డబులయ్యేదెట్లా?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 – బడ్జెట్‌లో గ్రామీణ భారతానికి ఊతమిచ్చే కీలక పథకాల్లో నిధుల కోత
– రైతుల ఆదాయం రెట్టింపునకు చర్యలేవి!
– 16 పాయింట్ల యాక్షన్‌ ప్లాన్‌తో కష్టమేనంటున్న నిపుణులు

న్యూఢిల్లీ : దేశం మందగమనంలో కొట్టు మిట్టాడుతున్న తరుణాన రెండ్రోజుల క్రితం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ గ్రామీణ భారతాన్ని మెప్పించలేక పోయిందని విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన ‘రైతుల ఆదాయం రెట్టింపు’తో పాటు, గ్రామీణ ప్రజానీకం డిమాండ్లను నెరవేర్చడంలో ఈ బడ్జెట్‌ ఏ విధమైన ‘రోడ్‌మ్యాప్‌’నూ చూపించలేకపోయిం దని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మాం ద్యం ప్రభావం మారుమూల పల్లెలకూ తాకడంతో మునుపెన్నడూ లేని విధంగా గ్రామాలు అల్లాడు తున్నాయి. 2014 నుంచి గ్రామీణ వేతనాల వృద్ధిలో పెరుగుదల లేకపోవడం, పెద్దనోట్ల రద్దు తర్వాత అవి మరింత పడిపోవడం, జీఎస్టీ రాకతో చిన్న పట్టణాలలోని సంస్థలు మూతపడి ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది గ్రామాలనుంచే ఉండటంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్‌లో వీటిని అధిగమించేలా చర్యలు తీసుకోవాలని ఆర్థిక నిపుణులు కోరినా.. రైతుల ఆదాయం రెట్టింపునకు సరైన మార్గదర్శకాలు చేపట్టాలని సూచించినా.. కేంద్ర బడ్జెట్‌ వాటిని అందుకోవడంలో మరోసారి విఫలమైందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నిధుల కోత
గ్రామీణ రంగానికి ఈ బడ్జెట్‌లో రూ. 2.83 లక్షల కోట్లను కేటాయిం చారు. ఇది గతేడాదితో పోల్చితే 5.5 శాతం అధికం. అయితే గ్రామాల్లో నివసిస్తున్న వారికి ఉపాధి భరోసానిచ్చే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ)కు, రైతులకు పెట్టుబడి సాయం అందించే పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎంకేవై)కి కేంద్రం కోత విధించింది. పీఎంకేవైతో పాటు ప్రత్యేకంగా రైతుల కోసమే నిర్దేశించిన పీఎం ఫసల్‌బీమా యోజనా (పీఎంఎఫ్‌బీవై), పీఎం ఆశా లకూ కేటాయింపులు తగ్గించింది. పల్లె ప్రజల వినిమయ శక్తిని పెంచడంలో ‘ఉపాధి హామీ’ పాత్ర కీలకం. దీనికి నిధులు పెంచి వాటిని ప్రజ ల చేతుల్లోకి అందేలా చేయాలని నిపుణులు ఎప్పట్నుంచో సూచిస్తున్నా మోడీసర్కారు దానిని పట్టించుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉపాధి హామీకి ఈ బడ్జెట్‌ లో రూ. 61,500 కోట్లు కేటాయించగా.. అది గతేడాది వ్యయం చేసిన (రూ.71 వేల కోట్లు) దానికంటే రూ. 9,500 కోట్లు తక్కువ. గతేడాది కేటాయింపుల కంటే ఈ ఏడా దైనా నిధులు పెరుగుతాయని ప్రజలు ఎదురుచూసినా వారికి నిరాశే ఎదురైంది. మరో వైపు గతేడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు మోడీ సర్కారు ప్రవేశపెట్టిన పీఎంకేవైకీ ఈ బడ్జెట్‌లో నిధులు పెంచలేదు. గతేడాది దీనికి రూ. 75 వేల కోట్లు కేటాయించగా.. అందులో వ్యయం చేసిన మొత్తం రూ. 54 వేల కోట్లే. అదీగాక ఈ పథకానికి ఆధా ర్‌ను అనుసంధానం చేయడంతో లబ్దిదారుల సంఖ్య తగ్గుతున్నదని వార్తలు వస్తు న్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు కోటి మంది రైతులు ఈ పథకానికి అనర్హులుగా తేలే ప్రమాదం ఉన్నదని అవి వెల్లడిస్తున్నాయి. ఇదే నిజమైతే ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరగనుంది. దీంతో మరోసారి రైతులకు మొండిచేయే మిగలనుందని వ్యవసాయ రంగ నిపుణుడు దేవీందర్‌ శర్మ తెలిపారు. ఆయన మాట్లా డుతూ.. ‘ఆర్థిక మంద గమనంను ప్రస్తావిస్తూ, దానిని అధిగమించేందుకు గ్రామీణ ప్రజల చేతిలో డబ్బులు పెట్టే అవకాశాన్ని ఈ బడ్జెట్‌ జారవిడుచుకుంది’ అని అన్నారు. రైతాంగం కోసం తీసుకొచ్చిన మరో పథకం పీఎంఎఫ్‌బీవై.

ఈ ఏడాది బడ్జెట్‌ ప్రసంగంలో దీని ఊసే లేదు. గతంతో పోల్చితే దీనికి కేటాయింపులు పెరిగినా.. గతేడాది ‘ది వైర్‌’ చేసిన పరిశోధనలో ఈ పథకం కింద లబ్దిదారులకు చెల్లింపులు నెలల కొద్దీ పెండింగ్‌లో ఉన్నాయని తేలింది. ఇప్పటికీ ఇది కొనసాగుతూనే ఉండగా సర్కారు దీనినీ పట్టించుకోలేదు. కాగా, రైతులు తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కంటే తక్కువగా వస్తే వారికి పరిహారం అందించే పీఎం ఆశాకూ నిధులను తగ్గించారు. గతేడాది దీనికి రూ. 1,500 కోట్లు కేటాయించగా.. ఈసారి దానిని రూ. 500 కోట్లకు కుదించారు.ఇక, రైతుల ఆదాయం రెట్టింపును ప్రస్తావిస్తూ నిర్మల సీతారామన్‌.. 16 అంశాలతో యాక్షన్‌ ప్లాన్‌ను ప్రకటించారు. ఇం దులో భాగంగా రైతులకు రుణాలను పెంచడం, వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి, మత్స్య రంగాల్ని ప్రోత్సహించడం, జీరో బడ్జెట్‌ సాగుకు ప్రోత్సాహకాలు అందించడం, త్వరగా పాడయ్యే పాలు, కూరగాయల వంటికి రవాణా సదుపాయం కల్పించేందుకు గానూ ‘కిసాన్‌ ఉడాన్‌’, ‘కిసాన్‌ రైల్‌’లను ప్రవేశపెడతామని తెలిపారు. అయితే రెండేండ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో ఈ చర్యలు ఏ మేరకు ఉపయో గపడతాయనే విషయాన్ని మాత్రం కేంద్రం వివరించలేకపోయిందని వ్యవసా యరంగ నిపుణులు విమర్శిస్తున్నారు. ఇంత తక్కువ సమయంలో దీనిని అమలు చేయడం సాధ్యమయ్యే పని కాదనీ, అంతేగాక కేంద్రం దగ్గర అన్ని నిధులు కూడా లేవని వారు విశ్లేషిస్తున్నారు. రానున్న ఐదేండ్లలో భారత్‌ను రూ. 350 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలంటే వ్యవసాయ రంగ వృద్ధిరేటు 5 శాతానికి మించి నమో దు కావాలనీ, కానీ అది ప్రస్తుతం 2.8 శాతం వద్దే ఉన్నదనీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది పెరిగే అవకాశమూ లేదని ఆర్థికవేత్తలే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రైతుల ఆదాయం రెట్టింపు అనేది రెండేండ్లలో సాధ్యమయ్యేది కాదని వారు స్పష్టం చేస్తున్నారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates