ఒక్కరోజులోనే 167 కేసులు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 -45కు చేరిన మృతుల సంఖ్య
– దేశంలో ఉధృతమవుతున్న కరోనా మహమ్మారి
– తెలంగాణలో 77 కేసులు
– దేశమంతటా ‘మర్కజ్‌’ దడ
– జార్ఖండ్‌, అసోంలలో తొలి కేసు నమోదు
– శానిటైజర్లు, మాస్కుల కొరత రానీయం : కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వ్యాప్తి భారత్‌లో నానాటికీ తీవ్రతరమవుతున్నది. గడిచిన రెండ్రోజుల్లోనే 350కి పైగా కేసులు నమోదుకావడంతో దేశంలో కోవిడ్‌-19 పాజిటివ్‌ తేలినవారి సంఖ్య 1418 కి చేరింది. మంగళవారం ఒక్కరోజే 167 కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తమయ్యాయి. మరోవైపు నిన్నా మొన్నటి దాకా వలస కార్మికుల వెతలు, లాక్‌డౌన్‌పై ప్రజల కష్టాల చుట్టూ తిరిగిన చర్చంతా ఒక్కసారిగా ఢిల్లీలోని ‘మర్కజ్‌’పైకి మళ్లింది. గతనెల్లో అక్కడ జరిగిన మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్నవారిలో చాలామందికి వైరస్‌ సోకిందనే అనుమానంతో.. వారందరినీ గుర్తించి తక్షణమే వారిని నిర్బంధ కేంద్రాలకు చేర్చాలని ఆయా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయి. మంగళవారం ఒక్కరోజే ఈ మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 13 కాగా.. మొత్తంగా 45కి చేరింది. ఇక, కరోనా సోకి 123 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

మర్కజ్‌ అలజడి
ఉన్నట్టుండి కరోనా పాజిటివ్‌ కేసులు పెరగడానికి మర్కజ్‌లో జరిగిన మత ప్రార్థనలే అని ప్రచారం జరుగుతున్నది. గతనెల 10న తబ్లిగ్‌ ఏ జమాత్‌ అనే సంస్థ అక్కడ నిర్వహించిన మత ప్రార్థనల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 2,130 మంది దాకా హాజరయ్యుంటారని కేంద్ర హౌంశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి ఇండోనేషియా, మలేషియా, థారులాండ్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌, కిజిగిస్తాన్‌ నుంచీ పలువురు హాజరయ్యారనీ, వీరి ద్వారానే ఇక్కడున్న వారికి కరోనా సోకి ఉంటుందని అనుమానాలు నెలకొన్నాయి. కార్యక్రమం అయిపోయినా కూడా మర్కజ్‌ లో దాదాపు వేయి మంది వరకు ఉన్నారనీ, వారందరూ కరోనా బారిన పడి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమానికి వెళ్లొచ్చినవారందరూ తక్షణమే పరీక్షలు చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. అలాగే వారిని కలిసినవారు కూడా ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండాలని హెచ్చరిస్తున్నాయి. ఢిల్లీలో ఈ కార్యక్రమానికి హాజరైన దాదాపు 441 మందిని క్వారంటైన్‌కు చేర్చామని రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, అండమాన్‌ నికోబార్‌ దీవుల నుంచి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారని వార్తలు రావడంతో అక్కడి ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మరోవైపు మర్కజ్‌ విషయంలో నిర్లక్ష్యంపై ఢిల్లీ ప్రభుత్వం సీరియస్‌ అయింది. దాని నిర్వాహకులు, అనుమతి మంజూరు చేసిన అధికారులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలపై మంగళవారం మర్కజ్‌ అధికార ప్రతినిధులు స్పందించారు. ఈ 24న లాక్‌ డౌన్‌ పై నోటీసు ఇచ్చారని వివరించారు. అంతకు ముందే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు స్వస్థలాలకు చేరుకున్నారని తెలిపారు. అయితే, రైళ్ల, విమానాలు బంద్‌ కావడం, వాహనాలు లేకపోవడంతో కొద్ది మంది ఇక్కడే ఉండిపోయారని చెప్పారు.

మాస్క్‌ల కొరత రానీయం
దేశంలో మాస్క్‌లు, శానిటైజర్ల కొరత రానీయమని కేంద్ర ఆరోగ్య, వైద్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ… వైద్య సిబ్బందికి, ప్రజలకు మాస్క్‌లు, శానిటైజర్ల కొరత రానీయమని చెప్పారు. అయితే అందరూ మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదనీ.. దగ్గు, జలుబు ఉన్నవారు మాత్రం తప్పకుండా మాస్క్‌లు కట్టుకోవాలని తెలిపారు.

జార్ఖండ్‌, అసోంలలో తొలికేసు
ఇప్పటికే దేశంలోని చాలా ప్రాంతాలకు విస్తరించిన కరోనా.. తాజాగా జార్ఖండ్‌లోనూ కాలు మోపింది. జార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఓ మహిళకు కరోనా సోకింది. ఆమె ఇటీవలే మలేషియా నుంచి వచ్చారని పోలీసులు తెలిపారు. అసోంలోనూ ఓ వ్యక్తికి పాజిటివ్‌ వచ్చినట్టు తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

రాష్ట్రాల వారీగా కేసులు..
మర్కజ్‌ కలకలంతో దేశమంతటా కరోనా పాజిటివ్‌ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్రలో మంగళవారం ఏకంగా 70 కొత్త కేసులు నమోదుకాగా మొత్తం కేసుల సంఖ్య 300కి చేరింది. తర్వాతి స్థానాల్లో కేరళ (234), యూపీ (101), కర్నాటక (98), ఢిల్లీ (97), రాజస్థాన్‌ (93) తెలంగాణ (77), తమిళనాడు (74), గుజరాత్‌ (73), మధ్యప్రదేశ్‌ (66), జమ్మూకాశ్మీర్‌ (55) ఉన్నాయి. మంగళవారం మహారాష్ట్రతో పాటు రాజస్థాన్‌లో 14, ఆంధ్రప్రదేశ్‌లో 17, మధ్యప్రదేశ్‌లో 19, యూపీలో 5, తమిళనాడు, కేరళలో 7, బెంగాల్‌లో 5 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక మర్కజ్‌ కేంద్రంగా ఉన్న ఢిల్లీలో గడిచిన రెండ్రోజుల్లోనే కేసులు పెరిగినట్టు సీఎం కేజ్రీవాల్‌ తెలిపారు. కాగా ఇటీవల ఇరాన్‌ నుంచి వచ్చి రాజస్థాన్‌లోని జైసల్మీర్‌ ఆర్మీ క్వారంటైన్‌లో ఉంటున్న వారిలో తొమ్మిది మందికి పాజిటివ్‌ ఉందని తేలింది.

చీలమండకు గాయమైనా…
దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా రవాణా పూర్తిగా బంద్‌ అవడంతో రాజస్థాన్‌లో ఉన్న తన ఇంటికి మధ్యప్రదేశ్‌ నుంచి కాలినడకన బయలుదేరిన భన్వర్‌లాల్‌ చీలమండకు తీవ్ర గాయమైంది. తను పని చేసే చోటు నుంచి 740 కిలోమీటర్ల దూరంలో ఉన్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లడానికి వాహనాలేమీ లేకపోవడంతో భన్వర్‌లాల్‌ కాలిబాటనే ఎంచుకున్నాడు. సుమారు 500 కిలోమీటర్ల దాకా ఏదో ఒక వాహనం మీద వచ్చిన అతడు.. పోలీసులు అవీ కూడా బంద్‌ చేయడంతో మిగిలిన దూరాన్ని నడిచే వెళ్తున్నాడు. దీంతో ఎండల దాటికి అతడి కుడి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. అయినా అతడు మాత్రం తన నడకను ఆపలేదు.

కరోనా వ్యాప్తి నిలకడగానే ఉంది : కిషన్‌రెడ్డి
అమెరికా, ఇటలీ, జర్మనీ, ఇంగ్లాడు వంటి ప్రపంచ దేశాలతో పోలిస్తే, భారత్‌ లో కరోనా ప్రభావం తక్కువగానే ఉందని కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే భారత్‌లో కరోనా వ్యాప్తిని అడ్డుకుంటామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే వైరస్‌ ను తరిమికొట్టగలమన్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో గల మర్కజ్‌ సంస్థ మత ప్రచారాల కారణంగా ప్రస్తుతం దేశంలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని కిషన్‌ రెడ్డి తెలిపారు. ఇందులో 90 శాతం మందిని ఇప్పటికే ప్రత్యేక బస్సుల ద్వారా క్వారంటైన్‌కు తరలించినట్టు చెప్పారు. ఈ ఘటనలో ప్రస్తుతం ఎవరినీ అరెస్ట్‌ చేయలేదని వెల్లడించారు.

రైల్వే శాఖ సన్నద్దం … లాలాగూడ వర్క్‌షాప్‌లో ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్‌ బ్యూరో : కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రైల్వే శాఖ మమ్ముర ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా 20 వేల కోచ్‌లను ఐసోలేషన్‌ కేంద్రాలుగా మార్చాలని నిర్ణయించింది. ఈ కేంద్రాల్లో 3.2 లక్షల పడకలు ఏర్పాటు చేశామని తెలిపింది. ఇప్పటికే 5 వేల కోచ్‌లలో 80 వేల పడకలను రైల్వే శాఖ సిద్ధం చేసింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వేలోనూ దాదాపు 450కు పైగా కోచ్‌లను ఇందుకోసం సిద్ధం చేస్తున్నారని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌ లాలాగూడ వర్క్‌షాప్‌లో పనులు పూర్తి చేసుకొని సిద్ధమైన ఓ బోగీ ఫోటోలను మంగళవారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు విడుదల చేశారు. ప్రతి కోచ్‌లో ఆరు బెడ్లతో ఉన్న అరను రోగికి అవసరమైన కేంద్రంగా మార్చారు. ప్రతి కోచ్‌లో ఉన్న 9 అరలను తొమ్మిది కేంద్రాలుగా మార్చుతారు. మీది బెర్త్‌, మధ్యబెర్త్‌ను తొలగించి, కింది బెర్త్‌లను యధావిధిగా ఉంచారు. ప్రతీ కోచ్‌లో ఉండే ఇండియన్‌ మరుగుదొడ్లను బాత్‌రూంలుగా మార్చారు. అలాగే రోగి వైద్యానికి కావాల్సిన పరికరాలను అమర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కేంద్రాల్లో మొదటి దశలో ఒక్క రోగిని మాత్రమే ఉంచనున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువై కేసులు అధికమైతే ఇద్దరు రోగులను ఉంచేలా వీటిని తయారు చేశారు.

మర్కజ్‌ సమ్మేళనం వాస్తవాలు…
మర్కజ్‌ చట్ట ప్రకారం అనుమతితో సమ్మేళనంజరిగింది. నిజాముద్దీన్‌ పోలీస్‌స్టేషన్‌ ఆనుకునే ఉన్న భవనంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని 13 నుంచి 15 దాకా నిర్వహించారు. అది ముగిసిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవడానికి అధికారుల అనుమతి కోరినా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇవ్వకుండా ఉద్దేశపూ ర్వకంగా నిర్లక్ష్యం ప్రదర్శించింది. జనతా కర్ఫ్యూ కంటే ముందే ఇది పూర్తైంది. అయితే ఇదే విషయమై వారిని మర్కజ్‌లోనే ఉంచి వేధిస్తున్నారనీ, తాము అక్కడ్నుంచి వెళ్లిపోతామని చెప్పినా ఇబ్బందులు పెడుతున్నారని పీఎంవోకు, కేంద్ర హౌంమంత్రిత్వ శాఖకు, విదేశాంగ మంత్రిత్వ శాఖకు బాధితులు లేఖలు రాశారు. దీనిపై వారెవరూ స్పందించలేదని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా, మరోవైపు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ మాత్రం లాక్‌డౌన్‌ సమయంలో మతపరమైన సమ్మేళనం నిర్వహించినా కేంద్రం దానికి అభ్యంతరాలు తెలపలేదు. అంతేగాక మార్చి 1 నుంచి 15 మధ్య కాలంలో దేశం మొత్తం మీద వందలాది మత సమ్మేళనాలు జరిగినా దాని గురించి పల్లెత్తు మాట మాట్లాడని వాళ్లు.. ఒక వర్గాన్ని కావాలనే టార్గెట్‌ చేస్తున్నారని ప్రజాస్వామ్యవాదులు బావిస్తున్నారు. కరోనా కట్టడిలో విఫలం అయిన ప్రభుత్వం దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ అంశాన్ని ముందుకు తెస్తున్నదని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates