సదువుకొనేలా..!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • జాతీయ విద్యా విధానం-2019లో సమాధానంలేని ప్రశ్నలెన్నో 
  • విద్యారంగంపై ఊహాజనితమైన లెక్కలు
  • భారమంతా రాష్ట్రాలపై తోసే ప్రయత్నం : రాజకీయ విశ్లేషకులు

ఒకటి కొంటే ఒకటి ఉచితం. ఫలానా టీవీ, ఫలానా వాషింగ్‌మెషిన్‌ కేవలం రూ.9999 మాత్రమే. ఇలాంటి వాణిజ్య ప్రకటనలు వార్తా పత్రికల్లో తరుచూ వస్తుంటాయి. అయితే ప్రకటనలో ఎక్కడో ఒక చోట ‘చుక్క గుర్తు’ చిన్న సైజ్‌లో కనపడుతుంది. దీనర్థం ‘కండీషన్స్‌ అప్లై'(షరతులు వర్తిస్తాయి). కొద్ది రోజుల క్రితం మోడీ సర్కార్‌ తీసుకొచ్చిన ‘జాతీయ విద్యా విధానం’ ముసాయిదా-2019 (ఎన్‌ఈపీ) కూడా అలాంటిదేనని విద్యారంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆకట్టుకునే అద్భుతమైన పదాలతో ‘ఎన్‌ఈపీ’ విధానంలో ప్రతిపాదనలు ఉన్నా, అవి వాస్తవంగా అమలయ్యే అవకాశమే లేదని వారు అంటున్నారు.

ఒక దేశంలో ఉండే విద్యావిధానం ఆ దేశ ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. పటిష్టమైన విద్యావిధానానికి…ఆర్థికవిధానమూ (బడ్జెట్‌ వాస్తవ కేటాయింపులు) తోడైతేనే మంచి ఫలితాలు సాధ్యం. కానీ మోడీ సర్కార్‌ తెరమీదకు తెచ్చిన విద్యావిధానం అద్భుతమైన, ఆకర్షణీయమైన పదాలతో నింపేశారు. నిధుల వ్యయం దగ్గరకు వచ్చేసరికి రాష్ట్రమే అంతా చూసుకుంటుందని తప్పించుకునే ఎత్తుగడ వేశారు. ఊహాత్మకమైన ఆర్థిక గణాంకాలతో విద్యారంగానికి కేటాయింపులు పెరుగుతాయని చూపారు.
డా.కస్తూరిరంగన్‌ కమిటీ వేసిన అంచనా ఏంటంటే…దేశ ఆర్థికవ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందినప్పుడు, జీడీపీలో పన్నుల వాటా అనూహ్యంగా పెరిగినప్పుడు ‘విద్యారంగా’నికి నిధుల కేటాయింపులు పెరుగుతాయి. మొత్తం విద్యారంగంపై కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న వ్యయం పదేండ్లలో రెట్టింపు అవుతుందని చెప్పింది. ఇది పూర్తిగా ఊహాజనితమైన అంశమనీ, కచ్చితంగా ఇంత ఖర్చుచేస్తామన్న విధానపరమైన ‘కమిట్‌మెంట్‌’ ఇందులో లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఆర్థికవృద్ధి అనూహ్యంగా పెరిగినా! జీడీపీలో పన్నుల వాటా పెరిగినా కూడా ‘విద్యారంగానికి’ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయింపులు పెంచలేదని వారు చెబుతున్నారు. ఉదాహరణకు, 2012-2016మధ్య వార్షిక జీడీపీ వృద్ధిరేటు 5.5శాతం నుంచి 7.2శాతానికి (బడ్జెట్‌ ప్రసంగంలో కేంద్రం చెప్పినవి) పెరిగింది. జీడీపీలో పన్నుల వాటా కూడా పెరిగింది. మొత్తం ప్రభుత్వ వ్యయం కూడా 27.1 నుంచి 27.5శాతానికి (జీడీపీలో) పెరిగింది. కానీ విద్యారంగంపై వ్యయం 11.6శాతం నుంచి 10శాతానికి తగ్గింది.

‘ఎడ్యుకేషన్‌ సెస్‌’ ఎక్కడ?
‘ఎన్‌ఈసీ’ ముసాయిదాలో ‘సెస్‌'(పన్నులు)ల గురించి కూడా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆదాయ పన్నుపై 3శాతం ‘విద్యా సెస్‌’ను కేంద్రం వసూలుచేస్తోంది. ఇందులో 2శాతం పన్ను ద్వారా పోగవుతున్న నిధుల్ని ‘ప్రారంభిక్‌ శిక్షా కోశ్‌'(పీఎస్‌కే)కు వెళ్తోంది. ఇదంతా కూడా దేశవ్యాప్తంగా ‘ప్రాథమిక విద్య’ కోసం ఖర్చు చేస్తున్నామని కేంద్రం చెబుతోంది. మిగిలిన 1శాతం పన్ను ఆదాయాన్ని సెకండరీ, హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కోసం ఖర్చు చేస్తున్నట్టు లెక్కలు చూపుతోంది. అయితే కేంద్రం కాగితాలపై చూపే లెక్కలకి, వాస్తవ లెక్కలకి ఎంత తేడా ఉందో ‘కాగ్‌’ అనేకమార్లు బయటపెట్టింది. ‘విద్యా సెస్‌’ ఎలా దుర్వినియోగం చేస్తున్నారో ఆధారాలతో సహా బయటపెట్టింది.

2017-18కి సంబంధించి కాగ్‌ నివేదిక ఏమందంటే, విద్యా సెస్‌ ద్వారా సమకూరిన దాంట్లో రూ.2వేల కోట్ల నిధుల్ని కేంద్రం దారిమళ్లించింది. సెకండరీ, హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కోసమని కేంద్రం (2007 నుంచి 2017) వసూలుచేసిన దాంట్లో రూ.94వేల కోట్లు వ్యయం కాలేదు. అంటే ఏ ఉద్దేశం కోసం ఈ విద్యా పన్నును ఏర్పాటుచేసి వసూళ్లు చేస్తున్నామో ఆ ఉద్దేశాన్ని కేంద్రం నెరవేర్చలేకపోయింది. ‘విద్యా పన్ను’పై సమగ్రమైన సూచనలు ‘ఎన్‌ఈపీ’ చేయలేదన్న విమర్శ ఉంది.
‘విద్య’ అన్నది కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలోని అంశం. విద్యారంగంపై కేంద్రానికి, రాష్ట్రానికి సమాన బాధ్యత ఉంది. ఇందులో ఆయా రాష్ట్రాలు చేస్తున్న వ్యయంతో పోల్చితే, కేంద్రం చేస్తున్నది చాలా చాలా స్వల్పం. ఆర్థిక వనరుల సమీకరణ ద్వారా కేంద్ర వ్యయం పెరగాలని 14వ ఆర్థికసంఘం సైతం సూచించింది. ఈ అంశంపై ‘ఎన్‌ఈపీ’లో ఎక్కడా ప్రస్తావన రాకపోవటాన్ని నిపుణులు తప్పుబడుతున్నారు.

ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహన్న భోజన పథకానికి, నాలుగేండ్ల ఇంటిగ్రేటెడ్‌ బి.ఎడ్‌ కోసం పెద్ద ఎత్తున మానవ వనరులు కోసం పెద్ద ఎత్తున నిధులు అవసరం. వాటికోసం కేంద్రం ఏవిధంగా రాష్ట్రాలకు ఆర్థిక సహకారం ఇస్తుందో ‘ఎన్‌ఈపీ’లో తెలుపలేదు. మరోక ముఖ్యమైన అంశం ఇకపై పంచవర్ష ప్రణాళికల కింద రాష్ట్రాలకు వచ్చేది ఆగిపోవటం. దీంతో ఆయా రాష్ట్రాలు స్వంత ఆర్థిక వనరులపై అక్కడి విద్యారంగం ఆధారపడి ఉంటుంది. కొత్తగా టీచర్ల నియామకం, నూతన భవనాల నిర్మాణం అంతా కూడా రాష్ట్రమే చూసుకోవాలనీ, తమను ఒక్కపైసా అడగటానికి వీల్లేదని మోడీ సర్కార్‌ తేల్చేసింది. అలాంటప్పుడు ‘విద్య’ అన్నది ఉమ్మడి అంశం ఎలా అవుతుందని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

(COURTECY SAKSHI)

RELATED ARTICLES

Latest Updates