విశాఖ గ్యాస్ లీక్ కేసుపై ఎన్జీటీ ఆగ్రహం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– నష్ట పరిహారంగా రూ.50 కోట్లు జమ చేయాలని ఎల్‌జీ పాలిమర్స్‌కి ఆదేశం
– ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు…
– బాధ్యులెవరో త్వరగా తేల్చండి

ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ ఇండియా ప్రయివేట్‌ లిమిటెడ్‌లో స్టైరిన్‌ గ్యాస్‌ లీక్‌పై జాతీయ హరిత ట్రిబ్యునల్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సంస్థ నిర్లక్ష్యం కారణంగా 11 మంది నిండు ప్రాణాలు బలయ్యాయని మండిపడింది. ఈ దుర్ఘటనకి నష్ట పరిహారంగా రూ.యాభై కోట్లు వెంటనే ఏపీ సర్కారుకి జమ చేయాలని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశించింది. ”విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం వెంకటాపురం పరిధిలోని దక్షిణకొరియాకు చెందిన ఎల్‌జీ పాలిమర్స్‌ ఇండియా ప్రయివేట్‌ లిమిటెడ్‌లో స్టైరిన్‌ గ్యాస్‌ లీక్‌ అవ్వడం వల్ల 11 మంది మృతిచెందడం, వందమందికిపైగా ఆస్పత్రి పాలయ్యారని, అందులో 25 మంది పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ మరణాలు, బాధితుల సంఖ్య పెరిగే అవకాశముంది. సుమారు 1000 మందికి పైగా అనారోగ్యానికి గురైనట్టు మీడియా నివేదించింది. పర్యావరణం, పరిసర ప్రాంతాలు కూడా నష్టానికి గురయ్యాయని తెలిపింది” అని పేర్కొంది.

బాధ్యులు ఎవరో త్వరగా తేల్చండి
విశాఖలోని స్టైరిన్‌ గ్యాస్‌ లీక్‌ ఘటనకు దారి తీసిన కారణాలు, ఇందుకు బాధ్యులు ఎవరో తేల్చాలని ఎన్జీటీ ఆదేశించింది. గ్యాస్‌ లీక్‌ ఘటనపై స్థానిక, జాతీయ మీడియా కథనాల ఆధారంగా సుమోటోగా కేసును విచారించిన జస్టిస్‌ ఆదర్శ్‌కుమార్‌ గోయల్‌ నేతృత్వంలోని న్యాయ సభ్యుడు జస్టిస్‌ ఎస్‌.కుమార్‌ సింగ్‌, ఎక్స్‌ఫర్ట్‌ మెంబర్‌ డాక్టర్‌ నగిన్‌ నందాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ప్రమాద తీవ్రత పరిణామాలపై విచారణకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.శేషశయనారెడ్డి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. పర్యావరణం, ప్రజా జీవనం, ప్రజా ఆరోగ్యం దెబ్బతినేందుకు కారణమైన ఎల్‌జీ పాలీమర్స్‌ ఇండియా ప్రయివేట్‌ లిమిటెడ్‌ విశాఖపట్నం జిల్లా మేజిస్ట్రేట్‌ వద్ద రూ.50 కోట్లను డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. విశాఖ ప్రమాదంపై కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ), ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ), విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌, ఎల్‌జీ పాలిమర్స్‌ ఇండియా ప్రయివేట్‌ లిమిటెడ్‌కు నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను మే 18కి ధర్మాసనం వాయిదా వేసింది.

ఘటనపై నివేదిక సమర్పించండి
ప్రమాద ఘటన పరిణామాలు, గ్యాస్‌ లీక్‌ వైఫల్యానికి కారణాలు, ఇందుకు బాధ్యులైన అధికారులు, వ్యక్తులు, ప్రాణనష్టం, ప్రజా ఆరోగ్యం, జీవ రాశులు, నేల, నీరు, వాయు, పర్యావరణానికి వాటిల్లిన నష్టం, బాధితులు, ఆస్తినష్టానికి సంబంధించిన పరిహారం చెల్లింపునకు తీసుకున్న చర్యలు, ప్రమాదం పునరావృతం కాకుండా తీసుకున్న చర్యలు, ప్రమాదంతో తలెత్తిన ఇతర అవాంఛనీయ సమస్యలపై నివేదిక సమర్పించాలని కమిటీని ధర్మాసనం ఆదేశించింది. అందుకు ఎన్జీటీ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.శేషశయనారెడ్డి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. అందులో కమిటీ సభ్యులుగా ఆంధ్రా యూనివర్శిటీ మాజీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ సీహెచ్‌వి రామచంద్రమూర్తి, ఆంధ్రా యూనివర్శిటీ కెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ పులిపాటి కింగ్‌, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) సభ్య కార్యదర్శి, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ డైరెక్టర్‌, వైజాగ్‌ నీర్‌ హెడ్‌లను నియమించింది. ఇందులో జస్టిస్‌ శేషశయనారెడ్డి వైజాగ్‌ చేరే వరకు ఆన్‌లైన్‌లోనూ, కోవిడ్‌-19 నేపథ్యంలో ప్రయాణానికి అవకాశం లేకుంటే సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌, సీపీసీబీ సభ్య కార్యదర్శి ఆన్‌లైన్‌ ద్వారా రిపోర్ట్‌ తయారీలోనూ భాగస్వాములు కావాలని సూచించింది. కమిటీ సాధ్యమైనంత త్వరగా ప్రమాద స్థలికి వెళ్లి తనిఖీ చేసి తదుపరి విచారణకు ఒకరోజు ముందు ఆన్‌లైన్‌లో ఎన్‌జీటీకి నివేదిక సమర్పించాలని సూచించింది. కమిటీకి అవసరమైన సాంకేతిక, ఇతర సహాయాలను చేయాలని సీపీసీబీని ఎన్‌జీటీ ఆదేశించింది. నివేదిక తయారీకి అవసరమైతే నిపుణులు, వ్యక్తులు, సంస్థల సహాయాన్ని స్వేచ్ఛ కమిటీకి ఉందని ధర్మాసనం పేర్కొంది. నిజనిర్ధారణ కమిటీకి అవసరమైన అన్ని సహాయ సహకారాలను విశాఖపట్నం కలెక్టర్‌ అందించాలని కూడా ఎన్‌జీటీ ఆదేశించింది.

జాగ్రత్తలు పాటించడంలో విఫలం
స్టైరిన్‌ ప్రమాదకర వాయువని పేర్కొన్న ధర్మాసనం నష్ట నివారణకు ప్లాంట్‌ వద్ద ఆన్‌సైట్‌, ఆఫ్‌సైట్‌ అత్యవసర ప్రణాళికలు అవసరమని అభిప్రాయపడింది. ప్రమాదకర వాయువు నుంచి నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించడంలో విఫలమైనట్టు కనిపిస్తున్నదని వ్యాఖ్యానించింది.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates