గాంధీ ఆస్పత్రిలో సిబ్బంది కొరత

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

రోజురోజుకూ పెరుగుతున్న కొవిడ్‌ రోగులు
సరిపడా వైద్య సిబ్బంది కరువు
ఉన్నవారిలో కొంతమందికి కరోనా
సిబ్బందిని పెంచాలంటున్న జూనియర్‌ డాక్టర్లు
ఇతర ఆస్పత్రులూ సిద్ధం చేయాలని డిమాండ్‌

‘‘మేం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూనే గాంధీలో పనిచేస్తున్నాం. ఇంతకుముందు 65 పడకల ఐసీయూ ఉండేది. కరోనా కేసులు పెరుగుతున్నకొద్దీ వాటిని పెంచుతున్నారు. ఇప్పుడు 200 ఐసీయూ పడకలున్నాయి. వైద్య సిబ్బందిని మాత్రం పెంచలేదు. ఇతర ఆస్పత్రుల్లో పాజిటివ్‌లకు చికిత్స అందించే ఏర్పాట్లు చేయడం లేదు. దీంతో ఇక్కడ పనిచేస్తున్న వారిపైనే భారం పడుతోంది. అన్నిటికీ మమ్మల్నే బాధ్యులను చేస్తున్నారు. ప్రాణాలు పణంగా పెట్టి సేవలందిస్తున్న మాకూ వైరస్‌ సోకుతోంది. గాంధీలో ప్రభుత్వం చెబుతున్నట్లుగా సౌకర్యాలేమీ లేవు’’
– వైద్యుల ఆవేదన

హైదరాబాద్‌: దేశంలో కరోనా రోగులకు మెరుగైన చికిత్స అందించే ఆస్పత్రుల్లో ఒకటిగా నిలిచిన గాంధీ ఆస్పత్రి ఇప్పుడు అభాసుపాలవుతోంది. పెరుగుతున్న కరోనా రోగులకనుగుణంగా వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో ఉన్నవారిపైనే భారం పెరుగుతోంది. గాంధీ ఆస్పత్రిలో తొలి కరోనా కేసు మార్చి 2న నమోదైంది. అప్పటి నుంచి ఏప్రిల్‌ మొదటి వారం వరకు సాధారణంగానే కేసులు రాగా, ఉన్న సిబ్బందితో మెరుగైన వైద్య సేవలందించారు. కానీ, లాక్‌డౌన్‌ సడలింపులతో రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో 1160 పడకలను 1510కి పెంచారు. ఇందుకు అనుగుణంగా సిబ్బందిని మాత్రం పెంచలేదు.

1160 పడకల ఆస్పత్రికి కేవలం 203 మంది సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లు, 180 మంది హౌస్‌ సర్జన్లు, 120 మంది పొరుగు సేవల వైద్యులు, 350 మంది నర్సులు ఉన్నారు. ఈ సిబ్బంది 1160 పడకల ఆస్పత్రిలో సాధారణ వైద్యం అందించేందుకే సరిపోరు. కొవిడ్‌-19 చికిత్స అందించాలంటే షిఫ్టుల వారీగా వైద్య సిబ్బంది హాస్టళ్లు, హోటళ్లలో ఉంటూ ఇళ్లకు వెళ్లకుండా వైద్యం చేయాలి. ఇందుకు ప్రస్తుతమున్న వైద్యులు, సిబ్బందికి నాలుగింతలు అవసరం. కానీ, ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం రెండు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిలో సగం మంది హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. అంటే 1510 పడకలకు కేవలం 150మంది వైద్య సిబ్బందితోనే చికిత్సలు అందించాల్సిన పరిస్థితి.

‘అసలే చాలీచాలని వైద్యులతో గాంధీ ఆస్పత్రిలో రోగులకు చికిత్స అందిస్తుండగా.. ఇప్పుడు వైద్య సిబ్బందికీ వైరస్‌ సోకుతోంది. పాజిటివ్‌ వచ్చిన వారినేగాక వారితో సన్నిహితంగా మెలిగిన వారందరినీ హోం క్వారంటైన్‌కు తరలించాల్సి వస్తోంది. 24 గంటల పాటు విధుల్లో ఉండే వైద్యులు, సిబ్బంది పీపీఈ కిట్‌తోనే ఉండాల్సిన పరిస్థితి. బాత్రుమ్‌కు కూడా వెళ్లలేని స్థితిలో ఉంటారు. కుటుంబ సభ్యులను కలవకుండా ఉంటూ వైద్య సేవలందిస్తున్న సిబ్బందికీ పాజిటివ్‌ రావడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.

కరువవుతున్న వైద్య సేవలు
వైద్యుల్లో ఎక్కువ శాతం మంది విధులకు దూరంగా ఉండాల్సి రావడంతో గాందీకి భారీ సంఖ్యలో వస్తున్న కొవిడ్‌ రోగులకు చికిత్స చేయడం కష్టతరంగా మారింది.లాక్‌డౌన్‌ సడలింపులు చేసినప్పటి నుంచి రోజుకు వంద కేసులు తగ్గకుండా వస్తున్నాయి. దీంతో వైద్య సేవలు కరువవుతున్నాయి. జర్నలిస్టు మనోజ్‌ చికిత్స పొందుతున్న సమయంలో గాంధీలోని పరిస్థితులను బాహ్య ప్రపంచానికి తెలిపాడు.

గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగులకు సరైన వైద్యం అందడం లేదని అంతకుముందే ఎంపీ అసదుద్దీన్‌, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కూడా ఆరోపణలు చేశారు. పలువురు కరోనా రోగులు గాంధీలో ఉండలేమంటూ ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లిపోతున్నారు. ప్రైవేటులో ఫీజుల భారం మోయలేని వారు మాత్రం గాంధీలోనే చికిత్స కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్‌ రోగులకు చికిత్స అందించే ఆస్పత్రులను పెంచాలని జూనియర్‌ డాక్టర్లు డిమాండ్‌ చేస్తున్నారు.

Courtesy Andhrajyothy

RELATED ARTICLES

Latest Updates