బువ్వ కష్టం రేషన్ ఇప్పించండి సారు..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో క్షేత్రస్థాయిలో పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా కాలంలో వారి కష్టాలు రెట్టింపయ్యాయి. రెక్కాడితే గాని డొక్కాడని బడుగుజీవులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వచ్చే రేషన్‌ బియ్యం అందనిద్రాక్షగా మారింది. లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆయా వర్గాల వారీగా ఆదుకునే కార్యాచరణ ప్రకటించింది. అయితే దానికి తగినట్టు స్పష్టమైన మార్గదర్శకాలు రాకపోవడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రేషన్‌ కార్డు కలిగిన వారికి బియ్యం అందిస్తున్నప్పటికీ, ఇప్పటికే రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకుని మంజూరు కాని వారికి కూడా బియ్యం ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యం అధికారులు, రేషన్‌ డీలర్ల మధ్య సమన్వయలోపంతో అమలుకు నోచుకోవడం లేదు.సీఎం సారు రేషన్‌ ఇప్పించండని లక్షలాది కుటుంబాలు విన్నవిస్తున్నాయి.

 -దరఖాస్తు చేసుకున్న వారికీ ఉచిత బియ్యం ఇస్తామన్న సీఎం
– స్పష్టమైన ఆదేశాలు రాలేదంటున్న డీలర్లు
– లాక్‌డౌన్‌లో నిరు పేదల ఆకలి గోస…

రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డుల కోసం 5,63,139 మంది ధరఖాస్తు చేసుకున్నట్టు అధికారిక సమచారం. గత ఏడాది కాలంగా వెబ్‌సైట్‌, ఇతర సాంకేతిక సమస్యల కారణంగా కార్డు పొందలేకపోయిన వారితో పాటు ఆయా కారణాలరీత్యా తాత్కాలికంగా కార్డు తిరస్కరించబడిన వారు దాదాపు ఇదే సంఖ్యలో ఉంటారని
సమాచారం. ఒక్క ఆదిలాబాద్‌ జిల్లాలోనే ఇలాంటి వారి సంఖ్య 35 వేల మంది ఉన్నారు. ఇక మిగతా జిల్లాల్లో ఎంత మంది ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఏ లెక్కన చూసినా ఇలాంటి కుటుంబాలు రాష్ట్రంలో ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల మంది వరకు ఉంటారని అంచనా. కుటుంబ సభ్యులతో కలుపుకుని 25 లక్షల నుంచి 30 లక్షల మంది వరకు ఉంటారని భావిస్తున్నారు. సాంకేతిక లోపాల కారణంగా రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోని వారు, ఇప్పటికే కార్డు ఉన్న తిరస్కరణకు గురైన వారితో పాటు దరఖాస్తు చేసుకున్నా ఇంకా కార్డు మంజూరు కాని లక్షలాది కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యం కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. కార్డుదారులకు నేరుగా బియ్యం అందిస్తుండగా, భవన నిర్మాణ కార్మికులు తదితర తరగతులకు తహశీల్దార్‌ గుర్తింపు ద్వారా అందిస్తున్నా, పెండింగ్‌లో ఉన్న వారి విషయంలో ఏమి చేయాలో అర్థం కావడం లేదని డీలర్లు చెబుతున్నారు.రేషన్‌ డీలర్లు బియ్యం ఇచ్చేందుకు తిరస్కరిస్తుండడంతో దరఖాస్తుదారులు అధికారులను సంప్రదిస్తున్నా వారి నుంచి కూడా స్పష్టమైన సమాధానం దొరకడం లేదు. బియ్యం పంపిణీకి సంబంధించి ఏమైనా సమస్యలుంటే సంప్రదించేందుకు ఇచ్చిన హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేస్తే కూడా రెండు రోజులు ఆగాలంటున్నారని బాధితులు వాపోతున్నారు. మరోవైపు బాధితులు ఎమ్మార్వో కార్యాలయాల చుట్టూ తిరుగుతుండడంతో కొన్ని కార్యాలయాల వద్ద రేషన్‌ కార్డు లేని వారికి బియ్యం ఇవ్వబోమని నోటీస్‌ అంటించారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎవ్వరినీ ఉపవాసం ఉండనీయమనీ, అందరిని ఆదుకుంటామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అమలుకొచ్చేసరికి ఆలస్యం జరుగుతుండడం గమనార్హం. ఇప్పటికైనా వీరి విషయంలో స్పష్టమైన ఆదేశాలివ్వాలని విజ్ఞప్తులు వస్తున్నాయి.

మార్గదర్శకాలు రాలేదు..
రేషన్‌ కార్డు దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధించి ఇంకా ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. ప్రభుత్వం నుంచి అలాంటి ఆదేశాలు వస్తే రేషన్‌ ఇస్తాం.
– బాల మాయాదేవి (చీఫ్‌ రేషనింగ్‌ అధికారి)

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates