ప..ప..చ..జ..!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

మునిసిపల్‌ ఎన్నికల్లో ఓటర్లు వీళ్లు!
కామారెడ్డి మునిసిపాలిటీ! 31వ వార్డు!
ఓటరు క్రమ సంఖ్య 108! ఇంతకీ ఆ ఓటరు పేరు ఏమిటో తెలుసా!? ‘ప.. ప’! అదే వార్డులో 31 క్రమ సంఖ్య గల
ఓటరు పేరును
‘చ’ గా.. తండ్రి పేరును ‘జ’ గా ముద్రించారు.

బడంగ్‌పేట కార్పొరేషన్‌లో ఓ యువతి పేరు స్థానంలో ‘కు’ అనే అక్షరం ముద్రించారు. ఆమె భర్త పేరు వద్ద ‘కకక’ అని మూడక్షరాలు ఉంచారు. ఇదే కార్పొరేషన్లోని 237 పోలింగ్‌ స్టేషన్‌లో అనేక మందికి ఎలాంటి పేర్లు లేకుండా కేవలం ‘డాట్స్‌’ (చుక్కలు) పెట్టి వదిలేశారు. వాటి తరఫున ఎవరు ఓటేయాలో!?

మీర్‌పేట్‌ కార్పొరేషన్‌లో నందిహిల్స్‌కు చెందిన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సామిడి గోపాల్‌ రెడ్డి ఇంట్లో ముగ్గురు ఓటర్లు ఉన్నారు. పదో వార్డులో ఉండాల్సిన ఆయన ఓటును తీసుకెళ్లి 28వ వార్డులో పడేశారు. ఆయన భార్య ఓటును ఇంకో వార్డులో, కొడుకు ఓటును మరో వార్డులో వేశారు. దీనిపై ఆయన మునిసిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలో తెలియక తల పట్టుకుంటున్నారు.

  • కొన్నిచోట్ల డాట్‌ (.)లు కూడా ఓటర్లే
  • తప్పుల తడకలుగా ఓటర్ల జాబితాలు
  • ఎస్సీ ఓటర్లు బీసీలుగా.. బీసీలు ఎస్టీలుగా
  • కుల గణన అస్తవ్యస్తం.. అయోమయం
  • రామగుండం 9వ డివిజన్‌లో 130 మంది
  • ఎస్సీలు ఇతర కులాల్లో నమోదు
  • ఇతర వార్డులు, డివిజన్లలోనూ ఇదే తీరు
  • రిజర్వేషన్లు మారిపోతాయని ఆందోళన
  • పట్టణాల్లో ఓటర్లు, నాయకుల గగ్గోలు
  • అధికారులకు పెద్దఎత్తున ఫిర్యాదులు

వివిధ మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో రెండు రోజుల కిందట విడుదల చేసిన ఓటర్ల జాబితాల్లోని విచిత్రాలివి! చాలా మునిసిపాలిటీల్లో జాబితాలన్నీ తప్పుల తడకలు! చనిపోయిన వారి పేర్లు జాబితాలో ఉన్నాయి. బతికి ఉన్నవారి పేర్లు మాయమయ్యాయి. భార్యాభర్తల పేర్లు వేర్వేరు వార్డుల్లో నమోదయ్యాయి. ఒక్కరి పేరే అదే జాబితాలో వరుసగా మూడు నాలుగుసార్లు వచ్చేసింది. కొన్ని వార్డుల్లో ఆశావహుల పేర్లను పక్క వార్డుల్లో చేర్చారు. చాలా మునిసిపాలిటీల్లో కులాలవారీగా ఓటర్ల గణన చేపట్టలేదు. ఎస్సీ ఓటర్లను బీసీలుగా; బీసీ ఓటర్లను ఎస్టీలుగా చేర్చారు. దాంతో, ఓటర్లు గగ్గోలు పెడుతున్నారు. అభ్యంతరాల స్వీకరణకు గురువారం సాయంత్రంతో గడువు ముగిసిపోయింది. శుక్రవారం అభ్యంతరాలను పరిష్కరించి శనివారం తుది జాబితాను విడుదల చేయనున్నారు. దాంతో, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో మరింత ఆందోళన నెలకొంది.

