పని అక్రమం.. పద్ధతీ అక్రమమే

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
– ఎన్‌. వేణుగోపాల్‌

తెలంగాణ ఏర్పడిన తర్వాత కొన్ని ప్రయివేటు విద్యా సంస్థల అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేస్తామనీ, అసలు ఆ సంస్థల ఉనికి లేకుండా చేస్తామనీ ఉద్యమనాయకులు మాట్లాడేవారు. కాని ఇప్పుడు ఆ పాత విద్యా మాఫియా చెక్కుచెదరకుండా ఉంది, బహుశా ఇంకా బలపడింది. మరొక పక్క కొత్త విద్య మాఫియాలు, యూనివర్సిటీల స్థాయిలోనే దిగుమతి కాబోతున్నాయి.

‘ప్రయివేటు యూనివర్సిటీలు అవినీతికి రాచమార్గం’ అని ఇదే శీర్షికలో నాలుగు సంవత్సరాల కింద (2016 డిసెంబర్‌ 20) ఒక వ్యాసం రాశాను. తెలంగాణ రాష్ట్ర సమితి మొదటి విడత పాలనా కాలంలో ప్రయివేటు యూనివర్సిటీలకు మార్గం సుగమం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్న సందర్భం అది. అప్పటికి ఏడాది కింద ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘ది ఆంధ్రప్రదేశ్‌ ప్రయివేట్‌ యూనివర్సిటీస్‌ (ఎస్టాబ్లిష్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌) చట్టం’ తీసుకువచ్చింది గనుక అదే దారిలో తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ ప్రయత్నాలకు విద్యార్థుల నుంచీ, అధ్యాపకుల నుంచీ, విద్యావేత్తల నుంచీ ఎన్ని అభ్యంతరాలు వచ్చినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని అమలు చేయడంలో ముందుకే సాగింది. చివరికి 2018 మార్చి 30న ‘ది తెలంగాణ స్టేట్‌ ప్రయివేట్‌ యూనివర్సిటీస్‌ (ఎస్టాబ్లిష్‌ మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌) చట్టం’ తయారు చేసింది. ఇంతలో ఎన్నికలు వచ్చి ఆ చట్టం అమలు వాయిదా పడింది. ఎన్నికల్లో మళ్లీ గెలుపు సాధించి రెండోవిడత పాలన ప్రారంభించాక, 2019 జూలై 15 నుంచి ఈ చట్టాన్ని అమలులోకి తెస్తున్నట్టు ప్రభుత్వ ఉత్తర్వు వెలువడింది. ఆగస్ట్‌ 20న ఈ చట్టాన్ని అమలు చేసే నిబంధనలతో మరొక ప్రభుత్వ ఉత్తర్వు జారీ అయింది.

ఆ నిబంధనలు అస్పష్టంగా, ఎటు పడితే అటు నిర్వచించడానికి వీలుగా, జాతీయ విద్యా విధానం 2019 నిబంధనలను అతిక్రమించేవిగా ఉన్నాయని, ఉన్న ప్రయివేటు యూనివర్సిటీలే నిబంధనలను ఉల్లంఘిస్తుండగా ఏ చర్యా లేనప్పుడు కొత్త యూనివర్సిటీలను ఆహ్వానించడం ఎంత సమంజసమనీ విమర్శలు కూడా వచ్చాయి. అన్ని విమర్శల లాగే ఆ విమర్శలను కూడా లెక్కచేయని ప్రభుత్వం ఆ నిబంధనల ప్రకారమే ప్రయివేటు యూనివర్సిటీలు ఏర్పాటు చేయడానికి విద్యా సంస్థల నుంచి, పెట్టుబడిదారుల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది. మొత్తం మీద 13 ప్రతిపాదనలు రాగా, వాటిలో తొమ్మిది ప్రతిపాదనలు తగిన అర్హతలతో ఉన్నాయని ఫిబ్రవరి 2020లో ప్రభుత్వ ఉన్నతాధికార కమిటీ భావించింది.

ఆ తర్వాత కరొనా వైరస్‌, లాక్‌డౌన్‌ వల్ల దేశం, రాష్ట్రం, పాలన స్తంభించి ఉన్న స్థితిలో హఠాత్తుగా మే 21న ఒక ఆర్డినెన్స్‌ ద్వారా ఐదు యూనివర్సిటీలు ఈ విద్యా సంవత్సరం నుంచే పని చేయడానికి అనుమతిస్తూ ప్రభుత్వ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ కొత్త ప్రయివేటు యూనివర్సిటీలు హైదరాబాద్‌ శివార్లలో మహీంద్రా యూనివర్సిటీ, వోక్సెన్‌ యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీ, అనురాగ్‌ యూనివర్సిటీ, వరంగల్‌ శివార్లలో ఎస్‌ ఆర్‌ యూనివర్సిటీ.

