ఉద్యోగభద్రతకు ముప్పు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
Image result for - పారిశ్రామిక సంబంధాల స్మృతి-2019 చట్టంగా మారితే.." పారిశ్రామిక సంబంధాల స్మృతి-2019 చట్టంగా మారితే..
– ఇక రానున్నవి ఏడాది, రెండేండ్ల ఒప్పంద ఉద్యోగాలే
– యాజమాన్యం దయపై కార్మికుల జీవితాలు..?
న్యూఢిల్లీ: కార్మిక చట్టాల్లో మార్పులకు కేంద్రంలోని మోడీ సర్కార్‌ రహస్య విధానాన్ని అనుసరిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కార్మికులు, యజమానులకూ మధ్య సంబంధాల్లో మోడీ సర్కార్‌ తేనున్న మార్పులు ప్రభుత్వ, ప్రయివేట్‌ రంగాల్లోని కోట్లాది ఉద్యోగులకు ఆందోళన కలిగిస్తున్నాయి. అంతేకాదు, భవిష్యత్‌ తరాలు కూడా ఏదో ఓ ఉద్యోగం ఉంటే చాలు అనే అభిప్రాయాల్ని వీడేలా చట్టాల్లో మార్పులకు రంగం సిద్ధమైంది. గత నెల 28న లోక్‌సభలో మోడీ ప్రభుత్వం పారిశ్రామిక సంబంధాల స్మృతి(ఐఆర్‌సీ)-2019 ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టింది. 2017లో బహిర్గతపరిచిన ముసాయిదా బిల్లులో కార్మిక వ్యతిరేక నిబంధనల పట్ల దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. దాంతో, ఈసారి మోడీ సర్కార్‌ ముసాయిదా బిల్లును గుట్టు చప్పుడు కాకుండా పార్లమెంట్‌ ముందుకు తెచ్చింది. దీంతో పార్లమెంట్‌ సభ్యులేగాక కార్మిక సంఘాలు, దేశంలోని ప్రభుత్వ,ప్రయివేట్‌ ఉద్యోగులూ ఆశ్చర్యపోయారు. ఎందుకీ రహస్యమన్నది ఎవరికీ అర్థంకాని పరిస్థితి.
ఐఆర్‌సీ ఇప్పుడున్న మూడు కీలక చట్టాలను మార్చనున్నది. అవి: కార్మిక సంఘాల చట్టం-1926, పారిశ్రామిక ఉద్యోగాల చట్టం-1946, పారిశ్రామిక వివాదాల చట్టం-1947. ఇందులో మొదటిది కార్మిక సంఘాల ఏర్పాటుకు సంబంధించిన విధి విధాలను తెలిపేది. మిగతా రెండు కార్మికులకూ యజమా నులకూ మధ్య ఉండే సంబంధాలను నిర్దేశించేవి.
బిల్లు పార్లమెంట్‌ ముందుంచడంతో అది ఇక బహిర్గతమైనట్టే. ఇప్పటికే అందులోని నిబంధనల పట్ల కార్మిక సంఘాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. వర్షాకాల సమావేశాల్లో కార్మిక చట్టాలకు సంబంధించిన రెండు బిల్లులను మోడీ సర్కార్‌ పార్లమెంట్‌ ముందు ఉంచగా ఒకటి ఆమోదం పొందింది. మరొకటి స్థాయీ సంఘం ముందుంది. ఇప్పుడిది మూడో బిల్లు. కార్మికుల హక్కులను కాల రాసేలా ఉన్న ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ 2020 జనవరి 8,9 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు జాతీయ కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా పిలుపునిచ్చాయి. ఐఆర్‌సీలోని నిబంధనలు కార్మిక సంఘాల ఏర్పాటును కఠినతరం చేసేలా ఉన్నాయి. కార్మికుల హక్కుల కోసం సంఘటిత ఉద్యమాలను నిరోధించే లక్ష్యంతోనే కేంద్ర సర్కార్‌ కఠిన నిబంధనలతో చట్టాల్ని మారుస్తున్నదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.
ఉద్యోగ భద్రతకు చెల్లు చీటీ
ఐఆర్‌సీలోని సెక్షన్‌ 2 క్లాజ్‌(1) ప్రకారం నిర్ణీతకాల ఉద్యోగం అంటే కార్మికుడు నిర్ణీత కాలానికి ఒప్పందంపై సంతకం చేసి ఉద్యోగంలో చేరాలి. ఇందులోని అంశాలు: (ఏ) అదే పని చేసే శాశ్వత ఉద్యోగికున్నట్టే పని గంటలు, వేతనాలు ఇతర సౌకర్యాలుంటాయి. (బీ) నిర్ణీత కాలం వరకూ శాశ్వత ఉద్యోగికుండే చట్టబద్ధ సౌకర్యాలన్నిటికీ అర్హత ఉంటుంది.
ఈ నిబంధనల అర్థమేమంటే యజమాని తనకు ఇష్టమైనంత కాలం ఒకటి లేదా రెండు సంవత్సరాలు, వగైరా కాలానికి ఒప్పంద ఉద్యోగులను నియమించుకొని ఆ తర్వాత బయటకు పంపించే వీలుంటుంది.
యాజమాన్యాన్ని ప్రశ్నించకుండా..!
యజమాని దయతోనే కార్మికుల ఉద్యోగాలకు హామీ ఉంటుంది. ఓ ఏడాది ఒప్పంద ఉద్యోగమంటే.. ఆ ఏడాదిపాటు యాజమాన్యం తమను వేధించినా, తమ హక్కులకు భంగం కలిగించినా కార్మికులు నోరు మెదపకుండా, నిరసన తెలపకుండా ఉండాలి. అలా ఉంటేనే యాజమాన్యం ఆ తర్వాత మరో ఒప్పందం ద్వారా మరింత కాలం కొనసాగనిస్తుంది. కార్మికులను సంఘాలు పెట్టుకోకుండా, తమ సమస్యలపై సంఘటిత పోరాటాలు నిర్వహించకుండా కట్టడి చేయడానికే మోడీ సర్కార్‌ ఇలాంటి నిబంధనలను తెస్తోందని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగ భద్రతను తొలగించడంతో కార్మికులు తమ, తమ పిల్లల భవిష్యత్‌ పట్ల ఎలాంటి ప్రణాళికలు లేకుండా నిరంతర ఆందోళనతో జీవించే దుస్థితిని ఈ కొత్త నిబంధనలు సృష్టించనున్నాయి.
పారిశ్రామికవేత్తలు నడిపేది దాతృత్వ సంస్థలు కాదుగా..? అంటూ యాజమాన్యం తరఫున వాదన వినిపించేవారూ ఉన్నారు. అయితే, ఆయా పరిశ్రమల అభివృద్ధి నేపథ్యాన్ని పరిశీలిస్తే ఈ ప్రశ్న అర్థ రహితమని ఆర్థికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. పరిశ్రమలపై ప్రభుత్వ వార్షిక సర్వే నివేదికల ప్రకారం కార్మికుల శ్రమశక్తి వల్లే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమైందని గణాంకాల్లో తేలింది. చాలా పరిశ్రమలు కార్మికులతో ఎక్కువ గంటలు పని చేయించి అధిక లాభాలు గడించాయని వెల్లడైంది. ఇటీవల(మోడీ సర్కార్‌ హయాంలో) పారిశ్రామిక రంగం మందగించిందే తప్ప, గతమంతా పారిశ్రామిక ఉత్పత్తులు ఏటేటా పెరుగుతూ వచ్చాయన్నది గమనార్హం.

(Courtesy: NT)

RELATED ARTICLES

Latest Updates