తప్పులే.. తప్పులు: రాష్ట్రవ్యాప్తంగా వివిధ మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పేర్లు తప్పులతడకగా వచ్చాయి. తాండూరు మునిసిపాలిటీ పరిధిలోని 19వ వార్డులో రేణుక ఫొటో ఓటర్ల జాబితాలో ఉన్నారు. ఆమె పేరును రేషా బేగంగా మార్చేశారు. జల్‌పల్లి మునిసిపాలిటీ పరిధిలో ఎండీ షఫీఖ్‌కు బదులుగా మనోహర్‌ డి రఫీక్‌ అని పేర్కొన్నారు. జవహర్‌నగర్‌ మునిసిపాలిటీ పరిధిలో సుజాత పేరును తెలంగాణ అని; ఆమె భర్త పేరును కూడా తెలంగాణ అని పేర్కొన్నారు. తుర్కయాంజాల్‌ మునిసిపాలిటీలోని 8వ వార్డు ఓటర్ల జాబితాలో ఇంటి నంబర్‌ 2-122పై ఓటరు పేరు ‘గ’ అని; తండ్రి పేరు ‘గ’ అని ప్రచురించారు. వాస్తవంగా, ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరో తెలియదని స్థానికులు చెబుతున్నారు. ఇదే వార్డులో సుమారు 10 పేర్లు ఇలాగే వచ్చాయి. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ మునిసిపాలిటీలోని ఒకటో వార్డులో సుమారు సగం మంది ఓటర్లను 13వ వార్డులోకి మార్చేశారు. శంకర్‌పల్లి మునిసిపాలిటీ పరిధిలో ప్రతి వార్డులో సుమారు 100 మంది ఓట్ల వరకు తప్పుగా ముద్రించారు. బీర్ల రాము పేరు రెండుసార్లు ఉంచారు. శంకర్‌పల్లి రెండో వార్డులో ముత ్యం బుచ్చయ్య చనిపోయినా పేరు తొలగించలేదు. శంకర్‌పల్లి బ్లూ ఉడ్స్‌ కాలనీలో నివసించే వ్యక్తి పేరుకు బదులు ‘స’.. తండ్రి పేరును కూడా ‘స’ అంటూ ముద్రించారు. హుస్నాబాద్‌ మునిసిపాలిటీ ఓటరు జాబితాలో 17,259 మంది ఓటర్లు ఉండగా.. అందులో చనిపోయిన 200 మంది పేర్లు కూడా ఉన్నాయి. మరో 200 మంది పేర్లు రెండుసార్లు నమోదయ్యాయి. ఉదాహరణకు వరుస క్రమం 292లో దొడ్డ హర్షవర్ధన్‌రెడ్డి పేరుకు బదులు ‘తెలంగాణ తెలంగాణ’ అని నమోదు చేశారు. వరుస క్రమం 321లో ‘శారద’ పేరుకు బదులు ‘రకగబహ’ అని, ఆమె తండ్రి ‘పరహబ’ అని నమోదైంది. వరుస క్రమం 325లో పేరును ‘లః గదా జ డ ప బీరు’ అని నమోదు చేశారు. వరుస క్రమం 888, 899, 900 నంబర్లలో ఒకే ఓటరు పేరు ‘శ్రీమూర్తి రాకేష్‌’ అని నమోదైంది. చిప్ప విజయ అనే మహిళా ఓటరు వద్ద పురుషుడి ఫొటోను ముద్రించారు. తప్పుల తడక ఓట్లపై మునిసిపాలిటీల్లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

జాబితాల్లో బోగస్‌ ఓట్లు: మిర్యాలగూడ పట్టణంలో బోగస్‌ ఓట్లు జాబితాలో దర్శనమిచ్చాయి. ఓ ఇంట్లో దాదాపు 20 బోగస్‌ ఓట్లను గుర్తించారు. పట్టణంలోని బంగారుగడ్డలో ఉన్న 30వ వార్డులో బోగస్‌ ఓట్లు బయటపడ్డాయి. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని బీరంగూడ రాఘవేంద్ర కాలనీ ఓటరు జాబితాలో 150 మందికిపైగా స్థానికేతరుల ఓట్లున్నాయి. వనపర్తి, కొత్తకోట మునిసిపాలిటీలో ఎక్కువగా చనిపోయిన వ్యక్తుల పేర్లతో ఓట్లు ఉన్నాయి. ఇదే పరిస్థితి చాలా మునిసిపాలిటీల్లో నెలకొంది. కొన్ని మునిసిపాలిటీల్లోని కొన్ని వార్డుల్లో చనిపోయిన వారి పేరిట దాదాపు వంద వరకూ ఓట్లు ఉన్నాయన్న ఆరోపణలు వచ్చాయి.

రిజర్వేషన్లపైనా ప్రభావం: చాలా మునిసిపాలిటీల్లో కులాల వారీగా ఓటర్ల గణన సక్రమంగా చేపట్టలేదు. ఎస్సీ ఓటర్లను బీసీలుగా, బీసీ ఓటర్లను ఎస్టీలుగా జాబితాల్లో చేర్చారు. వీటిపై 74 ఫిర్యాదులు వచ్చాయి. సాయిపూర్‌లోని 12వ వార్డులో బీసీ ఓటర్లను ఎస్టీ జాబితాలో చేర్చారు. రామగుండం మునిసిపాలిటీ పరిధిలోని 9వ డివిజన్‌లో సుమారు 130 మంది ఎస్సీ ఓటర్లను ఇతర కులాల జాబితాలో గుర్తించారని, దీనివల్ల డివిజన్‌ రిజర్వేషన్‌పై ప్రభావం చూపుతుందనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సుల్తానాబాద్‌ మునిసిపాలిటీలోని 4వ వార్డులో ఎస్సీ ఓటర్లు అధికంగా ఉన్నా తక్కువగా చూపారని ఫిర్యాదులు వచ్చాయి. కరీంనగర్‌ కార్పొరేషన్‌ 51వ డివిజన్‌లో బీసీలను ఓసీలుగా చేర్చారు. 34వ డివిజన్‌లో బీసీ వర్గానికి చెందిన నూర్‌ బాషా (దూదేకుల) కులానికి చెందిన 800 మందిని ఓసీలుగా గుర్తించారు. 4వ డివిజన్‌లో దాదాపు 300 మంది ఓసీలను బీసీ, ఎస్సీలుగా గుర్తించారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉండగా.. దాదాపు అన్ని డివిజన్లలో కుల గణన సరిగా చేయలేదని అధికార టీఆర్‌ఎస్‌ సహా అన్ని పార్టీల నాయకులు అభ్యంతరాలతో వినతి పత్రాలను సమర్పించారు.

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ మునిసిపాలిటీలోని 2వ వార్డులో భర్త బీసీగా ఉంటే భార్యను ఓసీగా మార్చారు. 27వ వార్డులో తల్లిదండ్రులు ఎస్సీలుగా ఉండగా వారి కుమారులను బీసీలుగా చేర్చారు. ఇబ్రహీంపట్నం మునిసిపాలిటీ 3వ వార్డుకు చెందిన బత్తుల నాగభూషణం ఎస్సీ. కానీ, ఆయనను బీసీగా చూపారు. ఆయన భార్య యాదమ్మను ఎస్సీగా చూపారు. కాగా, ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో విడుదల చేసిన జాబితాలో సుమారు 10 వేల మంది ఓటర్ల కులాన్ని తప్పుగా పేర్కొన్నారు. ఇలాంటి తప్పులు వార్డుల రిజర్వేషన్లపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates