త్రుటిలో ఆర్కే మిస్‌!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • ఏవోబీలో తప్పిన భారీ ఎన్‌కౌంటర్‌
  • అడవిలో వర్షం, చివరి బృందంలో ఉండటంతో అగ్రనాయకుడు సేఫ్‌
  • ఏవోబీ కార్యదర్శికి తీవ్ర గాయాలు!
  • చలపతి, అరుణకు తూటాదెబ్బలు
  • ఐదు రోజుల్లో రెండుసార్లు కాల్పులు
  • గాయపడ్డవారికోసం జల్లెడ
  • నెత్తుటిచిత్తడిలా కాల్పుల ప్రాంతం
  • అమరుల ఉత్సవాలపై నక్సల్స్‌భేటీ
  • 3 బృందాలుగా సరిహద్దుల్లో సంచారం

పాడేరు : ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో (ఏవోబీ) త్రుటిలో భారీ ఎన్‌కౌంటర్‌ తప్పింది. మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే ఆ సమయంలో సంఘటనాస్థలిలోనే ఉన్నారని సమాచారం. పోలీసు కాల్పుల్లో మరో అగ్రనేత, ఏవోబీ కార్యదర్శి చలపతి, ఆయన భార్య అరుణ తీవ్రంగా గాయపడ్డారని తెలిసింది. ఘటనాస్థలంలోని పొదలు, ఆకులు, రాళ్లగుట్టలపై కనిపిస్తున్న రక్తపు మరకలను బట్టి పోలీసులు ఈ నిర్ధారణకు వచ్చారు. అగ్రనేతలు చిక్కినట్టే చిక్కి తప్పించుకొన్నారన్న సమాచారం ఏవోబీ సరిహద్దుల్లో ఉద్రిక్తతను రేపింది. సరిహద్దులను అన్నివైపులనుంచి మూసివేసి రెండు రాష్ట్రాల పోలీసులు గాయపడిన టాప్‌ మావోయిస్టుల వేటను ముమ్మరం చేశారు. ఆలస్యంగా అందిన సమాచారం మేరకు… ఆనవాయితీ ప్రకారం ఈనెల 28 నుంచి అమరవీరుల వార్షిక వారోత్సవాలను భారీఎత్తున నిర్వహించడానికి మావోయిస్టులు సిద్ధమయ్యారు. ఈ వారంరోజుల కార్యక్రమాల రూపకల్పన కోసం వారంతా ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా బెజ్జంగి అటవీ ప్రాంతంలో సమావేశమయ్యారని ఈనెల 14న పోలీసు నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు పార్టీ అగ్రనేతలు, స్థానిక కీలక మిలీషియా సభ్యులు పాల్గొంటున్నారని కూడా ఉప్పందింది. తమవైపు మొదలైన ఈ కదలికతో ఒడిశా పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆ మరునాడే కూంబింగ్‌ మొదలుపెట్టి రెండురోజులు గాలింపు జరిపారు. ఈ క్రమంలో ఈ నెల 16 తేదీన ముకుడుపల్లి అటవీ ప్రాంతంలో పోలీసుల కంట మావోయిస్టులు పడ్డారు. పోలీసులను చూడగానే మావోయిస్టులు, ఆ వెంటనే పోలీసులు కూడా కాల్పులను ప్రారంభించారు. కాల్పులు జరుపుతూనే మావోయిస్టు అగ్రనేతలు, మిలీషియా సభ్యులు ఘటనాస్థలం నుంచి తప్పించుకుపోయారు.

తొలి టీమ్‌ను వెళ్లనిచ్చి..
ఒడిశాలో చేజారిన మావోయిస్టులు విశాఖ వైపు చొచ్చుకొచ్చారు. వారంతా ముంచంగిపుట్టు మండలం బుసిపుట్టు అటవీ ప్రాంతం, పెదబయలు మండలం జామిగుడ, గిన్నెలకోట పంచాయతీల మీదుగా ఇంజెరి అటవీ ప్రాంతం దిక్కు వెళుతున్నట్టు విశాఖ పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ క్రమంలో ఈ నెల 18 వ తేదీ నుంచి ప్రత్యేక పోలీసు బలగాలు ఈ ప్రాంతాల్లో మోహరించి, మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నాయి. ఆ మరునాడు, అంటే ఈ నెల 19వ తేదీన ఇంజెరి ప్రాంతంలో మూడు బృందాలుగా ఉన్న 30 మంది మావోయిస్టులను బలగాలు గుర్తించాయి. తొలి బృందం తమకు కొద్ది దూరం నుంచే వెళ్లినా, వ్యూహాత్మకంగా పోలీసులు కాల్పులు జరపలేదు. కొద్ది సేపటి తర్వాత వచ్చిన రెండో బృందంపై గుండ్లవర్షం కురిపించారు. ఈ బృందంలోనే చలపతి, అరుణ ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ఆ బృందం సభ్యులు వెనువెంటనే రెండుగా చీలి కాల్పులు జరుపుతూ మరోసారి తప్పించుకుపోయారు. సంఘటనా స్థలంలో పోలీసులకు పలుచోట్ల రక్తపు మరకలు, తుపాకీ, ఇతర సామగ్రి కనిపించాయి. ఆ తరువాత మూడు రోజుల్లోనే పోలీసులు కొంత సమాచారాన్ని సేకరించగలిగారు. రెండో బృందానికి నాయకత్వం వహించిన చలపతి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారని, ఆయన భార్య అరుణకు సైతం తూటాలు తగిలాయని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు.

చివరి టీమ్‌లో ఆర్కే..
మూడో బృందంలో ఆర్కే ఉన్నారు. తమ ముందు వెళుతున్న బృందంపై పోలీసులు కాల్పులు జరపడాన్ని గమనించి ఆయన అటునుంచి అటే తప్పించుకున్నారని నిఘావర్గాలు భావిస్తున్నాయి. దానికితోడు కాల్పులు జరిగిన సమయంలో ఏవోబీలో భారీ వర్షం కురుస్తుండడం కూడా అగ్రనేతకు కలిసి వచ్చింది. లేకపోతే భారీ ఎన్‌కౌంటర్‌ జరిగేదని పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ఎదురు కాల్పుల్లో గాయపడిన చలపతి, అరుణ ఎక్కువదూరం వెళ్లి ఉండరనే అంచనాతో.. ఇంజెరి ప్రాంతంలో ఇటు ఏపీ, అటు ఒడిశా పోలీసు బలగాలు గత నాలుగు రోజులుగా గాలింపును కొనసాగిస్తున్నాయి. గాయపడిన మావోయిస్టులు లొంగిపోతే మెరుగైన వైద్యం అందిం చి వారి ప్రాణాలు కాపాడతామని పోలీసు అధికారులు ప్రకటించారు. కాగా తప్పించుకున్న మావోయిస్టుల కోసం ఇరు రాష్ట్రాల ప్రత్యేక పోలీసు బలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేయడంతో ఏవోబీలో ఎప్పుడు., ఏం  జరుగుతుందోనన్న ఉద్రిక్తత నెలకొంది.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates