వలసలపై విరిగిన లాఠీ

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– సొంతూళ్ళకు పంపాలంటూ వీధుల్లోకి కార్మికులు
– రెచ్చిపోయిన ముంబయి పోలీసులు
– దొరికిన వారిని దొరికినట్టు బాదిన ఖాకీలు
– పలువురికి తీవ్రగాయాలు…
– పరిస్థితి అదుపులోనే ఉంది : థాకరే
– మోడీ ప్రసంగంలో కానరాని రోడ్‌ మ్యాప్‌

మొన్న సూరత్‌.. ఇపుడు ముంబయి.. వలస కార్మికుల్ని అడ్డుకోవటానికి లాఠీలకు పనిచెప్పారు పోలీసులు. లాక్‌డౌన్‌ ఆంక్షలు ఉన్నా.. బతికుంటే చాలు సొంతూళ్ళకు పంపండంటూ వలసకార్మికులు వీధుల్లోకి వస్తున్నారు. ముంబయిలోనూ అదే జరిగింది. మా సొంతూళ్లకు వెళ్తాం. ఊరుకానీ ఊళ్లో ఆకలితో చావలేమంటూ.. బాంద్రా రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. భారీ సంఖ్యలో వచ్చిన కార్మికులను కట్టడి చేయటానికి పోలీసులు బలప్రయోగం ప్రదర్శించారు. లాఠీలతో వెంబడించారు. దొరికిన వారిని దొరికినట్టు బాదారు. పోలీసులు రెచ్చిపోతుంటే.. తమ ప్రాణాలు కాపాడుకోవటానికి తలోదిక్కుకు పారిపోయారు. పోలీసుల దాడిలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి అదుపులోనే ఉన్నదని మహారాష్ట్ర సర్కార్‌ ప్రకటించింది. మరి గాయాలైన వారికి ఉపశమనం కలిగే చర్యలేవీ మోడీ సర్కార్‌ తీసుకోకపోవటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది.

దాదర్‌: దేశ వాణిజ్య రాజధాని ముంబయి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కరోనా మహమ్మారి కబళిస్తున్న వేళ.. లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నామంటూ మోడీ ప్రకటించిన కొద్ది గంటలకే ముంబయిలోని బాంద్రా రైల్వే స్టేషన్‌ వద్దకు వేలాది మంది వలస కార్మికులు చేరుకున్నారు. కరోనా కంటే ముందు ఆకలి తమను చంపే స్తుందేమోనన్న భయాందోళనలతో వారంతా వీధుల్లోకి వచ్చారు. తమను ఎలాగొలా స్వగ్రామాలకు తిరిగి పంపేందుకు రవాణా ఏర్పాట్లుచేయాలని బతిమిలాడారు. ఉద్యోగాలు ఉంటాయో లేదో తెలియదు.. ఉన్న డబ్బు అయిపోయింది.. తినడానికే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో.. ఆదుకునే వారెవరూ కనిపించటంలేదు.. పైగా మహా రాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో మంగళవారం

మధ్యాహ్నం 3 గంటల
సమయంలో రైల్వే స్టేషన్‌ సమీపంలో ఉన్న బస్‌ డిపో వద్ద వేలాది మంది కార్మికులు తరలివచ్చారు. ఊహించని విధంగా భారీ సంఖ్యలో కార్మికులు రావటంతో..అక్కడ ఉన్న పోలీసులు నిలువరించటం సాధ్యంకాలేదు. ఇంతలో కార్మికులంతా ఆందోళన చేస్తూ… రోడ్డుపై బైటాయించారు. విషయం తెలుసుకున్న భద్రతా బలగాలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నాయి. పొట్ట చేతపట్టుకుని… వీధుల్లోకి వచ్చిన కూలీలపై పోలీసులు విరుచుకుపడ్డారు. దొరికినవారిని దొరికినట్టు చితకబాదారు. ఇండ్లకు వెళ్ళిపోవాలంటూ తరిమికొట్టారు. కాగా, ‘వీళ్లంతా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు, ఈ రోజు లాక్‌డౌన్‌ ముగిసిపోయింది కదా అని సొంత ఊళ్ళకు వెళ్లవచ్చని వారంతా బయటకు వచ్చారు’ అని మహారాష్ట్ర హౌం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ మహాణలే అన్నారు. మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే ఈ విషయం మీద ట్వీట్‌ ద్వారా స్పందించారు. మోడీ సర్కార్‌ లాక్‌డౌన్‌ నిర్ణయం వల్లే ఈ పరిస్థితికి దారితీసిందని పేర్కొన్నారు. బాంద్రా స్టేషన్‌ వద్ద ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని అన్నారు. సూరత్‌లో మాత్రం కొన్ని చోట్ల దాడులు జరిగాయన్నారు. వలస కార్మికులను సొంత ఊళ్ళకు పంపించే విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శించారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates