ప్రాణవాయువు తీసేశారు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఆక్సిజన్‌ అయిపోయిందన్నారు..
చనిపోవడానికి గంట ముందు బంధువులతో కరోనా బాధితుడి ఆవేదన
గాంధీ ఆసుపత్రిలో ఘటన
ఇలాంటి పరిస్థితిలోనే గర్భిణి మృతి

నేరేడ్‌మెట్‌, గాంధీ ఆసుపత్రి, కామారెడ్డి వైద్యవిభాగం, సనత్‌నగర్‌ న్యూస్‌టుడే: ఊపిరి అందడం లేదు.. ఊపిరి అందడం లేదు.. అంటూనే ఆ బాధితులు తుదిశ్వాస విడిచారు. ఒకరు గాంధీ ఆసుపత్రిలో, మరొకరు అంబులెన్స్‌లో. ఒకరు 33 ఏళ్ల యువకుడు కాగా.. మరొకరు 9 నెలల నిండు గర్భిణి. ఆక్సిజన్‌ పెట్టాలని వేడుకున్నా.. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వహించారని ఆయా కుటుంబాలు ఆరోపించాయి. మరో ఘటనలో ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిలో చేరిన ఓ తెదేపా నేతకు.. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాలని సిబ్బంది పంపించేశారని ఆయన కుటుంబసభ్యులు ఆరోపించారు. ఆయన ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లినా చికిత్స అందక ప్రాణాలు విడిచారు. వివరాలివీ..

గొల్ల శ్రీధర్‌(33) హైదరాబాద్‌ నేరేడ్‌మెట్‌ ఠాణా పరిధిలోని సాయినగర్‌లో ఉంటూ ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. అతనికి భార్య, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. అయిదు రోజుల క్రితం శ్వాస సంబంధిత సమస్యలతో ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ మూడు రోజుల పాటు చికిత్స చేశారు. కరోనా పాజిటివ్‌గా తేలడంతో మంగళవారం మధ్యాహ్నం గాంధీకి తరలించారు. అప్పటి నుంచి శ్వాస సంబంధ సమస్యతో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు బంధువులకు ఫోన్‌ చేసి ‘ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అయిపోయిందన్నారు..వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం గంట వ్యవధిలోనే మృతి చెందాడని కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపించారు. శ్రీధర్‌ స్వస్థలం కర్నూలు జిల్లా మద్దనగరి బీసీ కాలనీ. అనాథ అయిన స్వరూపను మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. గత ఏడాది అక్టోబరులో వీరు నేరేడ్‌మెట్‌కు వచ్చారు.

ఆక్సిజన్‌ కొరత లేదు: సూపరింటెండెంట్‌
గాంధీ ఆసుపత్రిలో ఆక్సిజన్‌కు ఎలాంటి కొరత లేదని సూపరింటెండెంట్‌ ఎం.రాజారావు తెలిపారు. ఆసుపత్రిలో 2,660 మంది రోగులకు నిత్యం ఆక్సిజన్‌ అందించే సామర్థ్యం ఉందన్నారు. పొరుగు సేవల సిబ్బంది ఆందోళన చేపట్టిన నేపథ్యంలో నర్సుల ద్వారా అందాల్సిన సేవల్లో జాప్యం చోటుచేసుకొని మృతి చెంది ఉండొచ్చన్నారు.

నిండు గర్భిణి పట్ల నిర్లక్ష్యం!
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 10న ఒకే కుటుంబంలో ఏడుగురికి కొవిడ్‌ నిర్ధారణయింది. ఇందులో ఓ గర్భిణి ఉన్నారు. వీరందరిని ఇంట్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. గర్భిణికి ప్రస్తుతం తొమ్మిది నెలలు. మంగళవారం రాత్రి ఆమెకు ఊపిరి తీసుకోవడం కష్టమవడంతో జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. శ్వాస ఆడటం లేదని.. ఆక్సిజన్‌ పెట్టాలని వేడుకున్నా వైద్యులు స్పందించలేదని కుటుంబీకులు ఆరోపించారు. రోగి పరిస్థితి విషమిస్తోందని వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. అంబులెన్స్‌లో గర్భిణిని హైదరాబాద్‌ తీసుకెళుతుండగా.. మార్గమధ్యంలో రామాయంపేట దాటగానే మృతి చెందింది. ఈ విషయమై జిల్లా ఆసుపత్రుల పర్యవేక్షణాధికారి అజయ్‌కుమార్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా కొవిడ్‌ కారణంగా గర్భిణి శ్వాస వ్యవస్థపై వైరస్‌ తీవ్ర ప్రభావం చూపిందన్నారు. సమస్య జటిలమైనప్పుడు ఇక్కడ వైద్యం అందించే పరిస్థితులు లేవన్నారు. ఆక్సిజన్‌ అందకనే ప్రాణం పోయిందనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.

ఆసుపత్రులన్నీ తిరిగే లోపే..
 సకాలంలో వైద్యం అందక తెదేపా నేత మృతి

సనత్‌నగర్‌, న్యూస్‌టుడే: సనత్‌నగర్‌కు చెందిన పి.రామ్‌కుమార్‌ తెదేపా నగర కార్యదర్శిగా పనిచేశారు. ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురికావడంతో కొవిడ్‌ పరీక్ష చేయించుకున్నారు. కరోనా నెగిటివ్‌ రాగా, టైఫాయిడ్‌ ఉన్నట్లు తేలింది. శ్వాసనాళంలో కఫం పేరుకుపోవడంతో మంగళవారం మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చేరాక.. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాలని సిబ్బంది చెప్పారు. తాను బాగానే ఉన్నానని చెప్పినా.. సిబ్బంది ప్రైవేటుకు వెళ్లమని ఒత్తిడి చేశారని కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో బయటికి వచ్చిన రామ్‌కుమార్‌కు ఆసుపత్రి ప్రాంగణంలో కొందరు దళారులు తారసపడి సికింద్రాబాద్‌, బేగంపేటలోని ప్రైవేటు ఆసుపత్రులకు తిప్పారు. అక్కడా గదులు ఖాళీ లేవని, ఆక్సిజన్‌ లేదని చెప్పారు. బేగంపేట ప్రైవేటు ఆసుపత్రిలో వీరి ఆందోళన గమనించిన ఓ అంబులెన్స్‌ డ్రైవర్‌ ఈసీఐఎల్‌లో తనకు తెలిసిన ఆసుపత్రికి తీసుకెళతానని చెప్పాడు. బేగంపేట నుంచి ఈసీఐఎల్‌ ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి రూ.10 వేలు డిమాండ్‌ చేశాడు. గత్యంతరం లేక రూ.10 వేలు అంబులెన్స్‌కు చెల్లించి ఈసీఐఎల్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లగా.. రూ.లక్ష చెల్లిస్తే బెడ్‌ ఇస్తామని, చికిత్స కొనసాగిస్తున్నప్పుడు అయ్యే బిల్లులు క్రమం తప్పకుండా చెల్లించాలని షరతు పెట్టారు. తన వద్ద రూ.30 వేలే ఉన్నాయని, తరువాత సర్దుతానని చెప్పినా వినిపించుకోలేదు. చేసేది లేక బాధితుడిని మంగళవారం రాత్రికి పంజాగుట్ట నిమ్స్‌కు తీసుకొచ్చారు. అక్కడ పరిచయం ఉన్న ఓ నర్సును సంప్రదించగా రాత్రి పూట వైద్యులెవరూ అందుబాటులో లేరని, అత్యవసరానికి నెబులైజర్‌ పెట్టుకోమని చెప్పి ఇంటికి పంపించారు. ఉదయాన్నే రావాలని సూచించారు. ఇన్ని ఆసుపత్రులు తిరిగి అప్పటికే ఆరోగ్యం క్షీణించిన రామ్‌కుమార్‌ ఆ రాత్రి ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు.

విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం
రామ్‌కుమార్‌ ఆసుపత్రిలో చేరారు. మళ్లీ ఎందుకు వెళ్లిపోయారో తెలియదు. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాలని సిబ్బంది ఒత్తిడిచేసిన విషయం మా దృష్టికి రాలేదు. దీనిపై విచారణ జరిపించి, వాస్తవం ఉంటే చర్యలు తీసుకుంటాం.
– మెహబూబ్‌ఖాన్‌, ఛాతీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates