష్యాన్ని ఓడించేలా ఉందని వ్యాఖ్య

న్యూఢిల్లీ : కరోనా నేపథ్యంలో కేంద్రంలోని మోడీ సర్కార్‌ ప్రకటించిన రూ.1.75 లక్షల కోట్లతో కూడిన ప్యాకేజీపై సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పెదవి విరిచారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్రంప్రకటించిన నిధులు ఎంతమాత్రం సరిపోవని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు తిరిగి తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు సంబంధించినటువంటి అంశం కేంద్ర ప్రకటిం చిన ప్యాకేజీలో లేదని ఆయన అన్నారు. ‘ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన అనేక మంది భారతీయులను మనం విమానాల ద్వారా ఇక్కడకు తరలించాం. వారందరికీ ఖచ్చితంగా ఆహారం, ఆశ్రయం కల్పించాలి. ప్రస్తుతం వారు ఉంటున్న ప్రాంతాల్లో ఆశ్రయం కల్పించడమో లేదా వారి సొంత రాష్ట్రాలకు పంపించడమో చేయాలి’ అని పేర్కొన్నారు. సామాజిక దూరం పాటించేలా, జనసమూహాలను నిరోధించేలా విధించిన లాక్‌డౌన్‌ లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వ వైఫల్యం ఓడిస్తుందని ఏచూరి వ్యాఖ్యానించారు. ప్యాకేజీలో కేంద్ర ప్రకటించిన ఆహార ధాన్యాల కేటాయింపు రెట్టింపు, మూడు నెలల పాటు ఉచిత గ్యాస్‌ సిలిండర్‌, కుటుంబానికి ఒక కేజీ పప్పు ధాన్యాలు ఎంత మాత్రం సరిపోవని అన్నారు. కరోనా(కొవిడ్‌-19)ను అడ్డుకోవాలంటే ప్రజలకు తగిన పోషకాహారం ఉండాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వ కేటాయింపులు ఆ దిశగా లేవని ఏచూరి అన్నారు. అదేవిధంగా వికలాంగులు, వితంతువులకు కేంద్రం ప్రకటించిన రూ.వెయ్యి వారికి ఎలా సరిపోతాయని ఆయన ప్రశ్నించారు. ఆరోగ్య కార్యకర్తలకు ప్రకటించిన బీమా సౌకర్యం వలన ప్రభుత్వానికి ఎటువంటి ఖర్చు ఉండదని, అయితే ఇది ప్రయివేటు రంగానికి కూడా వర్తిస్తుందా? అన్న దానిపై స్పష్టత లేదని పేర్కొన్నారు. అసలు వారికి అత్యవసరంగా కావాల్సిన రక్షణ పరికరాలు, మెడిసన్‌, పరీక్షా సదుపాయాలపై ప్రస్తావనే లేదని అన్నారు. ప్రతి రైతుకు రూ.2 వేలు ఇస్తామని కేంద్రం ప్రకటించిందని, అయితే ఇది 2019 ఎన్నికలకు ముందు ప్రకటించిన విధంగా పీఎం కిసాన్‌ యోజన కింద(పీఎంకేవై) కింద ఇవ్వాల్సిన మొదటి విడత అని పేర్కొన్నారు.

రానున్న మూడు నెలల పాటు నెలకు రూ.5 వేల చొప్పున అన్ని జన్‌ధన్‌ ఖాతాలకు, బీపీఎల్‌ కుటుంబాలకు ప్రత్యక్ష నగదు బదిలీ చేయాలని తాము డిమాండ్‌ చేస్తున్నామని, అయితే మహిళలకు చెందిన జన్‌ధన్‌ ఖాతాల్లో రూ.500 వేస్తామని ప్రకటించడం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏమాత్రం అక్కరకు వస్తుందని ఏచూరి కేంద్రాన్ని ప్రశ్నించారు. అదేవిధంగా కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో కార్మికులకు గణనీయమైన ప్రయోజనమేమీ లేదని అన్నారు. పీఎఫ్‌ ఖాతాలోకి సొమ్ము వేస్తామని చెప్పినా దాని వల్ల ఉపయోగం లేదన్నారు.

ప్రభుత్వం ఏం చేయాలి?
కేరళలో మధ్యాహ్నాం భోజన పథకం కింద చిన్నారుల కుటుంబాలకు రేషన్‌ కిట్లు అందిస్తున్నారని, ఈ విధంగా చేయడం ద్వారా పేదల ఆకలిని, పోషకాహార లోపాన్ని నివారించవచ్చని ఏచూరి సూచించారు. పెద్దయెత్తున పరిశ్రమలు కార్యకలాపాలను నిలిపేస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు, కార్మికులకు రానున్న మూడు నెలల పాటు వేతన చెల్లింపు హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయాలని, సాగు సీజన్‌ అయినందున ఉత్పత్తులను కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని, సాగు ప్రాధాన్యతను గుర్తించాలని అన్నారు. మధ్యతరగతి ప్రజలకు ప్రధానంగా రుణాల చెల్లింపుపై మారటోరియం విధించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉపాధి పనులు ఎక్కడా జరగని సమయంలో ఎంఎన్‌ఆర్‌ఇసీఎలో వేతనాలను రూ.20 పెంచుతున్నట్టు ప్రకటించడం ఒక పెద్ద జోక్‌ అని ఆయన అన్నారు. పనితో నిమిత్తం లేకుండా వేతనాల చెల్లింపును ఉపాధి హామీ పథక కార్మికులు కోరుతున్నారని ఏచూరి పేర్కొన్నారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates