పోలీసులు మమ్మల్ని కడుపులో తన్నారు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

మహిళలనీ వదలకుండా గాయపరిచారు
ఖాకీల దాష్టీకాన్ని వివరించిన జామియా విద్యార్థులు
– ‘పార్లమెంటు మార్చ్‌లో 16 మందికి గాయాలు.. ఆస్పత్రిలో చేరిక

న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా జామియా విద్యార్థులు సోమవారం చేపట్టిన చలో పార్లమెంటు ర్యాలీపై ఢిల్లీ పోలీసులు సృష్టించిన వీరంగంలో 16 మంది నిరసనకారులకు గాయాలయ్యాయి. గాయాలపాలైనవారిలో మహిళలు కూడా ఉన్నారు. వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధిత విద్యార్థులను జామియా వర్సిటీ వీసీ పరామర్శించారు. తాము చేపట్టిన ర్యాలీపై ఢిల్లీ పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కఠినంగా వ్యవహరించారని బాధితులు వాపోయారు. మహిళలు అని కూడా చూడకుండా విద్యార్థులు, నిరసనకారులను ఇష్టం వచ్చినట్టు బాదారనీ ఖాకీల దాష్టీకాన్ని విద్యార్థులు వివరించారు. నిరసనల్లో పాల్గొన్న మమ్మల్ని పోలీసులు కడుపులో ఇష్టం వచ్చినట్టు తన్నారని గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురు బాధిత విద్యార్థులు తెలిపారు. పోలీసులు తమ ప్రయివేటు భాగాలను లక్ష్యంగా చేసుకొని తీవ్రంగా గాయపరిచారని కొందరు మహిళలు తనతో తెలిపినట్టు ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ అబ్దుల్‌ నజర్‌ చెప్పారు. దీంతో వారికి అంతర్గతంగా చాలా గాయాలయ్యాయనీ, వాటిని గుర్తించడానికి పలు పరీక్షలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కాగా, గాయాలపాలైన విద్యార్థులను జామియా వైస్‌ చాన్స్‌లర్‌ నజ్మా అక్తర్‌ కలసుకొని వారిని పరామర్శించారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లకు వ్యతిరేకంగా జామియా వర్సిటీ నుంచి పార్లమెంటు వరకు విద్యార్థులు నిర్వహించతలపెట్టిన నిరసన మార్చ్‌ను భారీ భద్రతా బలగాల సహాయంతో పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే.

జామియా విద్యార్థులకు ఏఎంయూ స్టూడెంట్స్‌ సంఘీభావం
ప్రజాస్వామ్యయుతంగా శాంతియుత పద్దతిలో నిరసన చేపట్టిన జామియా విద్యార్థులపై పోలీసులు జరిపిన దౌర్జన్యాన్ని అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ) విద్యార్థులు తప్పుబట్టారు. విద్యార్థుల నిరసన ర్యాలీని మధ్యలోనే అడ్డుకోవడం కాకుండా.. వర్సిటీకి కూతవేటు దూరంలో భారీగా భద్రతా బలగాలను ఏర్పాటు చేసి టియర్‌ గ్యాస్‌, వాటర్‌కేనన్లను సిద్ధం చేసుకోవడం దేనికి సంకేతమని వారు ప్రశ్నించారు. విద్యార్థులపై దాడిని ఖండిస్తూ.. నిరసనకారులకు మద్దతుగా అలీగఢ్‌ విద్యార్థులు కొవ్వొత్తులతో ర్యాలీని నిర్వహించారు.

లుధియానాలో నేటి నుంచి షాహీన్‌బాగ్‌నిరసనలు
షాహీన్‌బాగ్‌ నిరసనల ప్రేరణతో పంజాబ్‌లోని లుధియానాలోనూ నేటి నుంచి (బుధవారం) నిరసనలు చేపట్టనున్నట్టు నిరసనకారులు తెలిపారు. జలంధర్‌ బైపాస్‌ చౌక్‌ వద్ద ప్రతిరోజూ నిరసన ప్రదర్శన నిర్వహించాలని సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లకు వ్యతిరేకంగా పోరాడుతున్న సామాజిక, ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు నిర్ణయించారు. జామా మసీదు వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షాహీ ఇమాం పంజాబ్‌ మౌలానా హబీబ్‌-ఉర్‌ రెహ్మాన్‌ సానీ లుధియాన్వీ ఈ మేరకు తెలిపారు. పలు సామాజిక, ప్రజాసంఘాలు, మత సంస్థలకు చెందిన సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ” సీఏఏ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద మేము ‘షాహీన్‌బాగ్‌’ తరహాలో నిరసనను తెలియజేస్తాం. ప్రజలంతా ఏకమై కేంద్ర ప్రభుత్వ కుట్రలకు వ్యతిరేకంగా గొంతు వినిపించాలి. అన్ని వర్గాల ప్రజలు ఇందులో భాగం కావాలి” అని ఆయన కోరారు.

రాజస్థాన్‌లోనూ…
దేశరాజధాని ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌ నిరసనలు ఇటు రాజస్థాన్‌లోని సీఏఏ వ్యతిరేక నిరసనకారులకు ప్రేరణనిచ్చాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, పట్టణాలు, నగరాలు ఇదే మార్గంలో ముందుకెళ్తున్నాయి. నిరసనకారులు పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడుతున్నారు. రాష్ట్ర రాజధాని జైపూర్‌లో ‘సంవిధాన్‌ ఏవం లోక్‌తంత్ర బచావో అభియాన్‌’ ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాలు, నగరాల నుంచి వచ్చిన ప్రజలు, చిన్నారులు, మహిళలు కూడా ఈ ఆందోళనల్లో పాలుపంచుకుంటున్నారు. పలు సామాజిక, ప్రజాసంఘాలకు చెందిన నాయకులు, ప్రతినిధులు.. ఈ నిరసనలకు సంఘీభావం తెలుపుతున్నారు. నిరసనకారులు పలు నినాదాలు, పాటలతో దీక్షా శిబిరం వద్ద హౌరెత్తిస్తున్నారు. దీంతో ఇక్కడి దీక్షా ప్రాంగణం రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోని నిరసనలకు కేంద్ర బిందువుగా మారింది.

”సీఏఏ, ఎన్నార్సీలతో దేశ ప్రజలను మోడీ సర్కారు మతప్రాతిపదికన విభజించాలనుకుంటున్నది. కానీ, దేశంలోని ఏ ఒక్క సాధారణ పౌరుడూ దీనిని అంగీకరించడు. మేము మా రాజ్యాంగాన్ని మాత్రమే కాదు.. దేశ భిన్నత్వాన్ని, వైవిధ్యాన్ని కూడా కాపాడుకుంటాం” అని భీం ఆర్మీ నాయకులు నీలం క్రాంతి తెలిపారు. అసోం ఐద్వా, సీపీఐలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఈ నిరసనల్లో పాల్గొన్నారు.
జైపూర్‌తో పాటు చిత్తోర్‌గఢ్‌, బుండీ, సవారు మధోపూర్‌, సికార్‌లలోనూ సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లను నిరసిస్తూ.. మోడీ సర్కారుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా నివాసానికి దగ్గరలో కోటాలోని నిరసన వేదిక వద్ద నిరసనకారులు రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే నలుపురంగు బెలూన్లను గాలిలో వదిలేసి, కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.

చిన్నారులను నిర్బంధ శిబిరాలకు తరలించం : లోక్‌సభలో హోంశాఖ సహాయ మంత్రి వెల్లడి
అసోంలో ఎన్నార్సీ జాబితాలో చోటుచేసుకోని చిన్నారులను, వారి తల్లిదండ్రుల పేర్లు జాబితాలో ఉన్నప్పటికీ, నిర్బంధ శిబిరాలకు తరలించకూడదని నిర్ణయించినట్టు ప్రభుత్వం లోక్‌సభలో మంగళవారం ప్రకటించింది. అసోంలోని ఎన్నార్సీ జాబితాలో కొందరు చిన్నారులను మినహాయించగా, వారి తల్లిదండ్రులకు మాత్రం చోటు లభించిందని, ఇటువంటి పరిస్థితుల్లో వారిని తల్లిదండ్రుల నుంచి వేరు చేయలేమని, గత నెల 6న అటార్నీ జనరల్‌ సుప్రీంకోర్టుకు తెలిపారని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరారు లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సివుందని అన్నారు. గతేడాది ఆగస్టులో ప్రచురించిన ఎన్నార్సీ తుది జాబితాలో సుమారు 19 లక్షల మంది పేర్లు గల్లంతైన సంగతి తెలిసిందే.

జామియా ఘటనపై స్వతంత్ర దర్యాప్తునకు ఐద్వా డిమాండ్‌
సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా బహిరంగ ప్రదర్శన చేపడుతున్న జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జిని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) తీవ్రంగా ఖండించింది. పోలీసులు, వారి వెనకున్న కాషాయ శక్తుల చట్ట విరుద్ధ చర్యలకు నిరసనగా ఆందోళన చేపట్టాలని ఐద్వా అన్ని రాష్ట్ర విభాగాలకు పిలుపునిచ్చింది. పోలీసుల దాష్టీకాన్ని ప్రత్యక్ష సాక్షులు, మీడియా బహిర్గతం చేసిందని తెలిపింది. పోలీసుల క్రూరత్వం కారణంగా గాయాలపాలైన 30మందికి పైగా విద్యార్థులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. ముఖ్యంగా విద్యార్థినుల పట్ల పోలీసుల తీరు భయబ్రాంతులకు గురి చేసిందని ఐద్వా పేర్కొంది. పోలీసుల అమానుష చర్యతో 10 మంది విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారని దుయ్యబట్టింది. ఇటువంటి చట్టవిరుద్దమైన లాఠీచార్జికి కారణమైన, ముఖ్యంగా విద్యార్థినులపై దాడి చేసిన పోలీసులపై కేసు నమోదుచేయాలని, ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశాలివ్వాలని ఐద్వా డిమాండ్‌ చేసింది. కాషాయ గూండాలు, పోలీసులు కూడబలుక్కుని శాంతియుతంగా జరుగుతున్న ర్యాలీపై అసహనంతో దాడి చేశారనడానికి ఈ ఘటన నిదర్శనమని ఐద్వా ఆగ్రహం వ్యక్తం చేసింది. గత రెండు నెలల్లో జామియా విద్యార్థులే లక్ష్యంగా లాఠీచార్జ్‌ చేయడం ఇది వరుసగా రెండవసారి.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates