రోజూ పాఠాలు చెప్పే ప్రొఫెసర్‌ పరారీలో ఉన్నారా!?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
 అరెస్టుకు ముందు నోటీసులు ఎందుకివ్వలేదు?..
23లోగా కౌంటర్‌ వేయండి: హైకోర్టు

హైదరాబాద్‌: ‘‘ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా నిత్యం విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న కాశిం పరారీలో ఉన్నారని చెబుతారా’’ అంటూ పోలీసుల తీరుపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. అరెస్టు చేసే ముందు కనీసం నోటీసులిచ్చారా? అరెస్టుపై ఓయూ అధికారులకు సమాచారం ఇచ్చి, వారి అనుమతి తీసుకున్నారా? అని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. కేసు దర్యాప్తుకు ఇన్నేళ్లు ఎందుకు పట్టిందని నిలదీసింది. ప్రొఫెసర్‌ కాశిం అరెస్టుకు ముందు పోలీసులు వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉందని, అరెస్టు చట్టబద్ధమా కాదా అన్నదానిపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొంది. పూర్తి వివరాలతో ఈ నెల 23లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రొఫెసర్‌ కాశింను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని, ఆయన ఆచూకీ తెలిపేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్‌ దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం ఆదివారం సీజే నివాసంలో మరోసారి విచారించింది. శనివారం పోలీసులు కాశింను ధర్మాసనం ముందు హాజరుపర్చిన సంగతి తెలిసిందే.

సీజే నివాసంలో ఆదివారం 3 గంటల పాటు ఈ కేసు విచారణ కొనసాగింది. మొదట కాశిం కుటుంబ నేపథ్యం, అరెస్టుకు ముందు పోలీసులు వ్యవహరించిన తీరుతోపాటు ఆయనపై ఉన్న కేసుల వివరాలను ధర్మాసనం అడిగి తెలుసుకుంది. తన ఇంట్లో లేని డాక్యుమెంట్లు, విప్లవ సాహిత్యాన్ని పోలీసులే పెట్టారని, తప్పుడు రిపోర్టు తయారు చేసి తనతో బలవంతంగా సంతకం చేయించేందుకు ప్రయత్నించారని కాశిం తెలిపారు. అలాగే సంగారెడ్డి జైలులో సరైన సౌకర్యాలు లేవని, చర్లపల్లికి తరలించేలా ఆదేశించాలని కోరగా.. ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మావోయిస్టులతో కాశింకు సంబంధాలున్నాయనడానికి తమ దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. పూర్తి వివరాలతో 23లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. విచారణను 24కు వాయిదా వేసింది. అనంతరం కాశింను సంగారెడ్డి జైలుకు తరలించారు.

బెయిల్‌ పిటిషన్‌ వేస్తాం
కాశింకు బెయిలు కోసం సోమవారం పిటిషన్‌ దాఖలు చేస్తామని న్యాయవాది రఘునాథ్‌ విలేకరులతో చెప్పారు. 2006లో నమోదు చేసిన కేసుతోపాటు మరో ఐదు కేసుల్లో కాశిం నిందితుడిగా ఉన్నట్లు ప్రభుత్వ న్యాయవాది చెప్పారని.. అవన్నీ కింది కోర్టుల్లో వీగిపోయినవేనని వివరించారు. తన రచనలతో ప్రజలను చైతన్యపరుస్తున్న కాశింపై తప్పుడు కేసులు పెట్టారని స్నేహలత ఆరోపించారు. విచారణ సందర్భంగా కాశిం తన కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు ధర్మాసనం అనుమతించడంతో వారిని సీజే ఇంటికి తీసుకెళ్లారు.
నా కొడుకు చేసిన తప్పేంటి!?: వీరమ్మ
‘‘నా కొడుకు కాశిం నిర్దోషి. ప్రొఫెసర్‌గా ఎంతో మంది విద్యార్థులకు మంచి గురువు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని.. తన ఉపన్యాసాలతో ప్రజలను జాగృతం చేశాడు. అదేనా వాడు చేసిన తప్పు?’’అని కాశిం తల్లి వీరమ్మ ప్రశ్నించారు. తెలంగాణ కోసం పోరాడడమే కాశిం చేసిన నేరమా? అని కంటతడి పెట్టారు. ఆదివారమిక్కడ విరసం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీరమ్మ మాట్లాడారు. తన కొడుకును తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సమాజంలో భయానక వాతావరణం సృష్టించాలని తెలంగాణ ప్రభుత్వం చూస్తోందని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ నిరంకుశ పాలనను వ్యతిరేకించినందునే కాశింను అరెస్ట్‌ చేశారని విరసం అధ్యక్షుడు అరసవెల్లి కృష్ణ అన్నారు.
అరె్‌స్టను ఖండిస్తున్నాం: వంగపల్లి
ఉస్మానియా యూనివర్సిటీ: ప్రజల పక్షాన పోరాడుతున్న వారిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్‌టీఎస్‌ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ మాదిగ అన్నారు. కాశిం తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. కాశింను విడుదల చేయకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కాశిం అరెస్ట్‌ అప్రజాస్వామికమని గాలి వినోద్‌కుమార్‌ అన్నారు.

(Courtesy Andhrajyothi)

RELATED ARTICLES

Latest Updates