రైల్వేలో కొలువులకు ఎర్రజెండా

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • భద్రతకు సంబంధించిన ఉద్యోగాలకు మినహాయింపు
  • రైల్వే బోర్డు కీలక నిర్ణయం

హైదరాబాద్‌: ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అంశంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భద్రత(సేఫ్టీ)కు సంబంధించినవి మినహా కొత్త పోస్టుల మంజూరు, భర్తీ ప్రక్రియకు బ్రేక్‌ వేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు కొత్త నోటిఫికేషన్లు చేపట్టవద్దంటూ రైల్వేబోర్డు స్పష్టం చేసింది. బోర్డు జాయింట్‌ డైరెక్టర్‌ అజయ్‌జా అన్ని జోన్ల జనరల్‌ మేనేజర్లు, ప్రొడక్షన్‌ యూనిట్లకు ఈ మేరకు గురువారం రాత్రి కీలక ఆదేశాలు జారీచేశారు. అయితే ఈ ఆదేశాలపై గందరగోళం నెలకొనడంతో శుక్రవారం రైల్వేబోర్డు డైరెక్టర్‌ జనరల్‌(హెచ్‌ఆర్‌) ఆనంద్‌ ఎస్‌ ఖాతి స్పందించారు. ఉన్న ఉద్యోగులనెవ్వరినీ తొలగించబోమని భరోసా ఇచ్చారు. స్వరూపం మాత్రం మారే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న నియామక ప్రక్రియలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. భద్రతా విభాగంలో కూడా నియామక ప్రక్రియకు ఆటంకం ఉండబోదన్నారు. 2018 నుంచి రైల్వే భద్రతా విభాగంలో 72,274, మిగిలిన వాటిల్లో 68,366 మొత్తంగా 1,40,640 ఖాళీలున్నాయన్నారు. మిగిలిన విభాగాల్లో కూడా.. మధ్యలో ఉన్న నియామక ప్రక్రియలు కొనసాగుతాయని.. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు కొత్తగా ఉద్యోగ ప్రకటనలుండవని ఆయన చెప్పారు. ప్రస్తుత కొవిడ్‌ నేపథ్యంలో రైల్వే ఆదాయం 58శాతం మేర తగ్గిందని, కొన్ని కఠిన చర్యలు తప్పవన్నారు. వ్యయ నియంత్రణకు.. ఆదాయాల పెంపునకు కొత్త మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందన్నారు.

పెరుగుతున్న అవసరాలు, కొత్తగా పట్టాలెక్కే రైళ్లు, కొత్త రైల్వేలైన్లు, ఇతర ప్రాజెక్టులకు అదనంగా ఉద్యోగులు కావాల్సి ఉంటుంది. అవసరాలను బట్టి అనుమతి పొందిన పోస్టులకు అదనంగా కొత్త ఉద్యోగాలను మంజూరుచేస్తుంటారు. ఇలా రెండేళ్లక్రితం దేశవ్యాప్తంగా పలు కొత్త రైల్వేలైన్లు, నూతన రైళ్ల కోసం పోస్టులను మంజూరు చేశారు. అలాంటి వాటిల్లో భద్రత అంశానికి సంబంధించినవి మినహా.. మిగిలినవాటిలో ఏదైనా కారణంతో భర్తీ ప్రక్రియ ప్రారంభించకపోతే అందులో 50 శాతం పోస్టులను సరెండర్‌ చేయాలని రైల్వేబోర్డు స్పష్టం చేసింది. కొత్త పోస్టుల సృష్టిని నిలిపివేయడం, వర్క్‌షాపుల్లోని మానవశక్తిని హేతుబద్ధీకరించడం, ఖర్చు తగ్గించడం, డిజిటల్‌ ప్లాట్‌ఫాంను ఎక్కువగా ఉపయోగించుకోవడం లాంటి చర్యలు తీసుకోవాలని రైల్వేలోని ఆర్థిక విభాగం అన్ని జోన్లకు సూచించింది.

నిరుద్యోగులకు అశనిపాతమే
దక్షిణమధ్య రైల్వేలో 80,525 మంది కొలువులు చేస్తున్నారు. ఇక్కడ మొత్తం 95,666 మంది ఉండాలి. దాదాపు ఈ 15వేల కొలువులపై ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులకు బోర్డు నిర్ణయం అశనిపాతమే.

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates