ఖాకీ వీరంగం..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– వలస కార్మికులపై లాఠీచార్జి… బాష్పవాయు గోళాలు ప్రయోగం
– మహిళలు.. చిన్నారులకు లాఠీ దెబ్బలు
– పోలీసుల దాడుల్లో పలువురికి గాయాలు…
– బీజేపీ పాలిత గుజరాత్‌లో దారుణం..

కూటి కోసం.. కూలి కోసం.. పట్టణానికి వలస వచ్చిన కార్మికుల ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కరోనా వచ్చే ముప్పు కన్నా ఆకలితో ప్రాణాలు పోతాయన్న భయంతో రోడ్లపైకి వస్తున్నారు. తమను సొంతూర్లకు వెళ్ళనివ్వండంటూ వేడుకుంటున్నారు. కార్మికులంతా ఒకేసారి వెళ్లిపోతే… పనుల ఆగిపోతాయన్న యాజమాన్యాల ఒత్తిళ్లకు తలొగ్గిన బీజేపీ పాలిత గుజరాత్‌ పోలీసులు కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. సూరత్‌లో మరోసారి రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగటంతో..ఖాకీలు రెచ్చిపోయారు. దొరికినవారిని దొరికినట్టు కొట్టారు. వలసకార్మికుల దుస్తులను చింపారు. వారిని పరిగెత్తించి మరీ లాఠీలతో చితకబాదారు. మహిళలు…చిన్నారులని కూడా చూడకుండా బాదారు. ఇదేం దారుణమంటూ.. అడిగినందుకు…వారిపై బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. సూరత్‌ కార్మికులపై బీజేపీ సర్కార్‌ వ్యవహరించిన తీరుపై సీపీఐ(ఎం) సహా ప్రతిపక్షాలు,ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

సూరత్‌: గుజరాత్‌లో వజ్రాల నగరిగా పేరు గాంచిన సూరత్‌లో వలసకార్మికులు మరోసారి రోడ్లపైకి వచ్చారు. లాక్‌డౌన్‌ ప్రకటించిన నాటి నుంచి వారు ఇలా వీధుల్లోకి రావటం ఇది నాలుగోసారి. ఇక్కడి ఉండి ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాం.. సొంతూళ్ళకు పంపండంటూ వేలాది మంది వీధుల్లోకి వచ్చి సోమవారం మరోసారి ఆందోళనకు దిగారు. ఆకలి…ఆవేదన..ఆక్రందన..ఆవేదనతో భారీ సంఖ్యలో ప్రధాన కూడలికి చేరుకున్నారు.

తరిమి కొట్టారు…
దేశంలో సోమవారం నుంచి లాక్‌డౌన్‌ 3.0 అమలులోకి వచ్చింది. వరుసగా లాక్‌డౌన్‌ను పెంచుకుంటూ పోతుండటంతో కార్మికుల ఆగ్రహం కట్టలుతెంచుకుంది. ఇక తాము సొంతూర్లకు వెళ్తామనీ, పస్తులుండీ..పైసల్లేక ఎలా బతుకుదామంటూ సూరత్‌ శివారు ప్రాంతంలోని వరేలి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం కార్మికులంతా వీధుల్లోకి వచ్చారు. తమను సొంత ఊర్లకు వెళ్ళనివ్వాలంటూ వలసకార్మికులు పట్టుపట్టారు. అక్కడే బైటాయించారు. దీంతో వారిని అదుపు చేయలేకపోయారు. భారీ సంఖ్యలో ఉన్న వారిని చెదరగొట్టేందుకు ముందుగా లాఠీచార్జి చేశారు. దొరికినవారిని దొరికినట్టు చితకబాదారు. కింద కూర్చొని చేతులెత్తి దండాలు పెట్టినా వదలలేదు.. పారిపోతున్న వారిని వెంటబడిమరీ కొట్టారు. ఆడవారినీ చితకబాదారు. ఒంటిపై చొక్కాలు లాగేసి మరీ ఖాకీ ప్రతాపం చూపారు. ఆపై బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. అటు తమ ఊర్లకు వెళ్లలేక…చేతిలో చిల్లిగవ్వలేక వలసకార్మికుల గోస ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలోనే దారితెన్నూలేక రోదిస్తున్నారు. ఇదిలా ఉండగా…సోమవారం ఆందోళనకు దిగిన సుమారు 70 మంది వలసకార్మికులను అదుపులోకి తీసుకున్నారు. వలసకార్మికుల్లో అత్యధికులు బీహార్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందినవారే.

ఏడాది బిడ్డకు పాలకు డబ్బుల్లేవు : ఆసిస్‌
నా ఏడాది బిడ్డకు పాలు కొనేందుకు కూడా నా దగ్గర డబ్బుల్లేవు. ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాం. మా యజమాని మాకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు.. మమ్మల్ని ఎలాగైనా మా ఊరుకు చేర్చండంటూ ఓ వలసకార్మికుడు కన్నీటిపర్యంతమయ్యాడు. సమీపంలోని టెక్స్‌టైల్‌ పరిశ్రమలో పనిచేస్తున్నట్టు చెప్పాడు. ‘ఇప్పుడు ఇల్లు కూడా లేదు. పది మంది కలిసి ఒక చిన్న ఇరుకైన గదిలో ఉండేవాళ్ళం. డబ్బులులేక నా భాగం అద్దె చెల్లించలేదు. దాంతో వారు నన్ను బయటకుపంపారు. ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. కానీ ఎలా?’ అని ఆ కార్మికుడు ప్రశ్నించాడు.

వారి బాధ్యత ఎవరిది?
వలసకార్మికులను స్వగ్రామాలకు తరలించటం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని కేంద్రం చెప్పింది. కానీ, బీజేపీ పాలిత రాష్ట్రంలో వలస కార్మికులపై వరుసగా ఇలా దాడులకు తెగబడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత వారంలో సూరత్‌, అహ్మదాబాద్‌, భివాండీ, నాసిక్‌, నాగపూర్‌ మీదుగా లక్నో, గోరఖ్‌ఫూర్‌, భోపాల్‌; ఆగ్రాల వరకు పది రైళ్లను నడిపింది. కానీ, అవి ఏ మాత్రం సరిపోవటంలేదు. ఇంకా వేలాది మంది కార్మికులు సొంత ఊర్లకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్నారు

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates