‘సామాజిక న్యాయ’ రూపశిల్పి

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

Article On PS Krishnan - Sakshiఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, కేంద్రంలో వివిధ శాఖల్లో ఉన్నతాధికారిగా పనిచేసి దళితుల, ఆదివాసీల, మైనారిటీల, వెనకబడిన వర్గాల సామాజికార్థిక హక్కుల కోసం అహరహం శ్రమించిన మహనీయుడు పీఎస్‌ కృష్ణన్‌ 87 ఏళ్ల వయసులో ఆదివారం ఉదయం ఢిల్లీలో కన్నుమూశారు. 1956 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన కృష్ణన్‌ మరణంతో ఈ వర్గాలు తమ హక్కుల కోసం అంకితభావంతో కృషి చేసిన ఒక చాంపియన్‌ను కోల్పోయాయని చెప్పాలి. ఆయన నిర్వహించిన శాఖలు, ముఖ్యంగా కేంద్ర సంక్షేమ శాఖ కార్యదర్శి పదవి ఆయన మాటల్లోనే చెప్పాలంటే ‘సామాజికయుక్తమైనవి’.  సమానత్వం, సమన్యాయం గురించి ప్రవచించే ఈ దేశ రాజ్యాంగం… అందుకు విరుద్ధమైన పోకడలతో నిర్మితమై ఉన్న మన సమాజాన్ని శాంతియుతంగా మార్చడానికి వీలైన సాధనమని 50వ దశకంలో తనతోపాటు సర్వీస్‌లో చేరిన తన సహచరులకు, ఇతరులకు ఆరు దశాబ్దాలపాటు తన ఆచరణద్వారా నిరూపించిన గొప్ప వ్యక్తి కృష్ణన్‌. ఆ విషయంలో ఆయన డాక్టర్‌ అంబేడ్కర్‌కు ఏకైక సాధికార అనుచరుడు.

షెడ్యూల్‌ కులాలకు ఉద్దేశించిన ప్రత్యేక ప్రణాళిక(స్పెషల్‌ కాంపోనెంట్‌) రూపశిల్పి కృష్ణన్‌.  రాష్ట్రాల్లో ఉండే ఈ ప్రత్యేక ప్రణాళికలకు కేంద్రం సాయం అందించడం, రాష్ట్రాల్లోని షెడ్యూల్‌ కులాల అభివృద్ధి కార్పొరేషన్లకు నేరుగా కేంద్ర సాయాన్ని అందించడం వంటివి 1978–80 మధ్య ఆయన చేతుల మీదుగా రూపుదిద్దుకున్నాయి. 1989లో వచ్చిన షెడ్యూల్‌ కులాల, షెడ్యూల్‌ తెగల(అత్యాచారాల నిరోధ) చట్టం ఆయనే రూపొందించారు. మానవ మలాన్ని మోసుకెళ్లే అత్యంత అమానుషమైన పనికి వ్యతిరేకంగా ఆయన నిరంతరం పోరాడారు. వెనకబడిన వర్గాల అభ్యున్నతికి ఉద్దేశించిన మండల్‌ కమిషన్‌ సిఫార్సులు అమలుకు సంబంధించిన విధివిధానాల రూపకల్పనలో ఆయన చేసిన కృషి అపూర్వం, అనితర సాధ్యం. ఈ సిఫార్సులను హేతుబద్ధీకరించి, వాటిల్లోని వైరుధ్యాల పరిష్కారానికి కృష్ణన్‌ ఎంతో శ్రమించారు. జాతీయ ఎస్‌సీ, ఎస్‌టీ కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం, కేంద్ర సంక్షేమ మంత్రిత్వ శాఖకు కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వ శాఖగా నామకరణం చేసింది కూడా ఆయనే. భారత సమాజంలోని అనేకానేక ఉపజాతులకు చరిత్రలో జరిగిన అన్యాయం గురించి ఆయనకున్న పరిజ్ఞానం అపారమైనది. వాటిపై వచ్చే ప్రశ్నలకైనా, ఇక్కడి సామాజిక జీవనం గురించిన ప్రశ్నలకైనా ఆయన ఎంతో సాధికారికంగా, సులభగ్రాహ్యంగా జవాబిచ్చేవారు. ఆ రంగంలో ఆయన చేసిన విస్తృత అధ్యయనం అందుకు కారణం. కేంద్ర ప్రభుత్వం, దాని అధీనంలో ఉండే ప్రణాళిక, విధాన రూపకల్పన సంస్థలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఆయన విజ్ఞానాన్ని సంపూర్ణంగా వినియోగించుకున్నాయి. పాలనా వ్యవహారాల రంగంలో పనిచేసే మన ఉన్నత విద్యాసంస్థలు ఆయన చేసిన పరిశోధన పత్రాలను, ఆయన ఇతర రచనలను సేకరించి భవిష్యత్తరాల ప్రభుత్వోద్యోగులకు, దళిత అధ్యయనాలపై పనిచేస్తున్న యువతరానికి మార్గదర్శకంగా వినియోగిస్తే మన సమాజానికి లబ్ధి చేకూరుతుంది. సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రాతిపదికలుగా ఈ దేశంలో శాంతియుత పరివర్తన సాధ్యమేనని స్వప్నించిన డాక్టర్‌ అంబేడ్కర్‌ ఆశయ సాధనకు ఇది తోడ్పడుతుంది. సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్న కృష్ణన్‌ సతీమణి శాంతి కృష్ణన్, ఆయన భావాలను పుణికిపుచ్చుకున్న కుమార్తె శుభదాయని ఆయన అపారమైన పరిశోధన పత్రాలను, ఇతర రచనలను అందించి ఇందుకు సహకరించగలరని నా దృఢమైన విశ్వాసం.

కె.ఆర్‌.వేణుగోపాల్‌
వ్యాసకర్త మాజీ ఐఏఎస్‌ అధికారి,
ప్రధాన మంత్రి కార్యదర్శి(రిటైర్డ్‌)  

RELATED ARTICLES

Latest Updates