ఈ ప్రయివేటు యూనివర్సిటీల అనుమతి అనేక అక్రమాలతో నిండి ఉంది. అసలు ప్రయివేటు యూనివర్సిటీ లను అనుమతించడమే ఒక అక్రమం కాగా, ఈ ఐదు యూనివర్సిటీలను అనుమతించిన పద్ధతి కూడా అక్రమాలమయంగా ఉన్నది. తన సొంత యూనివర్సిటీలకు అవసరమైన నిధులు కేటాయించక, సౌకర్యాలు కల్పించక, అధ్యాపకుల నియామకాలు చేయక, నిధుల లేమితో, నిర్లక్ష్యంతో వాటిని చంపుతున్న ప్రభుత్వం, ప్రయివేటు యూనివర్సిటీల కోసం మాత్రం ఇంత హడావిడి చర్యలు తీసుకోవడం అక్రమం. ఊరంతా కొవిడ్‌ మహావిపత్తు భయభీతావహంలో ఉండగా విద్యావ్యాపారుల ప్రయోజనాలు కాపాడడానికి చీకటిమాటున ఆర్డినెన్స్‌ తీసుకురావడం అక్రమం. ఈ యూనివర్సిటీలు అని పేరు పెట్టుకున్నవి ఎక్కువలో ఎక్కువ ఇంజనీరింగ్‌, బిజినెస్‌ మేనేజిమెంట్‌ వంటి విడి విద్యారంగాలకు సంబంధించినవి మాత్రమే గాని సకల విద్యా నిలయాలుగా ఉండవలసిన యూనివర్సిటీలు కాకపోవడం అక్రమం.

ఇంత హడావిడిగా అక్రమంగా అనుమతులు పొందిన ఐదుగురిలో ముగ్గురు నేరుగా ప్రభుత్వంలో ఉన్నవారు, ప్రభుత్వానికి దగ్గరివారు కావడం మరొక అక్రమం. ఒక ఉమ్మడి, సామాజిక నిర్ణయాధికారంలో ఉన్నవారు, తమకు సొంత లాభం చేకూర్చే పనికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం అధికార దుర్వినియోగమే అవుతుందని అందరూ అంగీకరించే సాధారణ, సహజ నైతిక సూత్రం. ఇప్పుడు ప్రభుత్వ చీకటి ఉత్తర్వుల వల్ల లాభపడేవారిలో ఒకరు ప్రస్తుతం అధికారంలో ఉన్న మంత్రి, మరొకరు అధికారపార్టీ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వపు అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అధిపతి, మరొకరు అధికారపార్టీ నాయకులు, గతంలో శాసనసభ్యులుగా పోటీ చేసినవారు. తమకు లాభం చేకూరాలని తామే నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వాధినేతలు గతంలో ఉన్నారు, భవిష్యత్తులోనూ ఉంటారు గాని, ఇంత నిర్లజ్జగా, సమయం కాని సమయంలో ఇటువంటి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుంది.

ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రయివేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటు, ఉన్నత విద్య ప్రయివేటీకరణ అవసరమా, ప్రజా ప్రయోజనకరమా, ఇతర రాష్ట్రాలలో యూనివర్సిటీల ప్రయివేటీకరణ పర్యవసానాలు ఏమిటి, ఆరు దశాబ్దాల విద్యా వివక్షకు గురైన తెలంగాణ ప్రజా ప్రయోజనాలకు ఇది అనుకూలమా కాదా అనే అంశాలపై చర్చ జరగడం అవసరం. ఉన్నత విద్యలో, ప్రత్యేకించి విశ్వవిద్యాలయాల ఏర్పాటులో ప్రయివేటీకరణ విధానాన్ని ప్రవేశపెట్ట దలచినప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి 2014 ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసినట్టు, ”విద్యావంతులు, మేధావులు, వైస్‌ ఛాన్సలర్లు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు, టీచర్లతో సెమినార్లు, చర్చలు నిర్వహించి విద్యావిధానం రూపొందించడం జరుగుతుంది” అనే మాట కూడా ప్రభుత్వానికి గుర్తులేదు. అసలు 2018 ఎన్నికల ప్రణాళికకు వచ్చేసరికి ఉన్నత విద్యా రంగం గురించి మాట మాత్రం కూడా లేదు.

విద్యారంగం సామాజిక శ్రేయోరంగం. అక్కడ భావితరాలనూ వారి నైపుణ్యాలనూ రూపొందించడమే తప్ప లాభనష్టాల లెక్క, రిటర్న్‌ ఆన్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ ఆలోచన ఉండగూడదు. కాని ప్రయివేటు పెట్టుబడిదారులు ఎక్కడైనా ఎప్పుడైనా ఏపని అయినా లాభాపేక్షతో మాత్రమే చేస్తారు గనుక, విద్యా లక్ష్యాలను నాశనం చేయకుండా వారి విద్యావ్యాపారం సాగదు. అందువల్లనే విద్యారంగం తప్పనిసరిగా ప్రజారంగంలో, ప్రభుత్వ రంగంలో ఉండాలని, ప్రయివేటు వ్యాపారీకరణను అనుమతించగూడదనీ ఒక ఉదాత్తమైన అవగాహన జాతీయోద్యమ కాలం నుంచీ ఉంది. కానీ 1947 తర్వాత పాలకులు ఆ అవగాహనను ధ్వంసం చేస్తూ వచ్చారు. నిధుల కొరతతో, అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యంతో ప్రభుత్వ విద్యారంగాన్ని బలహీనం చేశారు. అలా నిధులు కేటాయించక, సౌకర్యాలు కల్పించక, అధ్యాపకులను నియమించక ప్రభుత్వ విద్యారంగాన్ని నాశనం చేసిన పాలకులే, ప్రజల అవసరాలను తీర్చగలిగే స్థితిలో ప్రభుత్వ విద్యారంగం లేదు గనుక ప్రయివేటు విద్యా రంగమే గత్యంతరమని చెపుతూ వచ్చారు. దేశ భవిష్యత్తునూ భవిష్యత్తు తరాలనూ ప్రయివేటు లాభాపేక్షకు బలిపెట్టారు. దేశంలో ప్రయివేటు యూనివర్సిటీలు తామరతంపరగా పుట్టుకురావడం మొదలయింది. ఇవాళ 29 రాష్ట్రాలలో 22 రాష్ట్రాలు ప్రయివేటు యూనివర్సిటీలను అనుమతిస్తున్నాయి. ప్రయివేటు యూనివర్సిటీల వ్యాపారుల నిధుల కోసం, ఆ నిధుల్లో ముడుపుల కోసం తమ రాష్ట్ర వనరులను అప్పనంగా అప్పగించే వెంపర్లాటలో అన్ని రాష్ట్రాలూ పోటీపడుతున్నాయి.

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన కొత్తలో 2002లో చత్తీస్‌ఘడ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రయివేటు విశ్వవిద్యాలయాల చట్టం తీసుకు వచ్చి, ఒక్క ఏడాదిలో 112 ప్రయివేటు విశ్వవిద్యాలయాలకు అనుమతినిచ్చింది. వాటిలో అత్యధికం నిజమైన విశ్వవిద్యాలయాలు కావు. ఒక్క గదిలో, ఒక్క టేబుల్‌తో దొంగ సర్టిఫికెట్లు అమ్ముకునే దుకాణాలు అని త్వరలోనే బైటపడింది. ప్రఖ్యాత శాస్త్రవేత్త, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) మాజీ అధ్యక్షుడు ప్రొ. యశ్‌పాల్‌ 2004లో ఈ విషయంలో చత్తీస్‌ఘడ్‌ ప్రభుత్వం మీద సుప్రీం కోర్టులో కేసు వేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌సి లాహౌటి, జస్టిస్‌ జిపి మాథుర్‌, జస్టిస్‌ పికె బాలసుబ్రమణ్యం 2005 ఫిబ్రవరి 11న చత్తీస్‌ఘడ్‌ రాష్ట్ర ప్రయివేటు విశ్వవిద్యాలయాల చట్టాన్ని కొట్టివేస్తూ చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారు.

అటువంటి సర్టిఫికెట్లు అమ్ముకునే కేంద్రాలు కాకపోయినా, ఆస్తులు, భవనాలు ఉన్న సుస్థిర సంస్థలే అయినా ప్రయివేటు విశ్వవిద్యాలయాలు కుంభకోణాల పుట్టలే. 2012 నాటికి దేశంలోని 145 ప్రయివేటు విశ్వవిద్యాలయాలలో యాబైమూడిటిని పరిశీలించిన యూజీసీ వాటిలో కేవలం ఐదు మాత్రమే విశ్వవిద్యాలయాలుగా చెప్పదగిన అర్హతలతో ఉన్నాయని, మిగిలినవన్నీ బోగస్‌ సంస్థలని గుర్తించిందని రాజ్యసభలో ఒక ప్రశ్నకు జవాబుగా అప్పటి మానవవనరుల శాఖ మంత్రి చెప్పారు. చివరికి 2016 జనవరిలో ఒక విశ్వవిద్యాలయ స్నాతకోత్తర సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కూడా దేశంలో విద్యా నాణ్యత దారుణంగా దిగజారడానికి ప్రయివేటు విశ్వవిద్యాలయాలే కారణమని అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రయివేటు విశ్వవిద్యాలయాలు పెద్దగా ప్రవేశించలేదు గాని పాఠశాల విద్యలో, మధ్యంతర విద్యలో, ఉన్నత విద్యలో విద్యావ్యాపారం పెద్ద ఎత్తున సాగి, విద్యావ్యాపారస్తుల మాఫియాలు ఏర్పడ్డాయి. తెలంగాణ ఉద్యమ క్రమంలో ఆ ప్రయివేటు విద్యా మాఫియా మీద తీవ్రమైన విమర్శలూ నిరసనలూ వెలువడ్డాయి.

ఒకవైపు విద్యాలక్ష్యాలు, నాణ్యత, చట్టబద్ధత, సామాజిక శ్రేయస్సు వంటి అనేక అంశాలలో అనుమానాస్పద మైన ప్రయివేటు యూనివర్సిటీలకు ఇలా ఎర్రతివాచీ పరుస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెరుగుపరచవలసిన తన సొంత యూనివర్సిటీల పట్ల ఎటువంటి వివక్ష, నిర్లక్ష్యం వహిస్తున్నదో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. నియామకాలు లేవు, నిధులు లేవు, సౌకర్యాల మెరుగుదల లేదు.

మొదటి పాలనా కాలం చివరినాటికి రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలు కూడా సగం, మూడో వంతు సిబ్బందితో పనిచేస్తున్నాయి. బోధనా సిబ్బంది (ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు వగైరా) ఉస్మానియాలో 1268 ఉండవలసి ఉండగా 768 ఖాళీలున్నాయి. కాకతీయలో మొత్తం 390 స్థానాలకు 250, తెలంగాణ యూనివర్సిటీలో 150 స్థానాలకు 75, మహాత్మాగాంధీ యూనివర్సిటీలో 150 స్థానాలకు 124, శాతవాహనలో 120 స్థానాలకు 100, పాలమూరు యూనివర్సిటీలో 150 స్థానాలకు 130, ఓపెన్‌ యూనివర్సిటీలో 84 స్థానాలకు 49, తెలుగు యూనివర్సిటీలో 60 స్థానాలకు 37 ఖాళీలున్నాయి. ఈ విశ్వవిద్యాలయాల్లో నిజమైన భారీ నియామకాలు జరిగి పద్నాలుగేండ్లు, ఆపైన అయింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 3,147మంది లెక్చరర్లు ఉండవలసి ఉండగా, కేవలం 1,386మంది మాత్రమే ఉన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 5,278మంది జూనియర్‌ లెక్చరర్లు అవసరం ఉండగా, 836మంది మాత్రమే ఉన్నారు. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు పార్ట్‌ టైమ్‌, కాంట్రాక్ట్‌, గెస్ట్‌ లెక్చరర్లతో ఈ విద్యాసంస్థలు నడుస్తున్నాయి. ఈ లెక్కలన్నీ 2018 ఎన్నికలకు ముందరి, ఈ ప్రభుత్వ మొదటి పాలనా కాలానికి సంబంధించినవి. మళ్లీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ఈ పరిస్థితి మెరుగుపడలేదు సరిగదా, ఈ మధ్య కాలపు పదవీ విరమణల వల్ల ఇంకా దిగజారి ఉంటుంది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత కొన్ని ప్రయివేటు విద్యా సంస్థల అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేస్తామనీ, అసలు ఆ సంస్థల ఉనికి లేకుండా చేస్తామనీ ఉద్యమనాయకులు మాట్లాడేవారు. కాని ఇప్పుడు ఆ పాత విద్యా మాఫియా చెక్కుచెదరకుండా ఉంది, బహుశా ఇంకా బలపడింది. మరొక పక్క కొత్త విద్య మాఫియాలు, యూనివర్సిటీల స్థాయిలోనే దిగుమతి కాబోతున్నాయి.

పోలీసు శాఖకూ, ప్రయివేటు విద్యా వ్యాపారుల రియింబర్స్‌మెంట్‌కూ, శాసనసభ్యుల జీతభత్యాల పెంపుకూ, ఇబ్బడిముబ్బడిగా భద్రతా సిబ్బందిని పెంచుకోవడానికీ, ఆధ్యాత్మిక కార్యక్రమాలకూ, నీటిని సెంటిమెంటుగామార్చి అవసరమైనదానికన్న రెట్టింపు, మూడురెట్లు ఖర్చు పెట్టడానికి, మరెన్నో అనవసర ఖర్చులకూ చేతికి ఎముకలేనట్టు భారీగా నిధులు వెచ్చించగల ప్రభుత్వం, నిధులులేవని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను మాత్రం చంపేస్తున్నది. అవి చనిపోతున్నాయి గనుక ప్రయివేటు విశ్వవిద్యాలయాలు కావాలంటున్నది. అవి కూడా ఆశ్రితుల చేతుల్లో పెడుతున్నది.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates