గర్భిణీ స్త్రీల పట్ల ఇలాగేనా?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– పీఎం మాతృవందన యోజనలో అర్హులు 14శాతం
– దరఖాస్తులో అడిగేది ఎక్కువ…ఇచ్చేది తక్కువ
– విసుగుతెప్పిస్తున్న ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ: జచ్చా..బచ్చా-2019 సర్వే

న్యూఢిల్లీ : సంక్షేమ పథకాల్లో ఏదైనా కొత్తగా తీసుకొస్తే, మరింత మెరుగ్గా ఉండాలి. అర్హులైన అభ్యర్థులందరికీ పథకం ప్రయోజనాలు అందేట్టు చూడాలి. దరఖాస్తు ప్రక్రియ, ప్రయోజనాల అందజేత సరళతరం చేయాలి. మోడీ సర్కార్‌ 2017లో తెచ్చిన ‘పీఎం మాతృవందన యోజన’ పథకం ఈ విషయాల్ని విస్మరించిందనీ, కేవలం 14శాతం మంది గర్భిణీ స్త్రీలకు మాత్రమే పథకం ప్రయోజనాలు అందాయనీ ‘జచ్చా బచ్చా-2019’ సర్వే తేల్చింది. చత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జార్ఖాండ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌…రాష్ట్రాల్లో సర్వే నిర్వహించగా, గర్భిణీ స్త్రీ, ప్రసవ మహిళలకు అందుతున్న ప్రయోజనాలు నామమాత్రంగా ఉన్నాయని తేలింది. ఈ సర్వేలో పేర్కొన్న మరికొన్ని అంశాలు ఇలా ఉన్నాయి…

ఇందిరాగాంధీ మాతీృవ సహయోగ యోజన పథకం పేరును 2017లో మోడీ సర్కార్‌ ‘పీఎంమాతృవందన యోజన’గా మార్చింది. పథకం కింద అర్హులైన గర్భిణీ స్త్రీలు, ప్రసవ మహిళలకు ప్రయోజనాలు పెంచాల్సింది పోయి, రూ.6వేల నుంచి రూ.5వేలకు తగ్గించింది. మొదటి ప్రసవానికి మాత్రమే పథకం వర్తిస్తుందని నిబంధన విధించారు. దీంతో పీఎం మాతృవందన యోజన పథకం 2018-19లో కేవలం 14శాతం మందికి మాత్రమే లబ్దిచేకూర్చింది. అర్హులైన 55శాతం గర్భిణీ స్త్రీలకు పథకం వర్తించకపోవడానికి ‘మొదటి ప్రసవానికి మాత్రమే’…అన్న నిబంధన కారణమైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం అనేది ఒకటున్నదన్న సంగతే తెలియదు.

దరఖాస్తు చేయాలంటే 23 పేజీలు నింపాలి..
– పీఎం మాతృవందన యోజన పథకానికి దరఖాస్తు చేయాలంటే గర్భిణీ స్త్రీ లేదా ప్రసవ మహళ 23 పేజీల దరఖాస్తు నింపాలి. గ్రామీణ మహిళలకు ఇది ప్రతికూలంగా మారింది.
– మదర్‌-చైల్డ్‌ ప్రొటెక్షన్‌ కార్డ్‌, భార్యాభర్తల ఆధార్‌ కార్డులు, ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంక్‌ పాస్‌బుక్‌…మొదలైనవి ఆన్‌లైన్‌లో సమర్పించాలి.
– ఎన్నో గంటలపాటు ఓపిగ్గా ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేస్తే…90శాతం దరఖాస్తులు ‘రిజెక్ట్‌’ అని వస్తున్నాయి.
ఆహారభద్రత చట్టం ఉల్లంఘించారు…
ఆహార భద్రత చట్టం-2013 ప్రకారం, ప్రతీ గర్భిణీ స్త్రీకి రూ.6వేలకు తక్కువ కాకుండా ప్రయోజనాలు కల్పించాలి. పీఎం మాతృవందన యోజనలో మొదటి ప్రసవానికి మాత్రమే ప్రయోజనాలు కల్పిస్తూ నిబంధనలు రూపొందిం చారనీ, ఇది ‘జాతీయ ఆహార భద్రత చట్టా’న్ని ఉల్లంఘించటమేననీ సర్వేలో నిపుణులు పేర్కొన్నారు.

Courtesy Navatelangana…

RELATED ARTICLES

Latest Updates