ప్రజల సొమ్ము ప్రయివేటుకా!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కంపెనీలకు ప్రభుత్వ సాయం ఎందుకు..
ప్రజల సొమ్ముతో సాయాన్ని ఆశించొద్దు.
ఈ ఆలోచన నైతిక విపత్తుతో సమానం
– 30 ఏండ్ల నుంచి ఆదుకున్నా నిలబడలేరా..
ప్రధాన ఆర్థిక సలహాదారు కీలక వ్యాఖ్యలు|
అమాంతం కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు 

దేశ ఆర్థిక పరిస్థితి అంతకంతకు పడిపోతున్న వేళ మోడీ సర్కారులోని అధికారుల్లో నైరాశ్యం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో అధికారులు కీలక వ్యాఖ్యలు చేస్తూ.. సర్కారు ఆలోచన తీరును తప్పుబడుతున్నారు. ఆర్థిక వ్యవస్థ బాగోలేదని.. అయినా ప్రజల సెంటిమెంట్‌ దెబ్బ తినకుండా ‘మేకప్‌’ చర్యలు తీసుకుంటున్నట్టుగా స్వయంగా భారతీయ రిజర్వు బ్యాంక్‌ అధినేత శక్తికంతా దాస్‌ ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా గురువారం దేశ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రహ్మణియన్‌ కూడా కీలక దిగారు. ప్రయివేటు రంగంలోని సంస్థలను, కంపెనీలను నిలబెట్టేందుకు గాను సర్కారు ఉద్దీపన రూపంలో ప్రజా ధనాన్ని ఎందుకు వినియోగించాలని ఆయన ప్రశ్నించారు. ప్రయివేట సంస్థలు లాభాలు వస్తే జేబులో వేసుకోవడం.. నష్టాలు వస్తే ప్రజల సొమ్ముతో తమను ఆదుకొమ్మని ప్రభుత్వాన్ని వేడుకోవడం పరిపాటైందని అన్నారు. ఆర్థిక వ్యవస్థలో మందగమనాన్ని పారదోలేందుకు సర్కారు ఉద్దీపన ప్రకటించనుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో సీఈఏ ఈ కీలక వ్యాఖ్యలు చేయడం విశేషం.

కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు.. 
ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించి తమను ఆదుకుంటుందన్న భావనలో ఉన్న కంపెనీల ఆశలపై నీళ్లుచల్లేలా సీఈఏ చేసిన కీలక వ్యాఖ్యలు దేశీయ స్టాక్‌ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని కనబరిచాయి. అంతర్జాతీయ ప్రతికూలతలు, రూపాయి గరిష్ట పతనం నేపథ్యంలో నష్టాలలో తచ్చాడుతున్న మార్కెట్లపై సీఈఏ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రభావాన్ని చూపాయి. సీఈఏ వ్యాఖ్యలు ప్రభుత్వ వైఖరిని వెల్లడిస్తున్నాయంటూ వచ్చిన వార్తా కథనాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఉద్దీపన లేకుంటే రానున్న రోజుల్లో ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారనుందన్న విశ్లేషణలతో మదుపరులు భారీ స్థాయిలో స్టాక్‌ల విక్రయాలకు దిగారు. దీంతో గురువారం నాటి ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 587 పాయింట్లు నష్టపోయి 36,472.93 వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 177 పాయింట్ల నష్టంతో 11వేల మైలురాయిని దిగిపోయి 10,908 వద్ద స్థిరపడింది. ఇది దాదాపు ఆరు నెలల కనిష్టం కావడం గమనార్హం. బ్యాంకింగ్‌, ఎనర్జీ షేర్ల అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. గురువారం దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం మందకొడిగా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 127 పాయింట్ల నష్టంతో 36,899 పాయింట్ల వద్ద, 44 పాయింట్ల నష్టంతో 10,905 వద్ద ట్రేడింగ్‌ను షురూ చేశాయి. సెబీ పలు నిబంధనల్లో మార్పులు తీసుకురావడంతో మార్కెట్‌ జాగ్రత్త పడింది. దీనికి తోడు సీఈఏ వ్యాఖ్యలతో మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఒకనొక దశలో సెన్సెక్స్‌ 36,391 పాయింట్ల వద్ద కనిష్టానికి పడిపోయింది. ఆ తర్వాత కాస్త కోలుకుని 36,472 పాయింట్ల వద్ద ముగిసింది. గురువారం నాటి ట్రేడింగ్‌లో బ్రిటానియా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, హెచ్‌యూఎల్‌ తదితర షేర్లు లాభపడగా, యస్‌ బ్యాంక్‌, వేదాంత, ఇండియాబుల్స్‌ హెచ్‌ఎస్‌జీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

రికార్డు కనిష్టానికి రూపాయి.. 
అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్లో రూపాయి బలహీనత కొనసాగుతోంది. గురువారం ట్రేడింగ్‌లో రూపాయి రికార్డు కనిష్టానికి చేరుకుంది. డాలరు మారకంతో ఆరంభంలోనే 17 పైసలు నష్టపోయిన రూపాయి మిడ్‌ సెషన్‌ తరువాత ఈ ఏడాదిలో అత్యంత కనిష్టాన్ని నమోదు చేసింది. ఆరంభంలోనే దాదాపు 37 పైసలు నష్టపోయిన రూపాయి 71.92 స్థాయికి చేరింది. ఆ తరువాత 71.97 వద్ద కొనసాగుతూ రూపాయి 72 స్థాయి దిశగా కదిలింది. చివరకు కొంత కొలుకొని 71.81 వద్ద ముగిసింది. ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలరు బల పడడం, చములు ధరల క్షీణత, దేశీయ ఈక్విటీ మార్కెట్ల పతనం రూపాయ రికార్డు పతనానికి కారణమని ట్రేడరు చెబుతున్నారు.

ఆర్థికానికి అంత సీను లేదు.. 
దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరుపై విద్యుత్తు శాఖ కార్యదర్శి సీనియర్‌ బ్యూరోక్రాట్‌ సుభాష్‌ చంద్ర గర్గ్‌ పెదవి విరిచారు. ఇటీవలి వరకు కీలక ఆర్థిక శాఖ బాధ్యతలను పర్య వేక్షించిన ఆయన ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక సదస్సులో మాట్లాడుతూ తొలి త్రామాసికంలో ఆర్థిక వ్యవస్థ పనితీరు ఆశించిన స్థాయిలో ఉండక పోవచ్చని వ్యాఖ్యానించారు. ఏప్రిల్‌-జూన్‌ మధ్య కాలంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి 5.5 శాతం నుంచి 5.6 శాతానికే పరిమితం కావొచ్చని తేల్చి చెప్పారు. అంతకు ముందు ఆర్థిక శాఖ కార్యదర్శి పదవిలో ఉన్న గర్గ్‌ మాట్లాడుతూ మన దేశ ఆర్థిక వ్యవస్థ తొలి త్రైమాసికంలో పక్కాగా 5.8 శాతం వృద్ధిని సాధించి తీరుతుందంటూ అనేక మార్లు వాదించిన సంగతి తెలిసిందే. మోడీ సర్కరు ఆయనపై అనూహ్యంగా బదిలీ వేటు వేయడంతో నిరుత్సాహానికి గురైన ఆయన ఇప్పుడు సర్కారుకు వ్యతిరేకంగా గళం విప్పి వాస్తవ పరిస్థితులను చెప్పడం విశేషం.

30 ఏండ్ల కొడుకు.. తండ్రి సాయం కోరడమేంటి..
దేశంలోని ప్రయివేటు సంస్థల తీరుపై సీఈఏ కృష్ణమూర్తి సుబ్రహ్మణియన్‌ గురువారం విరుచుకుపడ్డారు. దేశంలో 1991 నుంచి మొదలైన ఆర్థిక సంస్కరణల నుంచి ప్రభుత్వ రంగ సంస్థల కంటే కూడా ప్రయివేటు రంగ సంస్థలు దండిగా లాభపడ్డాయని ఆయన అన్నారు. దాదాపు 30 సంవత్సరాల నుంచి లబ్ది పొందిన సంస్థలు ఆర్థిక వ్యవస్థలో కాస్త ప్రతికూలత ఎదురైతే నిలదొక్కుకోలేని స్థితిలో ఉండడమేంటని ఆయన ప్రశ్నించారు. 30 ఏండ్ల కొడుకు (ప్రయివేటు సంస్థలు) సొంతగా ఎదిగి తన మనుగడను తాను వెతుక్కొవాలి తప్ప.. ఇంకా తండ్రి (సర్కారు) సాయం కోరడమేంటని ఆయన ప్రశ్నించారు. తమ పరిస్థితి బాగులేకపోతే సర్కారు ఆదుకుంటుంది అనే భావన నుంచి ప్రయివేటు కంపెనీలు బయటకు రావాలని ఆయన సూచించారు. ప్రతికూలతలో సర్కారు సాయంపై ఆధారపడుదామన్న ఆలోచన తీరును కంపెనీలు మార్చుకోవాలని ఆయన అన్నారు. ఇదే సమయంలో సర్కారు దేశంలో పెట్టుబడులను పెంచేందుకు కృత నిశ్చయంతో ఉందని అన్నారు. గతంలో ఉన్న యూపీఏ సర్కారు ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేందుకు నిర్మాణాత్మకమైన సంస్కరణలను అమలుపరచలేదని ఆయన విమర్శించారు. కానీ మోడీ సర్కారు వచ్చాక ఈ దిశగా వేగంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా ఆయన తెలిపారు.

RELATED ARTICLES

Latest Updates