ప్రయివేటీకరణ దిశగా ప్రభుత్వవైద్యం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– కేంద్రం ప్రతిపాదనను వ్యతిరేకించిన కేరళ
– మీనమేషాలు లెక్కిస్తున్న టీఆర్‌ఎస్‌ సర్కార్‌

సమస్యలను పరిష్కరించకపోగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు వాటిని మరింత సంక్లిష్టంగా మార్చేలా ఉంటున్నాయి. బ్యాంకింగ్‌, రైల్వే తదితర రంగాల్లో ప్రభుత్వరంగాన్ని తగ్గిస్తూ కార్పొరేట్‌, ప్రయివేట్‌కు అప్పగిస్తున్న కేంద్రం ప్రభుత్వవైద్యంలో ప్రయివేటు భాగస్వామ్యాన్ని కల్పించే విషయాన్ని పరిశీలిస్తున్నది. కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేసి ఆ కాలేజీకి జిల్లా ఆస్పత్రిని అనుసంధానించాలని భావిస్తున్నట్టు తెలియజేయాలి. అయితే వీటి నిర్వహణ ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ఉంటుందని స్పష్టం చేసింది.

ఇప్పటికే వైద్యచికిత్సలు, వైద్యవిద్యలో 60 నుంచి 70 శాతం ప్రయివేటు, కార్పొరేట్ల పరిధిలోకి వెళ్తే, 30 నుంచి 40 శాతం మేరకు మాత్రమే ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. అయితే ప్రభుత్వ వైద్యం, వైద్యవిద్యపై ఆధారపడే పేద, మధ్యతరగతి ప్రజలు మాత్రం 70 నుంచి 80 శాతం వరకుండగా వారికి మెరుగైన సేవలందించలేకపోతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు బెడ్లు, డాక్టర్లు, నర్సులు, ఇతర సౌకర్యాలు లేకపోవడంతో వైద్యం కోసం పేదరోగులు నిరంతరం వేచిచూసే పరిస్థితి నెలకొన్నది. అత్యవసర పరిస్థితుల్లో ప్రయివేటును ఆశ్రయించక తప్పనిసరి. అలాంటి సందర్భాల్లో పేదలు ఎలా అప్పులపాలవుతున్నారనే విషయాలను నేషనల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్‌)తో పాటు జాతీయంగా, అంతర్జాతీయంగా పలు సంస్థలు నిర్వహించిన సర్వేలు, అధ్యయనాల్లో బయటపడిన విషయం విదితమే. సామాన్యులకు నిత్యానుభవమే. దీనికి తోడు తాజా నిర్ణయంతో ఉన్న కొద్ది ప్రభుత్వ అధీనంలోని సేవల్లో కూడా ప్రయివేటుకు భాగస్వామ్యం కల్పించడమంటే పేదలకు వైద్యాన్ని మరింత దూరం చేయడమే అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

దీనిపై కేంద్రం రాష్ట్రాల నుంచి అభిప్రాయాలను కోరనున్నట్టు సమాచారం. అయితే ఇప్పటికే ప్రయివేటీకరణను అనుమతించి సామాన్యుల వైద్యాన్ని భారంగా మార్చే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని వామపక్ష ప్రభుత్వ పాలనలో ఉన్న కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కె.కె.శైలజ నిర్ద్వందంగా వ్యతిరేకించింది. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ మాత్రం ఈ విషయంలో ఎలాంటి కామెంట్లు చేయకుండా మిన్నకుండిపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి ప్రజావ్యతిరేక విధానాలను ఆదిలోనే వ్యతిరేకించాల్సిన, అడ్డుకోవాల్సిన అవసరముందని ప్రజాసంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న గ్రామీణులకు సగటున రూ.14,935 ఖర్చవుతుండగా, పట్టణ ప్రాంతాలకు చెందిన వ్యక్తి రూ.24,436 ఖర్చు చేస్తున్నట్టు 71వ ఆరోగ్య సర్వే తేల్చింది. గత ఐదేండ్లలో ఇది మరింత పెరిగినట్టుగా గుర్తించారు. చికిత్సపొందే సమయంలో కుటుంబంలో సంపాదించే వ్యక్తులకు ఆదాయం కూడా తగ్గడం మరోవైపు ఖర్చులు పెరగడం భారంగా మారుతున్నది. ఈ పరిస్థితుల్లో ప్రజావైద్యాన్ని మరింత విస్తృతం చేయాల్సిన చేయాల్సిందిపోయి, ప్రయివేటీకరణ ఆలోచన చేయడం సరికాదనే అభిప్రాయాలు వస్తున్నాయి.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates