అనంగీకార హక్కుల ఉల్లంఘన

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

అనేక మంది ఆర్థికవేత్తలు, రాజకీయపార్టీలు ప్రతి కుటుంబానికి నెలకు రూ.7000 చొప్పున మూడు నెలల పాటు నగదు అందించాలని, దానితో పాటు ప్రతి వ్యక్తికి నెలకు 10కేజీల ఆహార ధాన్యాలను ఆరు నెలల పాటు అందజేయాలని డిమాండ్‌ చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆహార ధాన్యాలను అందించడానికి చర్యలు తీసుకుంటుంది కానీ, నగదు బదిలీకి సంబంధించి ఏ విధమైన చర్యల అమలుకు పూనుకోవడం లేదు. ఈ విధమైన డిమాండ్లను దయాదాక్షిణ్యాలపై ఆధారపడే చర్యలుగా చూడకూడదు. ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ కాలంలో ఆదాయాలు కోల్పోయిన పేద కార్మికుల హక్కులను గౌరవించే చర్యలుగా చూడాలి.

ఒక సమస్య పరిష్కారానికి వ్యక్తులు వామపక్షీయులా, మితవాదులా లేక మధ్యేవాదులా అనే దానితో సంబంధం లేదు. వాస్తవానికి సమస్య పరిష్కారాన్ని ఆ దృష్టితో చూస్తే దానిని ప్రక్క దారి పట్టించినట్టే. ఇది ఒక చిన్న చట్టపరమైన విషయానికి సంబంధించినది. ప్రభుత్వం ఎవరిదైనా ఆస్తిని తీసుకుంటే, మన దేశ చట్ట ప్రకారం ఆ వ్యక్తి నష్టపరిహారం పొందడానికి అర్హుడవుతాడు. అదే విధంగా ప్రభుత్వ చర్యలు, కష్టించి పని చేసుకొని సంపాదించుకొనే ఏ వ్యక్తి యొక్క ఆదాయాన్నైనా రాకుండా చేస్తే, అదే చట్ట ప్రకారం ఆ వ్యక్తికి ప్రభుత్వం నుంచి నష్ట పరిహారాన్ని పొందడానికి అర్హత ఉంటుంది.

కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా మార్చి 24న నరేంద్రమోడీ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటన, 14కోట్ల మంది వలస కార్మికులతో సహా అసాంఖ్యాకమైన కార్మికుల ఆదాయాలను ఒక్క కలం పోటుతో నిలిపివేసింది. ఈ 14 కోట్ల మంది వలస కార్మికుల్లో దాదాపు 10కోట్ల మంది అంతర్రాష్ట్ర వలస కార్మికులు ఉన్నారు. కానీ ప్రభుత్వం ఎటువంటి నష్ట పరిహారాన్నీ ప్రకటించలేదు. నేటికీ ప్రభుత్వం ఎటువంటి నష్ట పరిహారాన్నీ చెల్లించలేదు, చెల్లించే అవకాశం కూడా లేదు.

లాక్‌డౌన్‌ ప్రారంభంలో ప్రభుత్వం, కార్మికులు పనిచేస్తున్న సంస్థల యాజమాన్యాలకు లాకౌడౌన్‌ కాలానికి వేతనాలు చెల్లించాలని ఆజ్ఞలు జారీ చేసింది. కానీ సుప్రీంకోర్టు ఈ ఆర్డర్‌ను కొట్టి వేసింది. ఆ విధంగా ఆజ్ఞలను కొట్టి వేసినపుడు, కేంద్ర ప్రభుత్వం తనంతట తానే రాష్ట్ర ప్రభుత్వాలకు (రాష్ట్రాలకు చట్ట బద్ధంగా రావాల్సిన జీఎస్టీ నష్ట పరిహారాల బకాయీలతో కలిసిన నిధుల కొరత ఉన్నప్పటికీ) కొంత డబ్బు వారికి చెల్లించాలని చెప్పి ఉండాల్సింది. కానీ లాక్‌డౌన్‌కు ముందే ఎవరు చెల్లించాలన్న సమస్యను కూడా పరిష్కరించి ఉండాల్సింది. ఎవరు చెల్లించాలన్న జగడం కారణంగా కార్మికులకు నష్ట పరిహారాన్ని నిరాకరించకూడదు.

దేశ పౌరులుగా మౌలిక హక్కులను కలిగి ఉండి, రాత్రికి రాత్రే యాచకులుగా మారిన కార్మికుల యొక్క మౌలిక హక్కులు ఊహించని విధంగా, భయానకంగా, ఉల్లంఘనకు గురవుతున్న తీరును నేడు మనం చూస్తున్నాం. అన్ని పెట్టుబడిదారీ దేశాల్లో, లాక్‌డౌన్‌ కాలంలో ప్రయివేటు రంగంలో పనిచేసే కార్మికులతో సహా అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాల చెల్లింపుల బాధ్యతను లాక్‌డౌన్‌ను ప్రకటించిన ప్రభుత్వాలే తీసుకున్నాయి.

ఆ విధమైన చెల్లింపులు పెద్దఎత్తున చేసిన సందర్భంలో, మే 8న లండన్‌కు చెందిన ‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’ పత్రిక ఆ చెల్లింపులను సమర్థిస్తూ సంపాదకీయంలో ఈ విధంగా వ్యాఖ్యానించింది. ”కమ్యూనిస్ట్‌ విప్లవం లేకుండా, గడిచిన రెండు నెలల కాలంలో కార్మికులు, అప్పు, సరుకులు-సేవల మారకం కోసం ప్రభుత్వాలు ప్రయివేటు మార్కెట్లలో ఇంత తొందరగా జోక్యం చేసుకోగలగడాన్ని ఊహించడం కష్టమైన విషయం. రాత్రికి రాత్రే ప్రయివేటు రంగంలో పనిచేసే మిలియన్ల సంఖ్యలో ఉన్న కార్మికులు, ప్రభుత్వ బడ్జెట్‌ నుంచి చెల్లింపుల చెక్కులు పొందుతున్నారు. సెంట్రల్‌ బ్యాంక్‌లు అన్నీ ఎలక్ట్రానిక్‌ డబ్బుతో ఉన్న ఫైనాన్షియల్‌ మార్కెట్లతో నిండి పోయాయి. ఈ చెల్లింపులు దయాదాక్షిణ్యాలు, మానవత్వం, మనోభావాలపైన ఆధారపడి లేవు. ఇది పెట్టుబడిదారీ ప్రజాస్వామ్యంలోని వ్యక్తుల యొక్క హక్కుల గుర్తింపు. మన రాజ్యాంగం వాగ్దానం చేసిన దానితో నిమిత్తం లేకుండా, భారత దేశంలో పేదవారికి ఏ విధమైన హక్కులు లేవన్న విషయాన్ని భారత దేశంతో మిగిలిన దేశాలకు ఉన్న భేదం తెలియజేసింది.

పేద ప్రజల హక్కులు గుర్తించని వైఖరి, మధ్య తరగతి, ఉన్నత వర్గాలలోని అధిక సంఖ్యలో ఉన్న ప్రజలకు వ్యాపించింది. ఆఖరికి ప్రజల హక్కులను సంరక్షించే సుప్రీంకోర్టు కూడా, ప్రభుత్వం లాక్‌డౌన్‌ కాలానికి కార్మికులకు తమ యాజమాన్యాలు వేతనాలు చెల్లించాలన్న ఆర్డర్‌ను కొట్టివేసేటపుడు, తమ వ్యాపార సంస్థలు మూసివేసినప్పుడు వేతనాలు చెల్లించాలని యజమానులను మాత్రం మనం ఎలా అడుగుతామని ప్రశ్నించింది. కానీ వ్యాపారసంస్థలను మూయించినప్పుడు కార్మికులు మాత్రం వేతనాలు లేకుండా తమ స్వస్థలాలకు ఎలా వెళ్లగలుగుతారని వెంటనే అడగాల్సిన ప్రశ్నను ఉన్నత న్యాయస్థానం కూడా అడుగలేదు. అది జరిగి ఉంటే, కార్మికులకు ప్రభుత్వమే వేతనాలు ఇవ్వాల్సి ఉంటుందన్న నిర్ధారణకు వచ్చి, వేతనాలు చెల్లించాలని ప్రభుత్వానికి మార్గదర్శకాలను ఇచ్చి ఉండేది. ఆ రకంగా కార్మికుల హక్కులకు మద్దతు కూడా ఇచ్చి ఉండేది. అందుకు బదులుగా న్యాయస్థానం ఆదాయ నష్టాలను, ఏ మాత్రం భరించలేని పేద కార్మికుల భుజాలపై మోపింది. ఇది ఫ్యూడల్‌ వ్యవస్థలో ఉన్న ఆధిపత్య లక్షణంగా ఉంది కానీ, చట్టం ముందు సార్వత్రిక హక్కులు, సమానత్వం ఉండే ప్రజాస్వామిక వ్యవస్థ లక్షణంగా లేదు.

కేంద్ర ప్రభుత్వం అవలంబించిన ఈ గందరగోళం విజయవంతంగా ఈ హక్కుల ప్రశ్నను వెనక్కి నెట్టివేసింది. మరోవైపు కేంద్ర ఆర్థికమంత్రి ప్రకటించిన ‘ఉద్దీపన ప్యాకేజీ’ స్వభావంపైకి చర్చ మళ్ళింది. ఆ ప్యాకేజీలో అందరికీ తెలిసిన విధంగానే ఆర్థిక వ్యవస్థ ఉద్దీపన కోసం వివిధ గ్రూపులకు రుణాలు అందుబాటులో ఉంచేందుకు పెద్ద సంఖ్యలో అవసరమైన చర్యలున్నాయి. దీనిలో కొన్ని ఆర్థిక బదిలీ మార్గాలే ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం డిమాండ్‌ అదుపులో ఉన్నది కాబట్టి, డిమాండ్‌ విస్తరణకు సాధనంగా ప్రభుత్వ ఖర్చు లేకుండా రుణాలను అందుబాటులో ఉంచడం అంటే దానర్థం రుణాలు ఇవ్వజూపడం కూడా యాచించడమే. అంటే ప్రభుత్వ ప్యాకేజీ డిమాండ్‌ను, రుణాన్ని, ఉత్పత్తిని, ఉపాధిని విస్తరించదు.

కానీ ఈ చర్చ (విలువైనదయినప్పటికీ) నష్టపరిహారానికి గాను కార్మికులకు ఉండే హక్కులకు సంబంధించిన ప్రశ్నకు సంబంధం లేదు. ఒకవేళ ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ డిమాండ్‌ అదుపులో లేదు కానీ, రుణాల అదుపులో ఉన్నది అనీ, ఆమె సమకూర్చిన ప్యాకేజీ ఆర్థిక ఉద్దీపనకు సరియైనదని, ఆర్థిక మంత్రి విశ్వసించడం సరియైనది అయినప్పటికీ, వారి తప్పిదం లేకుండా ఆదాయాలు కోల్పోయిన కార్మికులకు నష్టం పరిహారం చెల్లించకుండా ఆర్థిక మంత్రి తప్పించుకోలేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే లాక్‌డౌన్‌కు ఆజ్ఞలు జారీ చేసింది. ఆర్థిక వ్యవస్థకు ఏది మంచి చేస్తుందన్న ప్రశ్నను కార్మికుల హక్కుల ప్రశ్న నుంచి వేరు చేయాల్సి ఉంటుంది. నాతో సహా అనేక మంది, వేతనాలు కోల్పోయి నందుకు కార్మికులకు నష్ట పరిహారాన్ని చెల్లించడం కూడా ఆర్థిక వ్యవస్థ ఉద్దీపనకు సరియైన సాధనం అని విశ్వసిస్తున్నాం.

దేశ విభజన జరిగిన రోజుల్లోని జ్ఞాపకాలు లేదా 1943లో బెంగాల్‌ కరువు గుర్తుకొచ్చే విధంగా, స్వాతంత్య్రం అనంతర చరిత్రలో ఎన్నడూలేని విధంగా మనం అసాధారణ మానవ సంక్షోభాన్ని చూస్తున్నాం. ఇది కాదనలేని నిజం. కానీ ఉత్తర భారతదేశంలో భరించలేని ఎండలో భారంగా తమ స్వస్థలాలకు నడుచుకుంటు వెళ్తూ, లేదా ఆహారం, నీళ్ళు లేక తొందర పాటుగా ఏర్పాటు చేసిన రైళ్ళలో కిక్కిరిసిన జనంతో ప్రయాణం చేస్తున్న మానవ విషాదాన్ని చూసినపుడు, మనం వారి మౌలిక హక్కుల ఉల్లంఘనను ఖచ్చితంగా గమనించాలి. ఈ ఉల్లంఘనకు గాను వారికి నష్ట పరిహారం చెల్లించకుంటే, వారిని ఎల్లప్పుడూ రెండవ తరగతి పౌరుల స్థాయికి దిగజార్చే ఒక దుష్టాంతాన్ని ఏర్పాటు చేస్తారు.

అనేక మంది ఆర్థికవేత్తలు, రాజకీయపార్టీలు ప్రతి కుటుంబానికి నెలకు రూ.7000 చొప్పున మూడు నెలల పాటు నగదు అందించాలని, దానితో పాటు ప్రతి వ్యక్తికి నెలకు 10కేజీల ఆహార ధాన్యాలను ఆరు నెలల పాటు అందజేయాలని డిమాండ్‌ చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆహార ధాన్యాలను అందించడానికి చర్యలు తీసుకుంటుంది కానీ, నగదు బదిలీకి సంబంధించి ఏ విధమైన చర్యల అమలుకు పూనుకోవడం లేదు. ఈ విధమైన డిమాండ్లను దయాదాక్షిణ్యాలపై ఆధారపడే చర్యలుగా చూడకూడదు. ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ కాలంలో ఆదాయాలు కోల్పోయిన పేద కార్మికుల హక్కులను గౌరవించే చర్యలుగా చూడాలి.

ఆర్థికవేత్తలు, ఇతరుల ప్రతిపాదనల నుంచి ప్రభుత్వం ప్రజలకు ఏమి ఇస్తుందో నిర్ణయించవచ్చు. కానీ ప్రభుత్వం నష్టపరిహార ప్యాకేజీకి ‘లేదు’ అనే మాట చెప్పకూడదు. లేదంటే ఏ ప్రజాస్వామ్యంలోనైనా, అది అనంగీకారమైన బహిరంగ పౌర హక్కుల ఉల్లంఘనే అవుతుంది.

ప్రభాత్‌ పట్నాయక్‌
‘ద టెలిగ్రాఫ్‌’ సౌజన్యంతో
అనువాదం: బోడపట్ల రవీందర్‌

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates