ఆశా వర్కర్ ఒక రోజు జీవితం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

Saroj and Nikhit Agrawal

ప్రస్తుతం కరోనా మహమ్మారి అంతటా విస్తరిస్తున్న సందర్భంలో ప్రజలకి చేరువవ్వడానికి మరియు వారిలో అవగాహన కలిగించడానికి బీహార్ అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్స్(ఆశా వర్కర్లు) సహాయం తీసుకుంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకీ,ఆరోగ్య సంరక్షణా వ్యవస్థకీ మధ్య వారధిలా ఉంటూ ముందుండి పనిచేయడంలో ఆశా వర్కర్లు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. వారంతా తాము నివసించే ప్రాంతాల్లోనే సేవలు చేస్తారు కాబట్టి ఆయా ప్రాంతాల్లో అవసరాలేమిటనే విషయం వారికి తెలుస్తుంది. లాక్ డౌన్ వల్ల పౌరులెవరూ ఇళ్లనుంచి బయటకి రాకపోవడంతో పూర్తిగా స్తంభించిపోయిన మన దేశంలో ఆశా వర్కర్లే ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 8 వరకూ తమకి కేటాయించిన వార్డుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.

పితృస్వామ్య వ్యవస్థలోని ప్రభుత్వ,ప్రైవేటు రంగాల్లో బాధ్యతలు నిర్వర్తించాల్సి రావడం వారి పరిస్థితుల్ని మరింత జటిలం చేసాయి. బీహార్ లోని సమస్తిపూర్ జిల్లా,రామ్ పూర్ జలాల్పూర్ పంచాయతీకి చెందిన సీమా దేవి అనే ఆశా వర్కర్ మాట్లాడుతూ తన విధుల గురించి తెలుసుకున్న వెంటనే ఇంటినుంచి బయటకి వెళ్లడానికి తన భర్త అనుమతించడం లేదని వాపోయింది.

భర్త సహకారం లేకపోయినా సీమా రోజూ లేత గులాబీ రంగు చీర(ఆశా వర్కర్ల అధికారిక వేషధారణ) ధరించి ప్రతిరోజూ తాను లక్ష్యంగా పెట్టుకున్న 25 ఇళ్లని సందర్శిస్తుంది. “ఇది నేను నిర్వర్తించాల్సిన బాధ్యత. భయంగా ఉన్నా సరే నేను వెనుకడుగు వేయకూడదు” అంటున్నారామె. “నా గురించి ఉన్న భయం కంటే పిల్లలకీ,అత్తగారికీ ఎక్కడ నా వల్ల జబ్బు వ్యాపిస్తుందోనని నాకు భయంగా ఉంది” అని వ్యాఖ్యానించారు.

కరోనా ప్రబలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆశా వర్కర్లకి పలు పనులు అప్పగించారు. “సాధారణ రోజుల్లో ప్రకటనా పత్రాలు పంచడమే కాకుండా కోవిడ్-19 రోగులతో కాంటాక్ట్ లోకి వచ్చిన వారిని,బంధువులని గుర్తించే పని మాదే. మా వార్డుల్లో నుంచి ఎవరైనా బయటి ప్రాంతాలకి వెళ్లిన లేక బయటనుంచి ఇక్కడికొచ్చిన వాళ్ల వివరాలు సేకరించడం కూడా చేస్తాము” అని సీమా చెప్పుకొచ్చారు. తన సర్వేని పూర్తి చేసాక ఆ సమాచారాన్నంతా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తన పై అధికారికి అందజేస్తే వారు ఆ సమాచారాన్ని తీసుకెళ్లి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(PHC)లో సమర్పిస్తారు.

అంతేకాకుండా రాష్ట్రం సమర్పించిన పద్ధతిని అనుసరించి కరోనా లక్షణాలు గల వ్యక్తులని గుర్తించేందుకు ఇళ్లన్నింటినీ పరిశీలించాల్సిందిగా ఆశా వర్కర్లకి ఆదేశాలు అందాయి. ఆశా వర్కర్లు తాము పనిచేసే వార్డులోని అన్ని ఇళ్ల గుమ్మాల దగ్గరా కోవిడ్-19 లక్షణాలు,తీసుకోవాల్సిన జాగ్రత్తల సమాచారం కలిగిన ఎ3 సైజు పోస్టర్లని అంటించాలి.

సీమా తమ రోజువారీ విధుల గురించి మరిన్ని వివరాలు అందజేస్తూ వ్యాధి లక్షణాలు గల వారి ప్రయాణాల చరిత్రకి సంబంధించిన సమాచారాన్ని ఇతర అధికారులకి తెలియజేస్తామన్నారు. “ఎవరైనా వ్యక్తులు ప్రయాణాల చరిత్ర కలిగి ఉన్నట్లైతే లేదా వ్యాధి లక్షణాలు కలిగి ఉంటే వెంటనే మేము ఆగ్జిలియరీ నర్స్ మిడ్ వైఫ్ (ఏ ఎన్ ఎం)కి తేలియజేస్తాము. వారేమో బ్లాక్ ఆఫీస్ కి సమాచారమిస్తారు” అని సీమా తెలిపారు. తర్వాత బ్లాక్ ఆఫీసు నుంచి ఓ వైద్య బృందం వచ్చి అనుమానిత రోగికి పరీక్షలు నిర్వహించి తదుపరి చర్యలకి ఉపక్రమించాలి. ఆ వైద్య బృందానికి అనుమానితుల ఇళ్లని చూపించాల్సింది కూడా ఆశా వర్కర్లే. ముఖియాలనే పిలవబడే తమ వార్డు పెద్దలతో కలిసి ప్రతి ఇంటికీ చేతితో తయారుచేసిన ఫేస్ మాస్కులు,ఒక సబ్బుని పంచాలి.

బీహార్ లో మొత్తం జనాభాకి వైద్యుల సంఖ్య నిష్పత్తి మరీ దారుణంగా 1:3207(ఇది దేశ సరాసరి 1:1456 కంటే కూడా తక్కువే) గా ఉంది. కరోనా వ్యాప్తి ప్రారంభం కాగానే గ్రామీణ ప్రాంతాల వైద్యులు తమ ద్వారాలు మూసేసుకోవడంతో ఇప్పటికే శిథిలావస్థకు చేరుకున్న ప్రజా ఆరోగ్య సంరక్షణా వ్యవస్థ కరోనా వైరస్ ఉపద్రవ నిర్వహణపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించింది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఆశా వర్కర్లు మాతాశిశు సంరక్షణ,క్షయ మరియు ఇతర వ్యాధుల విషయంలో ఆయా వార్డుల్లో అవగాహనని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

అంతేకాకుండా ఒక్కోసారి వారు అస్సలు సహకారం అందించని ప్రజల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.సమస్తిపూర్ జిల్లాకే చెందిన మరో ఆశా వర్కర్ హీరా దేవి మాట్లాడుతూ “వాళ్లు సర్వే చేయడానికి రాలేదు. పీ హెచ్ బీ లకి మన పేర్లు అందజేస్తారు. తర్వాత మనల్ని ఆ భయంకరమైన కేంద్రాలకి తీసుకెళతారు” లాంటి వ్యాఖ్యలు వినిపిస్తాయని తెలిపారు. కొన్ని ఇళ్లవారైతే ఆశా వర్కర్లతో సంభాషించడానికి నిరాకరిస్తూ వారి ఇళ్లముందు “ప్రవేశం లేదు” అని బోర్డులు కూడా ఏర్పాటు చేసారు. ఇంకొందరైతే కనీసం తలుపులు కూడా తెరవడం లేదని ఆమె తెలియజేసారు.

అనుమానిత రోగులు మొట్టమొదటగా కాంటాక్ట్ లోకి వచ్చేది ఆశా వర్కర్లతోనే. ఇప్పటివరకూ వారు ఎలాంటి రక్షణాత్మక పరికరాలు లేకుండానే బయటకెళ్లి విధులు నిర్వర్తించారు. ఆశా వర్కర్లు తమకి రక్షణా పరికరాలు అందజేయాలని కోరినా కూడా అలాగే విధులు కొనసాగించాలని వారికి ఆదేశాలొచ్చాయి. ఆరోగ్య శాఖలో పనిచేసే సభ్యులుగా ప్రస్తుత పరిస్థితుల ప్రాముఖ్యత ఏమిటో వారు అర్థం చేసుకోవాల్సిందిగా వారికి సమాధానం వస్తోంది. “విధి నిర్వహణలో భాగంగా తమకి ఫేస్ మాస్కులు ఇప్పించాల్సిందిగా కోరితే మాకు మాస్కులు,రక్షణాత్మక పరికరాలు అందిన వెంటనే మీకు ఇస్తాం. నిర్దిష్టమైన తేదీ లోపు ఇవ్వగలమని మేము చెప్పలేము” అని సమాధానం వచ్చిందని 45 ఏళ్ల సిమలా దేవి అనే ఆశా వర్కర్ అంటున్నారు. పనిచేసే చోట్ల అందరికీ దూరంగా ఉండాలని,ఎక్కడా కూర్చోవద్దని వారికి సూచనలు అందాయి. “ఒక్కోసారి నాకు తెలీకుండానే ముఖాన్ని తడుముకుంటున్నాను. మళ్లీ ముఖం కడుక్కోవడానికి నీటి కోసం వెతుకుతున్నాను. విధి నిర్వహణ పూర్తవగానే మా ఇంటి వెనకాల ఉన్న బాత్ రూమ్ లో స్నానం చేసి,బట్టలు మార్చుకున్నాకే ఇంట్లో అడుగుపెడుతున్నాను”అని ఆమె చెబుతున్నారు. సిమలా లాంటి అనేక మంది వయసు పైబడిన ఆశా వర్కర్లు తమకి ఉండే ఆరోగ్య సమస్యల కారణంగా అధిక ప్రమాదం గల వారి వర్గానికి చెందుతారు.

అదృష్టవశాత్తూ బీహార్ లో ఇప్పటివరకూ ఒక్క ఆశా వర్కరుకి కూడా కరోనా సోకలేదు. ఐతే కరోనా లాంటి ఉపద్రవాల సమయంలో ఎలా వ్యవహరించాలనే విషయంపై ఆశా వర్కర్లకి ఎలాంటి శిక్షణా,అనుభవం లేవని మనం గుర్తించాలి. ఈ ఉపద్రవం కొనసాగే మూడు నెలల కాలానికి వారికిచ్చే జీతం వెయ్యి రూపాయలు పెంచడంతో పాటుగా ప్రతీ వ్యక్తికీ 50 లక్షల విలువ చేసే వైద్య బీమా అందుబాటులోకి తీసుకొచ్చారు. “ఇలాంటి ఎన్నడూ ఊహించని,అనుభవంలోకి రాని పరిస్థితుల్లో సేవలు అందిస్తున్నందుకు ఒక్కోసారి గర్వంగా ఉంటుంది. కానీ నా జీవితాన్నైతే ప్రమాదంలో పెడుతున్నాను.నేను ఆరోగ్యంగా బ్రతకలేకపోతే ఆ 3000 రూపాయలు మాత్రం ఏమి చేసుకుంటాను?” అని సిమలా దేవి ప్రశ్నిస్తున్నారు.

ఆరోగ్య శాఖకి చెందిన అధికారుల వ్యవస్థలో మరీ దిగువన ఉండడం వల్లే ఈ అతి ముఖ్యమైన మహిళా వర్కర్లు అందిస్తున్న సేవలు,నాయకత్వం లక్షణాలకి గుర్తింపు లభించడం లేదేమో!. ఐతే ప్రస్తుతం మనందరం ఎదుర్కొంటున్న సంక్షోభం చూసాకైనా ఇకనుంచీ “అందరికీ పోషకాహారం”,”అందరికీ ఆరోగ్య సంరక్షణ” అందజేసే భవిష్యత్తు రూపకల్పన కోసం మాత్రమే కాకుండా కిందిస్థాయి ఉద్యోగులు,వర్కర్ల సేవలని కూడా గుర్తించి సామాజికంగా,ఆర్థికంగా వారికి మరింత మేలు చేసే దిశగా కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాలి.

Courtesy The Wire

RELATED ARTICLES

Latest Updates