పనిచ్చింది 51 రోజులే..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– 2018-19లో ఉపాధి హామీ కింద కల్పించిన పనిదినాలు..
– ‘ఉపాధి’ పనుల్లో పెరుగుతున్న యువత
– నిరుద్యోగ తీవ్రతకు నిదర్శనం : ఆర్థిక విశ్లేషకులు

న్యూఢిల్లీ : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వంద రోజులు పని కల్పించే ఉద్దేశంతో రూపొందించిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంఎన్‌ఆర్‌ఈజీఏ)లో భాగంగా.. 2018-19లో 51 రోజుల పనిది నాలను మాత్రమే మోడీ సర్కారు కల్పించింది. పని కావాలని వచ్చిన వ్యక్తికి తప్పనిసరిగా 100 రోజులు పని కల్పించాలని చట్టంలో ఉన్నా కేంద్రం మాత్రం అందులో సగానికే పరిమితమైంది.

దేశంలోని ఏ ఒక్క రాష్ట్రంలోనూ వంద రోజుల పనిదినాలను అందించలేదు. ఈ విషయాన్ని లోక్‌సభలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర తోమర్‌ వెల్లడించారు. బీజేపీ ఎంపీ ప్రీతం ముండే అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. గత ఆర్థిక సంవత్సరంలో ప్రతి కుటుంబానికి 51 పనిదినాలను కల్పించామని చెప్పారు. దేశవ్యాప్తంగా చూసుకుంటే మిజోరాంలో 92 రోజులు పని కల్పించగా.. తర్వాతి స్థానాల్లో బెంగాల్‌, మేఘాలయా (72), కేరళ (66)లు ఉన్నాయి. అలాగే గతేడాది 7.7 కోట్ల మందికి ఉపాధి హామీ కింద పని కల్పించామని తోమర్‌ వివరించారు. ఎంఎన్‌ఆర్‌ఈజీఏ అనేది డిమాండ్‌ ఆధారిత వేతనాలు కల్పించే కార్యక్రమమనీ, దీనిని పారదర్శకంగా అమలు చేయడానికి కృషి చేస్తున్నామని ఆయన చెప్పడం కొసమెరుపు.

మరోవైపు ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏలో యువత శాతం అనూహ్యంగా పెరుగుతున్నది. గతంతో పోలిస్తే 2018-19లో ఉపాధి హామీ చట్టంలో పనిచేసే 18నుంచి 30ఏండ్లలోపు యువత 9.10 శాతం పెరిగిందని తోమర్‌ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పనుల్లో 18-30 ఏండ్లలోపు వారు 2017-18లో 58.7లక్షల మంది ఉండగా, 2018-19లో ఆ సంఖ్య 70.74 లక్షలకు చేరింది. కాగా, దీనిపై పలువురు ఆర్థిక విశ్లేషకులు స్పందిస్తూ.. ఉపాధి హామీ పనుల్లో యువత పెరగడం దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యకు నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి ఆర్థిక అనాలోచిత నిర్ణయాలతో దేశంలో నిరుద్యోగ సమస్య మునుపెన్నడూ లేనంతగా పెరిగిపోయిందని వారు చెబుతున్నారు. అలాగే దేశ ఆర్థిక స్థితి సైతం నానాటికీ దిగజారుతున్నదని వారు తెలిపారు.

ఫలితంగా కొద్దిరోజులుగా ఆర్థిక మందగమనంతో అనేక మంది తమ ఉద్యోగాలు కోల్పోయారని విమర్శించారు. పట్టణాల్లో ఉద్యోగాలు కోల్పోయిన యువత గ్రామాలకు చేరుకుని ఉపాధిహామీ పనుల్లో చేరి బతుకులు వెల్లదీస్తుందని వారు అంటున్నారు. నిరుద్యోగిత గ్రామీణ భారతానికీ వ్యాపించిందనడానికి ఇదే నిదర్శనమని నేషనల్‌ స్టాటిస్టికల్‌ కమిషన్‌ మాజీ చైర్మెన్‌ ప్రణవ్‌ సేన్‌ వ్యాఖ్యానించారు.

నత్తనడకన పీఎంఎయూ
ఇక దేశంలో ఇండ్లు లేనివారందరికీ ఇండ్లు కట్టించేందుకు ప్రవేశపెట్టిన పీఎం ఆవాస్‌ యోజన (గ్రామీణ) నత్తనడకన నడుస్తున్నది. గతంలో ఉన్న ఇందిరా ఆవాస్‌ యోజనాను పేరు మార్చి 2016లో పీఎంఎయూగా నామకరణం చేసిన మోడీ సర్కారు.. మొదటి ఫేజ్‌ (2016-2019) లో దీనికింద 3,27,552 ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ అందులో 1,9,136 గృహాలను మాత్రమే కట్టించింది. ఇక రెండో ఫేజ్‌ (2019-2022)లో 2 లక్షల ఇండ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా నిర్దేశించుకోగా.. అందులో ఇప్పటివరకు నిర్మించినవి 472 మాత్రమే.

Courtesy Navatelangana…

RELATED ARTICLES

Latest Updates